ట్రెసా, గాయత్రి సంచలనం

ట్రెసా, గాయత్రి సంచలనం– వరల్డ్‌ నం.2పై మెరుపు విజయం
– సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750
సింగపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ యువ జోడీ ట్రెసా జాలి, గాయత్రి పుల్లెల అద్భుతం చేశారు. మహిళల డబుల్స్‌ సర్క్యూట్‌లో అతిపెద్ద విజయం నమోదు చేశారు!. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీ మహిళల డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.2 జోడీ బేక, లీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించారు. గంట పాటు సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా జోడీ 21-9, 14-21, 21-15తో మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందారు. వరల్డ్‌ నం.2 జోడీపై తొలి గేమ్‌లో గాయత్రి, ట్రెసా ఖతర్నాక్‌ గేమ్‌ ఆడారు. 11-8తో విరామ సమాయనికి ఆధిక్యంలో నిలిచి.. ద్వితీయార్థంలో ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ మాత్రమే ఇచ్చారు. రెండో గేమ్‌లో బేక్‌, లీ పుంజుకుని లెక్క సమం చేశారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మనోళ్లు మెరిశారు. 11-9తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచారు. ద్వితీయార్థంలో వరుసగా ఆరు పాయింట్లు సాధించిన గాయత్రి, ట్రెసా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు. 21-15తో బేక్‌, లీని చిత్తు చేసిన గాయత్రి, ట్రెసా క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నారు. వరల్డ్‌ నం.30 భారత జోడీకి బేక్‌, లీ పై ఇదే తొలి విజయం కావటం విశేషం.
మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు పరాజయం పాలైంది. ప్రీ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) 13-21, 21-11, 22-20తో సింధుపై విజయం సాధించింది. మూడు గేముల ఉత్కంఠ పోరు టైబ్రేకర్‌ వరకు వెళ్లగా.. స్పెయిన్‌ స్టార్‌ పైచేయి సాధించింది. థారులాండ్‌ ఓపెన్‌లో ఫైనల్స్‌కు చేరిన సింధు.. సింగపూర్‌ ఓపెన్‌ నుంచి రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు నిరాశపరిచాడు. 13-21, 21-14, 15-21తో కెంటా నిషిమోట (జపాన్‌)కు క్వార్టర్స్‌ బెర్త్‌ కోల్పోయాడు.

Spread the love