ఢిల్లీ ధనాధన్‌

Delhi Dhanadhan– ముంబయిపై మెరుపు విజయం
– చెలరేగిన జేక్‌ ఫ్రేసర్‌, స్టబ్స్‌
– ఢిల్లీ 257/4, ముంబయి 247/9
ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఐదో గెలుపు ఖాతాలో వేసుకుంది. భారీ స్కోర్ల థ్రిల్లర్‌లో ముంబయి ఇండియన్ప్‌పై గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. జేక్‌ ఫ్రేసర్‌ (84) మెరుపులతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ 257 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 247 పరుగులకు పరిమితమైంది. పది పరుగుల తేడాతో ఢిల్లీ జయకేతనం ఎగురవేసింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఐపీఎల్‌ 17వ సీజన్లో భారీ స్కోర్ల జోరు కొనసాగుతుంది. ఫిరోజ్‌ షా కోట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ థ్రిల్లర్‌లో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. జేక్‌ ఫ్రేసర్‌ (84, 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (48 నాటౌట్‌, 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), షారు హౌప్‌ (41, 17 బంతుల్లో 5 సిక్స్‌లు) చెలరేగటంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగులు చేసింది. రికార్డు ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులే చేసింది. తెలుగు తేజం తిలక్‌ వర్మ (63, 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (46, 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్‌ డెవిడ్‌ (37, 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఛేదనలో మెరిసినా.. ముంబయి ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. సీజన్లో ఆరో పరాజయం చవిచూసిన హార్దిక్‌పాండ్య సేన ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ చిచ్చరపిడుగు జేక్‌ ఫ్రేసర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
పోరాడినా.. : ముంబయి ఇండియన్స్‌ లక్ష్యం 258 పరుగులు. గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 262 పరుగుల లక్ష్యాన్ని ఊదేయటంతో ముంబయి ఇండియన్స్‌ సైతం అదే బాటలో నడుస్తుందని అనుకున్నారు. కానీ ఆరంభం ముంబయి ఇండియన్స్‌కు కలిసి రాలేదు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (20), రోహిత్‌ శర్మ (8) సహా సూర్యకుమార్‌ యాదవ్‌ (26)లు పవర్‌ప్లేలోనే వికెట్‌ చేజార్చుకున్నారు. దీంతో ఆరు ఓవర్లలో 65 పరుగులకు ముంబయి ఇండియన్స్‌ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ముంబయి లక్ష్యం దిశగా సాగుతుందని అనిపించలేదు. కానీ తెలుగు తేజం తిలక్‌ వర్మ (63), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (46) ముంబయి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. తిలక్‌ వర్మ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్థ సెంచరీ బాదగా.. పాండ్య సైతం ఓ ఎండ్‌లో దంచికొట్టాడు. ఈ ఇద్దరి నిష్క్రమణతో మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతుల్లోకి వెళ్లింది. టిమ్‌ డెవిడ్‌ (37) డెత్‌ ఓవర్లలో మెరుపు బ్యాటింగ్‌తో ముంబయి ఆశలను సజీవంగా నిలిపాడు. ఆఖరు ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా.. ముంబయి ఇండియన్స్‌ ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (3/59), రాషిక్‌ సాలెం (3/34), ఖలీల్‌ అహ్మద్‌ (2/45) వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు ముంబయి ఇండియన్స్‌ 247 పరుగులే చేసింది. 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపొందింది.
బ్రేక్‌ లేని జేక్‌ : యువ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేసర్‌ (84) ధనాధన్‌ దంచికొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేసింది. 8 ఫోర్లు, 3 సిక్సర్లతో విశ్వరూపం చూపింపిన జేక్‌ 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. జేక్‌ దూకుడుతో పవర్‌ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 92 పరుగులు పిండుకుంది. అభిషేక్‌ పోరెల్‌ (36), షారు హౌప్‌ (41) సైతం దూకుడుగా ఆడారు. రిషబ్‌ పంత్‌ (29), స్టబ్స్‌ (48 నాటౌట్‌) ధనాధన్‌ కొనసాగించటంతో ముంబయి ఇండియన్స్‌ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బుమ్రా (1/35), పియూశ్‌ చావ్లా (1/36) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

Spread the love