ఫ్యాన్‌ వార్స్‌ స్పోర్ట్స్‌లో తగదు

ఫ్యాన్‌ వార్స్‌ స్పోర్ట్స్‌లో తగదు– హార్దిక్‌ పాండ్యకు అశ్విన్‌ మద్దతు
ముంబయి : భారతీయ సినిమా సంస్కృతి, ఫ్యాన్‌ వార్స్‌ కల్చర్‌ ఇప్పుడు భారత క్రికెట్‌లోకి ప్రవేశించిందని సీనియర్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. హీరో ఆరాధన, హీరో కోసం ఫ్యాన్‌ వార్స్‌ సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు స్పోర్ట్స్‌లోనూ అదే తరహా కల్చర్‌ కనిపిస్తుంది. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లో హార్దిక్‌ పాండ్యను అభిమానులు హేళన చేశారు. ఇటువంటి సంస్కృతి ఏ మాత్రం మంచిది కాదని, అభిమానులు దీన్ని సరి చేసుకోవాలని అశ్విన్‌ కోరాడు. ‘మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, పీఆర్‌ వంటివి ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. హార్దిక్‌ పాండ్య మన ఆటగాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. మనం ఎవరిని హేళన చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇటువంటివి ఎప్పుడైనా చూశామా?. భారత క్రికెట్‌లోనూ గంగూలీ సారథ్యంలో సచిన్‌.. సచిన్‌ సారథ్యంలో గంగూలీ ఆడారు. ఈ ఇద్దరూ రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో ఆడారు. ఈ ముగ్గురు అనిల్‌ కుంబ్లే సారథ్యంలో ఆడారు. ఈ నలుగురు దిగ్గజాలు ఎం.ఎస్‌ ధోని జట్టులో ఉన్నారు. విరాట్‌ కెప్టెన్సీలో ధోని ఆడాడు. ఆటలో ఇవన్నీ సర్వ సాధారణం. అభిమానులకు నచ్చిన క్రికెటర్‌, జట్టు, ప్రాంఛైజీకి ఛీర్స్‌ కొట్టండి. కానీ అది మరో ఆటగాడిని హేళన చేసి కాదు’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో అన్నాడు. ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఏప్రిల్‌ 1న ముంబయి వాంఖడేలో తలపడనున్నాయి. హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా తొలిసారి హోమ్‌ గ్రౌండ్‌ వాంఖడేలో ఆడనుండగా.. అభిమానుల స్పందన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Spread the love