జీహెచ్‌ఎంసీలో దంచికొట్టిన వాన

– రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షం
– 255 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం వాన దంచికొట్టింది. రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. రాష్ట్రంలో సోమవారం రాత్రి పది గంటల వరకు 255కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైతే అందులో సగానికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రొద్దటూర్‌లో అత్యధికంగా 7.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. ఓవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ఉంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 42 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 41.9 డిగ్రీలు, నల్లగొండ జిల్లా దామరచర్ల, మాడ్గులపల్లిలలో 41.7 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్‌దరిలో 41.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
ప్రొద్దుటూరు (రంగారెడ్డి) 7.35 సెంటీమీటర్లు
శంకర్‌పల్లి (రంగారెడ్డి) 7.10 సెంటీమీటర్లు
తాళ్లమడుగు (ఆదిలాబాద్‌) 6.98 సెంటీమీటర్లు
మెయినాబాద్‌(రంగారెడ్డి) 6.10 సెంటీమీటర్లు
గోల్కొండ(హైదరాబాద్‌) 5.80 సెంటీమీటర్లు
అసిఫ్‌నగర్‌(హైదరాబాద్‌) 5.70 సెంటీమీటర్లు

Spread the love