ఐసీసీ జట్టులో ఆరుగురు మనోళ్లే

ఐసీసీ జట్టులో ఆరుగురు మనోళ్లే– టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ
దుబాయ్ : 17 ఏండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. గ్రూప్‌, సూపర్‌ దశలో అజేయంగా నిలిచిన టీమ్‌ ఇండియా.. సెమీఫైనల్‌, ఫైనల్లో మెరుపు విజయాలు నమోదు చేసింది. మెగా ఈవెంట్‌లో అంచనాల మేరకు రాణించిన భారత క్రికెటర్లు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌లో సింహభాగం బెర్త్‌లు దక్కించుకున్నారు. కెప్టెన్‌, ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ జట్టులో నిలువగా.. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్య.. పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లు జట్టులో చోటు సాధించారు. అఫ్గాన్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, ఫజల్‌హాక్‌ ఫరూకీ సహా ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ ఐసీసీ జట్టులో చోటు సాధించటం విశేషం. విండీస్‌ నుంచి నికోలస్‌ పూరన్‌, ఆస్ట్రేలియా నుంచి మార్కస్‌ స్టోయినిస్‌ తుది జట్టులో నిలువగా.. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా తరఫున పేసర్‌ ఎన్రిచ్‌ నోకియా అదనపు ఆటగాడిగా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా నుంచి మరో ఆటగాడు ఐసీసీ జట్టులో చోటు సాధించలేదు.
ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌ (అఫ్గాన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, మార్కస్‌ స్టోయినిస్‌ (ఆసీస్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రషీద్‌ ఖాన్‌ (అఫ్గాన్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఫజల్‌హాక్‌ ఫరూకీ (అఫ్గాన్‌). (12 ఆటగాడు : ఎన్రిచ్‌ నోకియా)

Spread the love