ప్రజానాట్యమండలి విద్యా వైజ్ఞానిక

ప్రజానాట్యమండలి విద్యా వైజ్ఞానిక– రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి
– పిఎన్‌ఎం జిల్లా అధ్యక్షుడు నామ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
ఈనెల 12,13,14 తేదీలలో ఖమ్మం నగరంలోని మంచికంటి హాల్‌లో జరిగే ప్రజానాట్యమండలి రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నామ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో పిఎన్‌ఎం ఖమ్మంరూరల్‌ మండల కమిటీ సమావేశం దోనోజు పాపాచారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నామ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళ ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్యమండలి పనిచేస్తుందని తెలిపారు. నాటి స్వాతంత్య్ర పోరాట కాలం నుండి నేటి పాలకుల మోసాలను అనేక రూపాల్లో ఎండగట్టి ప్రజలను చైతన్య పరచడమే ప్రజానాట్యమండలి లక్ష్యం అన్నారు. డబ్బు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత కాలంలో కళాకారుల జీవనం దుర్భరంగా ఉందని, ప్రభుత్వాలు, ప్రజలు కళలను ఆదరించాలని కళాకారులను గౌరవించాలని, కళాకారులకు జీవన భృతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా కళలను పదునెక్కించి ప్రజారంజకమైన కళారూపాలను తయారు చేసుకోవడానికి కళాకారులకు ఈ విద్య, వైజ్ఞానిక తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి ఖమ్మంరూరల్‌ మండల కార్యదర్శి నందిగామ కృష్ణ, కస్థల అంటోని, శానం వీరబాబు, గోగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love