అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 

– ఐసీడీఎస్ తొర్రూరు ప్రాజెక్టు కార్యదర్శి స్వరూప 
నవతెలంగాణ – పెద్దవంగర: రాష్ట్రంలోని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐసీడీఎస్ తొర్రూరు ప్రాజెక్టు కార్యదర్శి స్వరూప అన్నారు. ‘కార్మికుల కోర్కెల దినం’ పురస్కరించుకొని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంగన్వాడీలు, తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి 1972 చట్టం ప్రకారం గ్రాట్యుటీ వర్తింపచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయా లకు 5 లక్షల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంజుల, సంధ్యారాణి, ఝాన్సీ, సరళ, యాకలక్ష్మి, ఇందిరా, విజయలక్ష్మి, ఆండాలు, నీలవేణి, చంద్రకళ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love