‘జ్వరం’అంటే ఎరుగనివారుండరు. మనందరికీ సుపరిచితమైన అస్వస్ధ దశ. జనరల్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇవే రోగుల సర్వసాధారణ ఫిర్యాదులు. స్కూలు పిల్లల్లో పాఠశాల గైరుహాజరుకు తల్లితండ్రులు/ పిల్లలు అతి తరచుగా పేర్కొనే కారణం.
ఎప్పుడూ హుషారుగా ఆడుతూ, అల్లరి చేస్తూ ఉండే బిడ్డ స్కూలు నుండి వచ్చి, మాట్లాడకుండా మంచంపైన వాలిపోయిందంటే, మందగించిందంటే, తల్లి ఇట్టే పసిగట్టేస్తుంది. ‘ఏమైంది దీనికి?’ అంటూ నుదుటిమీద చేయివేసి ‘ఆమ్మో జ్వరమొచ్చింది’ అని అమాంతంగా కంగారుపడేటట్టు చేసేస్తుంది జ్వరం.
మరి ఇలాంటి జ్వరం, ఎలా మంచిది?
మన ఆత్మీయులకెవరికైనా జ్వరమొచ్చిందంటే, అది కంగారు పడవల్సిన విషయం కాదు. ఎందుకంటే జ్వరం ఒక జబ్బో, రోగమో కాదు. అది, ఒంట్లో ఎక్కడో సజావుగా లేదని చెప్పే ఒక శక్తివంతమైన సూచిక.
శాస్త్రీయంగా, జ్వరం అంటే ఏమిటి?
మాములుగా మనిషి శరీర తాపమానము వయసు, లింగ, కాల మార్పుల్ని బట్టి ముప్ఫయిఏడు డిగ్రీల సెంటిగ్రేడ్‌కు కాస్త అటుఇటుగా ఉండవచ్చు. సామాన్యంగా ఉష్ణనమోదు నాలికకింద లేదా చంకలో చేస్తారు. నాలికకింద కంటే చంకలోని ఉష్ణం కొంత తక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఇలా చూడడం సులువు. ముప్ఫయిఎనిమిది సెంటీగ్రేడ్ల కంటే శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జ్వరంగా పరిగణించబడుతుంది.
శరీరతాపమానం సామాన్యపరిధిలో సజావుగా క్రమబద్దీకరణం చేసేది మెదడులో ‘హైపోథలామస్’ అనబడే ఒక బాదంగింజ పరిమాణంలో ఉండే చిన్న భాగము. శరీరతాపమానం, బాహ్య-అంతరంగ హెచ్చుతగ్గుల బారినపడకుండా, వివిధ రసాయనాలను, హార్మోన్లను విడుదలచేస్తూ, సమతుల్యంగా ఉండేటట్టుగా మెదడులోని ఈ భాగం కాపాడుతుంది.
శరీర తాపమానం ఎందుకు పెరుగుతుంది?
రోగ నిరోధక యంత్రాంగం గుర్తించని బాహ్య/ అంతర్గత సజీవ లేదా నిర్జీవకణాలు (ఆంగ్లంలో యాంటిజెన్స్), శరీరంలోని వివిధ స్థావరాల్లోనికి వచ్చిచేరినప్పుడు, వాటిని ధ్వంసంచేసే ప్రక్రియలో భాగంగా హైపోథలామస్ తాపమాన నియంత్రణ విలువను (థెర్మోరేగులటరీ సెట్‌పాయింట్)ను పెంచుతుంది. అంతేకాకుండా, సోకిన అంటు, వ్యాధిరూపం దాల్చినప్పుడు, అంటుక్రిములను తుదముట్టించడానికి, రోగనిరోధక యంత్రాంగం రక్తంలోనికి విడుదలచేసే కొన్నికణాలు, శరీర తాపమానం పెంచగలిగే పైరోజెన్స్ అనే రసాయనాల్ని తయారు చేయగల్గి ఉంటాయి.
ఆంగ్లంలో ‘ఫీవర్’ అనబడే ఈ జ్వరాన్ని పైరోజెన్స్ వలన పెరిగే తాపమానం. కావున, వైద్యపరిభాషలో ‘పైరెక్సియా’ అని అంటారు.
సర్వసాధారణంగా జ్వరమనేది అంటుకు సంబంధించినది అయినప్పటికీ, వడదెబ్బ (సన్ స్ట్రోక్), కొన్ని రకాల కాన్సర్ వ్యాధులు, జీవక్రియ (మెటబోలిక్) సంబంధిత, తదితరవ్యాధుల్లో కూడా తీవ్రస్థాయిలో సంభవించవచ్చు.
జ్వరం, శరీరంలో రోగనిరోధక యంత్రాంగం గుర్తించని యాంటిజెన్లనన్నిటిపై యుద్ధం ప్రకటించే మొట్టమొదటి రక్షణవ్యవస్థగా (ఫస్ట్లైన్డ్ ఫెన్సెస్ మెకానిజం) పనిచేస్తుంది.
మానవ సహజ శరీరతాపమానం క్రిములవద్ధికి దోహదపడే విధంగా ఉంటుంది. పెరిగిన వేడి, వాటి జీవశక్తిని నిర్వీర్యం చేస్తుంది.
జ్వరంలో రకాలు ఉంటాయా? వుంటే, ఎన్ని?
జ్వర వైవిధ్యాల్ని అల్లోపతీ వైద్య పరిభాషలో, అంతర్గత మూలకారణాల్ని బట్టి, కాలపరిమితి, వేడి హెచ్చుతగ్గులు, తీవ్రత, జ్వరకారకాలపైన ఆధారపడి, ఒకపూట, రోజు, వారం, రెండు వారాలు, నెల, కొన్ని సందర్భాల్లో, దీర్ఘకాలంగా వస్తూ-పోతూ ఉండవచ్చు. అటువంటి దీర్ఘకాలంగా ఉండే జ్వరాన్ని, ఆయుర్వేదంలో విషజ్వరంగా సంబోధిస్తారు.
అంతేకాకుండా, మంద్రస్థాయి, మితస్థాయి, తీవ్రస్థాయి, అక్యూటి ఫీవర్ (ఒకపూట, రోజు, వారం), క్రానిక్ ఫీవర్ (రెండు వారాలు, నెల, దీర్ఘకాల), కంటిన్యుయస్ ఫీÛవర్, ఇంటర్మిటెంట్ ఫీవర్, మైల్డ్, మోడరేట్, హై, హైపర్పైరెక్సియా, బాక్టీరియల్, వైరల్, పైరెక్సియా అఫ్ అన్నోన్ ఆరిజిన్, ఇలాఎన్నో రకాలుగా కొనసాగవచ్చు.
జ్వర వ్యత్యాసాలు మూలకారకాలపైన భారీగా ఆధారపడతాయి. ఉదాహరణకు, మలేరియా జ్వరం టైఫాయిడ్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే ఫ్లూ, డెంగీ, చికున్‌గున్యా, మీసల్స్, ఇలా అంటువ్యాధులలో జ్వరం లక్షణాలు విభిన్నంగా ఉండవచ్చు. వాటిని వైద్యులు గుర్తించగలుగుతారు.
జ్వరమెలాంటిదైనప్పిటికి, వైద్య యంత్రాంగం దాన్ని తగ్గించే ప్రయత్నంలో, అంతర్గత కారణం వైపు దష్టిపెట్టి, తగు చర్యలు తీసుకొన ేవిధంగా సహకరిస్తుంది.
మనశరీరం రుగ్మతకు గురైనప్పుడు, అస్వస్థత స్థాయిని తెలిపేసూచికగా పనిచేసే జ్వరం మంచిదే కదా!
అలాఅని జ్వరాన్ని ఉపేక్షించవచ్చా?
జ్వరం తెచ్చే చిక్కులు, ఇబ్బందులు ఎన్నో!
జ్వరంతో బాటు పలుమార్లు శరీరం కొన్ని ఇతర ఇబ్బందులకు గురికావచ్చు. ముఖ్యంగా వంటినొప్పులు, తలనొప్పి, అలసట, నీరసం, చలి, వణకు, కీళ్లనొప్పి, వాంతులు, ఆకలిలేకపోవడం, చికాకు, నిర్జలీకరణం (డిహైడ్రైషన్) మొదలైనవి.
ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో జ్వరతీవ్రతకు సంబంధంలేకుండా మూర్ఛలు రావచ్చు(ఫైబ్రైల్సీజర్స్).
జ్వరం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, వయసుతో నిమిత్తంలేకుండా, మెదడు దెబ్బతినొచ్చు. అపస్మారక స్థితిలోనికి కూడావెళ్లిపోవచ్చు. మత్యువాతపడవచ్చు. ఇదిచాలా అరుదైనప్పటికీ, దీర్ఘకాలిక, తీవ్రస్థాయిజ్వరం, ఇటువంటి దుష్ప్రభావానికి దారి తీయొచ్చు. ఇంతటి క్లిష్టతరపరిస్థితిని కలుగచేసి, మనిషి ఆర్థిక, దైనందిక కుటుంబజీవనశైలిని తారుమారుచేసి, తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీసే శక్తి జ్వరానికుంది.
కాబట్టి జ్వరాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
జ్వరాన్ని ఎలా అదుపులో పెట్టాలి?
జ్వరక్రమబద్ధీకరణ వయసుతో ముడిపడి ఉంటుంది. నవజాతశిశువులో శరీరతాపం పెరిగినట్టయితే వెంటనే పిల్లల వైద్యనిపుణులను సంప్రదించవలసిందే.
సంవత్సరంలోపు పిల్లల్లకు కూడా జ్వరతీవ్రత, సంబంధిత ఇతర లక్షణాలను బట్టి వైద్యపర్యవేక్షణ అవసరం పడవచ్చు. పెద్దవారిలో మంద్రజ్వరాన్ని ఇంటిలోనే కొంతవరకు అదుపు చేయవచ్చు.
జ్వరాన్ని, తద్వారా అంతర్గత కారకాన్ని అదుపులో పెట్టడానికి తగినంత మానసిక-శారీరిక విశ్రాంతి, పుష్కలంగా స్వచ్ఛమైన నీరు తాగడం, రుచించే పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం.
గాలి ప్రసరణకు వీలుగా వదులుగా ఉండే నూలుదుస్తులు వేసుకోవడం, తడిగుడ్డతో ఒళ్ళు తుడవడం, పారాసిటమాల్ వంటి వైద్యుల సూచిక అవసరం లేకుండా (ఓవర్దికౌంటర్) దొరికే సురక్షితమైన మందులు, వాటిపైన నిర్దేశించబడి నమోతాదులో, పరిమితకాలం వరకు వాడుకోవడం లాంటివి జ్వరతీవ్రత పెరగకుండా, అదుపులో పెట్టుకొనే దిశగా తీసుకొనే జాగ్రత్తలు.
వైద్యసహాయం ఎప్పుడు తీసుకోవాలి?
మూడునెలలలోపు చిన్నారులు జ్వరగ్రస్తులైన వెంటనే, ఆ తరువాత వయసులో, పైన ఉల్లంఖించిన పద్ధతులతో జ్వర తీవ్రతతగ్గక పోవడం, లేదా నూటరెండు/ ఆపైన తాపమానం నమోదు కావడం, మంద్ర జ్వరమేకానీ మూడురోజుల దాటినా తగ్గకపోవడం, జ్వరంతో బాటు తీవ్రమైన తలనొప్పి, విరేచనాలు, వాంతులు, మెడ బిగుసుకోవడం, మూర్ఛలు మొదలైనవి తోడైనప్పుడు తప్పకవైద్య నిపుణులను సంప్రదించాలి.
జ్వరం నియమిత స్థాయిలో శరీర అంతర్గత రుగ్మతకు బాహ్య సూచిక అయినప్పటికీ, అదుపులో లేనప్పుడు వైద్యసహకారం తప్పనిసరి.
డాక్టర్ మీరా,
రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,
ఫీవర్ హాస్పిటల్ /ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.