– ఖమేనీని అవమానిస్తారా?
– ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటే ఈ ధోరణి మానండి
– ట్రంప్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
– సుప్రీం నేత హత్యను తప్పించానని బీరాలు పలకడంపై ఆగ్రహం
టెహరాన్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటే ముందుగా తమ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ విషయంలో అగౌరవంగా, ఆమోదయోగ్యం కాని విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీని కించపరిచేలా ట్రంప్ మాట్లాడ డాన్ని తీవ్రంగా ఖండించింది. ‘నిజంగా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ అనుకుంటే మా సుప్రీం నేత గ్రాండ్ అయతొల్లా ఖమేనీని అగౌరవంగా, ఆమోదయోగ్యం కాని విధంగా మాటలు మాట్లాడడం మానుకోవాలి. లక్షలాది మంది మద్దతుదారులను బాధపెట్టడం ఆపేయాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ నేత ఖమేనీని హత్య చేయకుండా తప్పించానని, ఆయనకు కృతజ్ఞత లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
‘డాడీ’ దగ్గరికి పెరిగెత్తారు : అరాగ్చీ ఎద్దేవా
‘మన క్షిపణుల దాడి నుంచి తప్పించుకోవడానికి డాడీ వద్దకు పరిగెత్తడం మినహా ఇజ్రాయిల్‌కు మరో దారి లేకుండా పోయిందని శక్తివంతులైన, ఘనమైన ఇరాన్ ప్రజలు ప్రపంచానికి చాటిచెప్పారు. బెదిరింపులు, అవమానాల విషయంలో వారు దయతలచరు. ఇజ్రాయిల్ భ్రమలు మరిన్ని తప్పిదాలకు దారితీస్తే తన వాస్తవ సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించేందుకు ఇరాన్ సంకోచించదు’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌కు ట్రంప్ డాడీ వంటి వారని ఇరాన్ ఎద్దేవా చేసింది.
ఖమేనీ ప్రకటనపై చిర్రుబుర్రు
కాల్పుల విరమణ తర్వాత ఖమేనీ తొలిసారిగా ప్రభుత్వ టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఖతార్‌లోని అమెరికా ప్రధాన సైనిక స్థావరంపై దాడి చేశామని, యుద్ధంలో ఇరాన్ గెలుపొందిందని, అమెరికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని ఆయన ప్రకటించారు. అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనిపై మండిపడిన ట్రంప్ తాజాగా ఖమేనీపై విరుచుకుపడుతూ అగౌరవంగా, ఆమోద యోగ్యం కాని విధంగా మాట్లాడారు. ఇరాన్‌పై మరోసారి దాడి చేసే అవకాశాలను ట్రంప్ తోసిపుచ్చకపోవడం గమనార్హం. శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ఓ విలేకరి ‘అవసరమని భావిస్తే ఇరాన్‌పై కొత్తగా బాంబు దాడులు జరుపుతారా’ అని ప్రశ్నించగా ‘తప్పకుండా…అందులో ఎలాంటి సందేహం లేదు’ అని బదులిచ్చారు. ఇరాన్ అణు స్థావరాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కానీ లేదా మరేదైనా గౌరవనీయ ఏజెన్సీ కానీ తనిఖీలు జరపాలని తాను కోరానని చెప్పారు. అయితే ఐఏఈఏ తనిఖీలను అనుమతించే ప్రశ్నే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఆంక్షల ఎత్తివేతకు ఇక కృషి చేయను : ట్రంప్
అంతకుముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌లో ఓ పోస్ట్ పెడుతూ తాను ఇరాన్ నేతను అత్యంత వికారమైన, దారుణమైన హత్య నుంచి కాపాడానని చెప్పుకున్నారు. అయినా ఖమేనీకి కృతజ్ఞత లేదని ఆరోపించారు. ‘అతను ఎక్కడ ఆశ్రయం పొందాడో నాకు కచ్చితంగా తెలుసు. అత్యంత శక్తివంతమైన ఇజ్రాయిల్, అమెరికా సాయుధ దళాలు అతని జీవితాన్ని ముగించనివ్వవు. అందుకు అతను నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తనపై ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోందని, ఆ అవకాశాలపై తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ‘కానీ…ఇక లేదు. దానికి బదులుగా నేను కోపం, ద్వేషం, అసహ్యంతో కూడిన ప్రకటన చేశాను. ఆంక్షల ఎత్తివేతతో సహా మరికొన్ని చర్యలపై కృషి చేయడం ఆపేశాను’ అని చెప్పారు. ఇరాన్ కనుక ఆందోళనకర స్థాయిలో యురేనియంను శుద్ధి చేస్తే టెహరాన్‌పై తిరిగి బాంబులు వేసే విషయాన్ని పరిశీలిస్తానని అన్నారు. కాగా ఇరాన్‌తో వచ్చే వారం చర్చలు ప్రారంభమవుతాయని ట్రంప్ తెలుపగా అమెరికాతో అణు చర్చలు ప్రారంభించే ప్రశ్నే లేదని టెహరాన్ స్పష్టం చేసింది.