Monday, June 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఏకపక్ష పోకడలు సహించం

ఏకపక్ష పోకడలు సహించం

- Advertisement -

– అమెరికా వాణిజ్య ఒప్పందాలపై చైనా హెచ్చరిక
బీజింగ్‌:
ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష వాణిజ్య వ్యూహాలను తాము సహించే ప్రసక్తే లేదని చైనా ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఒంటెద్దు పోకడలు సరికాదని హితవు పలికింది. ఈ క్రమంలో ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల కారణంగా తమ ప్రయోజనాలు దెబ్బతింటే తాము సైతం ప్రతీకార చర్యలు తీసుకోక తప్పదని గట్టి హెచ్చరిక జారీ చేసింది. ‘ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురైతే దానిని చైనా అంగీకరించదు. తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రతీకార చర్యలు చేపడుతుంది’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార సుంకాల అమలును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ గడువు జులై 9వ తేదీతో ముగుస్తుంది. దానికి ముందే పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా జారీచేసిన హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘ఏ దేశమైనా విలువలకు కట్టుబడి దృఢమైన వైఖరిని ప్రదర్శించినప్పుడే తన చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించుకుంటుందన్నది ఇప్పటికే నిరూపితమైన వాస్తవం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రతీకార సుంకాల విధింపుపై ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి ఏకపక్ష చర్యలు బహుపాక్షికవాణిజ్య వ్యవస్థను దెబ్బతీస్తాయని, సాధారణ అంతర్జాతీయ వాణిజ్య క్రమాన్ని అస్తవ్యస్థం చేస్తాయని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్న దేశాలలో భారత్‌ కూడా ఉంది. అమెరికాతో సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని, ఈ విషయంలో మంచి పురోగతి కన్పిస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ ఈ నెల ప్రారంభంలోనే చెప్పారు. గడువు లోగానే ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 5-11 తేదీల మధ్య అమెరికా ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించింది. ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే 2050 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని రెండు దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -