– ఆర్‌ఎంపీల వద్ద చికిత్సలు
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
గత వారం రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలతో గ్రామాల్లో తాగునీరు కలుషితం కావటంతో పల్లెల్లో వైరల్, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మండలంలోని పిట్టబొంగరం పీహెచ్‌సీ పరిధిలోని మారుమూల గ్రామమైన గోపాల్‌పూర్‌లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆ గ్రామానికి వైద్యసిబ్బంది రాకా పోవడంతో జ్వరాలతో బాధపడుతున్న సుమారు 15 నుంచి 20 మంది ఉన్నారు. మండల కేంద్రంలో ప్రయివేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్టు గ్రామస్తుడు శంకర్ తెలిపారు. వీరిలో సుజాత (45) ఎల్మొలె, సట్ల కొండిబా (50), రఘునాథ్ ఎల్మొల, ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మండల కేంద్రంలోని వివిధ ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. సుమారు 60 ఇండ్లు ఉన్న ఆ గ్రామంలో ఇంటికి ఒకరిద్దరు మంచం పట్టారని, గ్రామస్తులు పేర్కొన్నారు. జ్వరాలతో విలవిల లాడుతున్న తమ గ్రామంలో వైద్యసిబ్బంది పర్యటించాలని, పిట్టబొంగరం పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని గ్రామస్తుడు శంకర్ తెలిపారు. ఇక చేసేదేమీ లేక శుక్రవారం నాడు వర్షం కాస్త తగ్గడంతో ఇరవై కి.మీ.దూరంలోని మండల కేంద్రానికి తరలించి, ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పదించి తమ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు.