హోంవర్క్‌ భయం!

Fear of homework!బడికి వెళ్లే పిల్లల్లో చాలామందికి హోంవర్క్‌ అంటే అయిష్టత గమనిస్తాం. చాలాసమయం తరగతిగదిలో ఉండటం, ఇంటికి రాగానే హోంవర్క్‌ పూర్తి చేయాలన్న తల్లిదండ్రుల ఆదేశాలు విసిగిస్తాయి. నిజానికి అది సంబంధిత సబ్జెక్టులో మెళకువలు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ సంగతి చాలా ఆలస్యంగానే పిల్లలు గ్రహిస్తారు. అది పెద్ద శిక్షగా భావిస్తారు.
సోషల్‌, సైన్స్‌లో తప్ప మిగతా సబ్జెక్టు టీచర్లు హోంవర్క్‌ ఇవ్వడం సహజం. ఇంట్లో కూడా ప్రాక్టీస్‌ చేస్తే త్వరగా పాఠాలు నేర్చుకోగలరన్న ఆలోచనతోనే ఇస్తారు. లాంగ్వేజెస్‌ వారు అక్షరాలు చక్కగా రాయాలని, పద్యాలు నేర్చుకోమని చెబుతారు. గణితంలో సూత్రాలు నేర్చుకోవడానికి సులువవుతుందని హోంవర్క్‌ విషయంలో కచ్చితత్వం పాటిస్తారు. అంతే తప్ప ఏ టీచర్‌కీ తమ విద్యార్థులను పనిగట్టుకుని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోరు.
ఇవన్నీ పక్కనపెడితే, నిజానికి తల్లిదండ్రులు పిల్లల దగ్గరుండి చదివించేందుకు హోంవర్క్‌ ఎంతో ఉపయోగపడుతుంది. హోంవర్క్‌ చేయించటంతో పాటు వారి తెలివిని, అభివృద్ధిని పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. దగ్గరుండి చదివించడంతో పిల్లలూ ఎంతో చక్కగా చదువుకుంటారు. చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. కనుక తల్లిదండ్రులు కూడా అందుకు ప్రోత్సహించాలి. అయితే పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలోనే ఇదంతా జరగాలి. అంతే తప్ప కొట్టడం, తిట్టడం చేస్తే పిల్లలు మనస్తాపానికి గురవుతారు. ఇది మరీ ప్రమాదకారి. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లల్ని చిన్న తరగతుల నుంచే ఇతరులతో పోల్చవద్దు. ఎవరి తెలివి వారిది, ఎవరి ఉత్సాహం వారిది అన్న మాట గుర్తుంచుకోండి.
ఇప్పుడు నెమ్మదిగా ఉన్నంత మాత్రాన అలానే ఉండిపోతారని భావించరాదు. ఒక్కపూటలో అన్నీ, అంతా నేర్చుకోలేరు. అలా ఆశించడం అర్ధంలేని ఆలోచన. క్లాస్‌ ఫస్ట్‌ రావాలంటే తొలిమెట్టుగా హోంవర్క్‌ అద్భుతంగా చేయాలని డిమాండ్‌ చేసే తల్లిదండ్రులూ ఉన్నారు. అసలా ఫస్ట్‌లు, సెకండ్‌ల లెక్క అస్సలు మంచిది కాదు. సబ్జెక్టు అర్ధమైతే, అవగాహన పెరిగితే మార్కులు, ర్యాంకులు వద్దన్నా వస్తాయి.
ఈ చిన్నపాటి గ్రహింపు ఎంతో అవసరం. అందువల్ల పిల్లల్ని హోంవర్క్‌ నుంచే మహామేధావి చేయాలన్న తాపత్రయం అర్ధం లేనిదన్నది తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవారు గ్రహించాలి. హోంవర్క్‌ కేవలం మెళకువలకు ఉపయోగ పడుతుంది.

– హోంవర్క్‌ చదువులో భాగం.
– సబ్జెక్టు మెళుకువలు నేర్చుకోవడానికి అదొక మార్గం.
– అనుమానాలు, భయాలు తొలగించుకోవచ్చు.
– స్నేహపూర్వక వాతావరణంలో చేయాలి.
– హోంవర్క్‌ ను భారంగా భావించరాదు.
– హోంవర్క్‌ చేయకపోతే శిక్షలు పడతాయన్న భయం వద్దు.
– కఠినంగా వ్యవహరించవద్దు.
ముఖ్యంగా గణితం, లాంగ్వేజెస్‌లో అనుమానాలు తొలగించుకోవడానికి, మరింత రాణించడానికి హోంవర్క్‌ అనేది ఒక సోపానం మాత్రమే. అదే భావనతో దగ్గరుండి చేయించండి. స్వయంగా చేస్తుంటే మరీ మంచిది. అందుకు వసతులు కల్పించి, ఉత్సాహపరచండి. హోంవర్క్‌ను నిర్లక్ష్యం చేయనివ్వకండి. భోజన సమయం పాటిస్తున్నట్టే, హోంవర్క్‌ సమయాన్ని కూడా అంతే కచ్చితంగా పాటించేలా చూడండి. కఠినంగా వ్యవహరించవద్దు.

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

Spread the love