పిల్లాడు గట్టిగా ఏడ్చినా
అరచేతులతో వాడి నోరు మూయాలి
పక్కింటి పద్మం నిదుర చెదిరి
సింహంలా మారకముందే
సంతోషం వచ్చినా సంబరం సైలెంట్ గా సాగిపోవాలి
బర్తుడే కేకు కోసినా చప్పట్ల శుభాకాంక్షలు
మన చెవులకు మాత్రమే వినబడాలి
సొంతింటి సమాజం కుళ్ళుకోకముందే
సూటిగా చెప్పాలంటే చిన్నప్పుడు తరగతి గదిలో
సూది రాలిన శబ్దం వింటూనే ఉండాలి
ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు
ఉన్న పిల్ల మొక్కలు చెట్లవుతున్నయి
ఈ ఊబిలో దిగినప్పుడు ఉన్న అద్దె వెయ్యి… రెండువేలు
రెండువేలు… నాలుగువేలయ్యి కూర్చుంది
ఉన్న నేత కూలీ కాస్తా కరోనా పుణ్యమా అని
వెయ్యి తగ్గి కూలీ బ్రతుకుని వెక్కిరిస్తున్నది
అయినా బతుకు పోరాటం పదునుగానే ఉన్నది
పాత సంవత్సరం జెర్రిపోతులా పారిపోయి
కొత్త ఏడాది పగలబడి నవ్వుతూ వచ్చినా
గోడకు మేకు కొట్టి
క్యాలెండర్ వేల్లాడగట్టు ఆలోచన మానుకోవాలి
నల్లా నీళ్ళు రాకపోయినా అరవడానికి లేదు
గది గడ్డి గది మైదానం ఉంటె ఉండూ పోతె పో
ఒక కోడిపిల్లను పెంచడానికి వీల్లేదు
పక్కింటి గంజి తాగిన విశ్వాసం
పగలు రాత్రి మొరుగుతున్నా
ఏ కుక్కపిల్లనూ తెచ్చుకోవడానికి ధైర్యం చాలదు
కాళ్ళకు షరతులు కట్టుకుని కదలాలి
ఏ అర్ధరాత్రి గేటు తెరిచినా
తెల్లారే మూట ముల్లె సర్దుకోవాలి
వాక్ స్వతంత్రం ఏమాత్రమూ పనిచేయదు
విరామ సమయం శత్రువవుతుంది
కాలం ముల్లుగర్ర పట్టి పొడుస్తూనే ఉంటది
కండలు కరిగే ఆలోచనలు మొద్దువారకుండా
నిత్యం పనికి పోయే సుప్రభాతం పాడాలి
ఖర్చులు పోగెయ్యకుండా
ఉపవాస దీక్షకు నీళ్ళొదులుకున్నామా
తాకట్టులో ఉన్న సొమ్ము
గంపగుత్తా అమ్ముకోవాల్సిందే
అద్దె ఇల్లు
బలవంతపు పన్ను గుంజే తెల్లదొర అవతారం
బతుకంతా ఊడిగం చేసినా బాకీ తీరని భాగోతం
తిండికి కాకపోయినా కిరాయి కొంప కడుపు నింపడానికి
పని పాట ఎత్తుకుని తీరాలి
జేబుకు వడ్డీ లెక్కల తూట్లెన్నున్నా
బకాసురుడి అన్నంబండిలా డబ్బు మూటగట్టాలి
అప్పుడెప్పుడో నాయిన తీర్థయాత్రల కొరకు
పైస పైసా దాచినట్టు నెలనెలా రూపాల
ముడుపు అప్పజెప్పాలి
ఠంచనుగా వచ్చే ఒకటో తారీకు కోసం
నడుము విరిగిపోయేలా వొళ్ళొంచి రావాలి
నిజం మాట్లాడాలంటే
ఇక్కడ ఉన్న నరకం ఇంకెక్కడా ఉండదు
ఏ దేవుడో శాపం పెట్టినట్టు ఏ దూలం మీదనో ఉన్న
ఏ పిచ్చుక గూడో చెరిపేసినట్టు ఏ పాపానికి ఈ శిక్ష
పావురాళ్ళు ఎగరేసే మంత్రులు ఎక్కడా
ప్రభుత్వం నిర్మించిన పేదల ఇండ్ల పథకాలకు
రిబ్బెన కత్తిరింపు ఎప్పుడో గానీ
జాతకం చెప్పే చిలుక
పంజరంలో ఉన్నట్టు జీవితం.
– గజ్జెల రామకృష్ణ, 8977412795