
అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అంటూ ప్రజల్లో భ్రమలు కల్పించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ 300 రోజులు అయినా అమలు చేయడంలో పూర్తి విఫలం అయిందని, వీటిని అమలు చేయించడం కోసం ప్రజల పక్షాన సీపీఐ(ఎం) ఆద్వర్యంలో ప్రభుత్వంపై గ్యారంటీగా పోరాటం చేస్తాం అని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య తెలిపారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మంగళవారం మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ అద్యక్షతన నిర్వహించిన పార్టీ మండల కమిటీ నిర్మాణ సమీక్షా సమావేశానికి కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పధకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిన కాంగ్రెస్ పై ఇపుడిపుడే ప్రజలలో భ్రమలు వీడుతున్నాయి అని అన్నారు. ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు స్థానిక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నిరంతరం ప్రజలతో మమేకం అయినప్పుడే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని సూచించారు. నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేటలో సంవత్సరాలు తరబడి సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహించడంతో రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. నిర్మాణ పనులు సైతం నాణ్యతా లోపాలతో జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు అని ఆయన తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి డ్రైనేజీ,సెంట్రల్ లైటింగ్ ను నియోజక వర్గం కేంద్రం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ చిరంజీవి, మండల కమిటీ సభ్యులు ముల్లగిరి గంగరాజు, సోడెం ప్రసాద్, మడకం గోవింద్, మడిపల్లి వెంకటేశ్వరరావు, సీతారామయ్య, కుంజా మురళి, ఏసు, తగరం నిర్మల లు పాల్గొన్నారు.