– రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏడాది కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నది. ఈ ఏడాది (2024-25) బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.21,292 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది గతేడాది బడ్జెట్ కన్నా రూ.2,119 కోట్లు ఎక్కువ. ఒక్క ఏడాదిలోనే రూ.2 వేల కోట్లకుపైగా అదనపు కేటాయింపులు చేసింది. పాఠశాలల ప్రారంభానికి ముందే మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. మొక్కల సంరక్షణకు సింగరేణి కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద రూ.136 కోట్లు కేటాయించింది. పాఠశాలలు తెరిచిన రోజే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు (ఏకరూప దుస్తులు), పాఠ్యపుస్తకాలను అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21,419 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీ చేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. వెంటనే ఫలితాలు ప్రకటించి అతి తక్కువ సమయంలోనే ఆ ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేసింది. డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ రాసిన వారు డీఎస్సీ రాశారు. ఇక నుంచి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టారు. 2024, అక్టోబరు 11న కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు శంకుస్థాపన జరిగింది. నైపుణ్య విద్యను అందించేందుకు వీలుగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ) మారుస్తున్నారు. అలాగే అకడమిక్ కోర్సులు, పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు పాఠశాల స్థాయిలో ప్రహరి క్లబ్‌లను ఏర్పాటు చేశారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డైట్ ఛార్జీలను పెంచింది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.300 కోట్లకుపైగా అదనపు భారం పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించిన సర్కారు బోధన, బోధనేతర సిబ్బంది శాశ్వత నియామకానికి ప్రభుత్వం యోచిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, మహిళా భద్రత, రహస్య కెమెరాల పర్యవేక్షణ కోసం ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. సాంకేతిక విద్యా విభాగంలో 24 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేశారు. 247 లెక్చరర్ పోస్టులకు సంబంధించి సాధారణ మెరిట్ లిస్టు విడుదల చేశారు. 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహణ పూర్తయింది.