నియోజకవర్గ రూపురేఖలు మార్చేల గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో రూ.కోట్ల నిధులు మంజూరయ్యయని, తమ హయంలో మంజూరైన పనులకు కొత్తగా కొబ్బరికాయలు కొట్టడం తప్పితే ఏడాది కిందట గెలిచిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు. తమ హయంలో ప్రారంభమైన పనులు సైతం ముందుకు సాగడం లేదని, నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని పేర్కొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నిధులు ఇప్పించలేకపోవడంతో కాంట్రాక్టర్ సామగ్రితో సహా వెళ్ళిపోయాడని అన్నారు. కేవలం అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలతో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏరోడ్రం, ఎయిర్ పోర్ట్ కు అడ్డుపడుతుందని అసత్య ఆరోపణలు చేసి ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. సీసీఐ పునరుద్ధరనపై సైతం గతంలో అనేక మార్లు కేంద్ర మంత్రులను కలిసిన ఫలితం రాలేదని, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకేల్లలేకపోతున్నారని ప్రశ్నించారు. జైనథ్ లో మినీ స్టేడియం నిర్మాణానికి గతంలోనే భూమిపూజ చేసినా… తిరిగి ఎమ్మెల్యే భూమిపూజ చేయడం దేనికి నిదర్శనమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకురాలేక.. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్, బీసీ భవన్, బంజారా భవన్, ఆడిటోరియం వంటి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా అబద్ధపు మాటలు వీడి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు రోకండ్ల రమేష్, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, కుమ్రా రాజు, మార్శెట్టి గోవర్ధన్, బట్టు సతీష్, గంగయ్యా, అశోక్, గొండ గణేష్, ధమ్మపాల్, లక్ష్మణ్, పుండ్రు వెంకట్ రెడ్డి, నవతే శ్రీనివాస్, ఉగ్గే విట్టల్, వినోద్ పాల్గొన్నారు.