– అధికారికంగా రూపకల్పన చేస్తే తప్పు జరిగినట్టా?
– గత విగ్రహ రూపకల్పనలో ప్రతిపక్షాలను బీఆర్‌ఎస్ ఆహ్వానించిందా?
– భేషజాలు పక్కనబెట్టి తెలంగాణ గౌరవాన్ని పెంచండి : సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించబోదని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండటమే తల్లి రూపమనీ, తెలంగాణ తల్లి చేతిని చూస్తే ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్నదని చెప్పారు. ఎటువంటి బేషజాలు, బింకాలకు పోకుండా, మానసకిక అడ్డంకులను వదిలి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘తెలంగాణ తల్లి’ విగ్రహ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనపై సోమవారం జరిగిన చర్చలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీఆర్‌ఎస్ తమ మనసులో అనుకున్నట్టు అన్నీ ఉండబోవని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకోవచ్చుగానీ..తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రూపకల్పన చేసి ప్రకటిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన విషయంలో నాటి ప్రతిపక్ష పార్టీలను అప్పటి టీఆర్‌ఎస్ సర్కారు ఆహ్వానించిందా? అని నిలదీశారు. విధి విధానాలు ఎలా ఉండాలి? ఆవిష్కరణలో ఉండాల్సిన పలు అంశాలపై ఎవ్వరితో గత ప్రభుత్వం చర్చించలేదన్నారు. విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన సీపీఐ..ఆ తర్వాత తెలంగాణకు ఏర్పాటుకు అనుకూలంగా జాతీయ సమితి నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని నాడు సోనియాగాంధీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ కోసం తాను జైలులో ఏడు రోజుల పాటు దీక్ష చేపట్టానని, 700 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. జయశంకర్, కోదండరామ్ లాంటి అనేక మంది మేధావులు దిశానిర్దేశం, అనేక మంది ఉద్యమకారుల త్యాగాలతో తెలంగాణ సిద్ధించిందన్నారు. సకలజనుల సమ్మె సమయంలో సింగరేణిలో, ఆర్టీసీలో గుర్తింపు సంఘాలు తమ పార్టీవేననీ, ఆ సమ్మె విజయవంతంతో వాటి పాత్ర కీలకమని చెప్పారు. సోనియా గాంధీ భిన్నాభిప్రాయాలతో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. బేషజాలను పక్కన పెట్టి, అందరూ ఒక తాటిపైన ఉంటేనే తెలంగాణ తల్లి పట్ల గౌరవం ఉన్నట్టు అర్థమవుతుందని సూచించారు. మలిదశ తెలంగాణలో యువత, ప్రాణత్యాగాలు చేసిందని, తమ విద్యార్థి నాయకుడు స్టాలిన్ పైన 250కి పైగా కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ సాయుధపోరాటం, అందులో మహనీయుల త్యాగాల గురించి వివరించారు. వారి త్యాగాలతోనే హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి చెందిందనీ, దీనినెప్పుడూ కమ్యూనిస్టు పార్టీ వ్యక్తిగతంగా చెప్పుకోలేదని కూనంనేని అన్నారు. ఇదే చర్చలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, విప్ బీర్ల అయిలయ్య, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మట్టా రాగమయి, సత్యం, శ్రీహరి, పద్మావతి, గడ్డం వినోద్, పాయల్ శంకర్, కె.వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, తదితరులు మాట్లాడారు.