Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్ నేత దారుణ హత్య

కాంగ్రెస్ నేత దారుణ హత్య

- Advertisement -


నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని
 మృతుని మరణ వాంగ్మూలం
నవతెలంగాణ-గీసుగొండ, కాశిబుగ్గ

వరంగల్ పోలీసు కమిషనరేట్ గీసుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షులు అడుప మహేశ్ (40) దారుణ హత్యకు గురయ్యారు. గీసుగొండ ఇన్స్‌పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 9.00 గంటలకు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు అనే వ్యక్తి అడుప మహేశ్‌కు ఫోన్ చేసి గొర్రెకుంట కోటిలింగాల ఆలయానికి రావాలని కోరగా మహేశ్ నిరాకరించినా నమ్మించి బలవంతంగా రప్పించారు. దీంతో అక్కడికి వెళ్లిన మహేశ్‌కు మద్యం తాగించారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పత్రి కుమార్.. మహేశ్‌తో గొడవపడ్డాడు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు తన గురించి ఎందుకు చెడుగా చెబుతున్నావని నిలదీశాడు. ‘నేనంటే నీకు భయం లేదారా?’ అంటూ వాగ్వివాదానికి దిగాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ను మహేశ్‌పై పోసి నిప్పంటించాడు. దాంతో గాయపడ్డ మహేశ్‌ను ఇద్దరూ అక్కడి నుండి అతని ఇంటి వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లారు. భార్య నాగలక్ష్మీ, దత్త పుత్రుడు రాహుల్‌తో తీవ్ర గాయాలతో ఉన్న మహేశ్ జరిగిన దాడి గురించి వివరించారు. మహేశ్ మాట్లాడుతుండగా రాహుల్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం చికిత్స నిమిత్తం మహేశ్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 50 శాతం గాయాలతో ఉన్న మహేశ్‌కు వైద్యులు వైద్యసేవలందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంజీఎంకు వచ్చి మహేశ్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలందించడానికి ఎంత ఖర్చయినా భరిస్తానని వైద్యులకు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మహేశ్ మృతిచెందాడు. ప్రస్తుతం మహేశ్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టంకు తరలించారు. మహేశ్ భార్య నాగలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు పత్తి కుమార్, జన్ను మధు తదితరులపై హత్యాయత్నం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. పత్తి కుమార్‌పై గతంలో హత్య కేసుతోపాటు మరికొన్ని కేసులు నమోదై ఉన్నాయి. ఎనుమాముల పోలీస్ స్టేషన్‌లో పత్తి కుమార్‌పై రౌడీషీట్ కూడా ఉంది. గతంలో నమోదైన హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చిన పత్తి కుమార్ ఈ ఘటనలో మహేశ్‌పై దాడికి పాల్పడ్డారు. కాగా, రౌడీషీటర్లమని చెబుతూ ఎవరైనా బెదిరిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గీసుగొండ ఇన్స్‌పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు సమాచారం.
ఎన్‌కౌంటర్ చేయండి : మహేశ్ మరణ వాంగ్మూలం
తనను చంపడానికి పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని మహేశ్ తన మరణ వాంగ్మూలంలో తెలిపారు. గతంలో హత్య కేసులో శిక్షపడిన నేరస్తులను వదిలిపెట్టడం వల్లే తన మీద హత్యాయత్నం జరిగిందని తెలిపారు. పత్తి కుమార్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ సీపీని కోరాడు. దత్తపుత్రుడు రాహుల్ తీసిన వీడియోలో ఇదే తన వాంగ్మూలంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. 26 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు.
కాగా, అడప మహేశ్ వర్ధన్నపేట నియోజకవర్గంలోని 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల సుందరయ్యనగర్ నివాసి. గతంలో మహేశ్, పత్తి కుమార్ స్నేహితులుగా ఉండేవారు. అనంతరం పత్రి కుమార్ వ్యవహారశైలితో విడిపోయారు. ఎమ్మెల్యే నాగరాజు తనను దూరం పెట్టడానికి మహేశ్ కారణమని భావించడం వల్లే మహేశ్‌ను అంతమొందించాలని నిందితుడు భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -