Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి

సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి

- Advertisement -

​భూ రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదు
శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి:
రెవిన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు

భూముల రీ సర్వే, అటవీ, రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, భూ రీ సర్వే పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో జిల్లాలో భూముల రీ సర్వే పనుల పురోగతి, అటవీ, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ సర్వే పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం 14 గ్రామాల్లో రీ సర్వే పనులు కొనసాగుతుండగా, వాటిలో ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులోగా రీ సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న సర్వేయర్లు, రోవర్ పరికరాలు, వాటి వినియోగం, సాంకేతిక సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని అవసరమైన చోట అదనపు వనరులు సమకూర్చాలని సూచించారు.
జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను పోలీస్ శాఖ గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న భూ వివాదాలు, అటవీ, రెవెన్యూ సమస్యలను సామరస్యంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. శ్రీనివాసగుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునే విధంగా రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచలో కొనసాగుతున్న సర్వే పనుల పురోగతిపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డివిజనల్ అటవీ అధికారులు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -