Monday, July 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅట్టుడుకుతున్న పశ్చిమాసియా

అట్టుడుకుతున్న పశ్చిమాసియా

- Advertisement -

ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి
రక్షణ వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై విస్తృత దాడులు
గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న టెహ్రాన్

నవతెలంగాణ – జనరల్ డెస్క్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలే అవకాశాలు కన్పించడం లేదు. జోర్డాన్‌పై ఇరాన్ జరిపిన దాడిలో సైనికులు ఇద్దరు చనిపోయారని, ఒకరి ఆచూకీ తెలియడం లేదని ప్రకటించిన అమెరికా ప్రతీకారంతో రగిలిపోయింది. శనివారం వరుసగా ఎనిమిదో రోజు రాత్రి కూడా దాడులు చేసింది. ఈ దాడులు ఆదివారం ఉదయం వరకూ కొనసాగాయి. ఇంధన సరఫరాలకు కీలక మార్గమైన సిరిక్ సమీప ప్రాంతంపై దాడి జరిగింది. హార్మోజ్‌గన్ రాష్ట్రంలోని హజియాబాద్ సమీపంలో కూడా అమెరికా వైమానిక దాడులు జరిగాయి. ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. హార్ముజ్ జలసంధిలోని ఖెష్మ్ దీవి సమీప ప్రాంతాన్ని కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ సైన్యానికి చెందిన తీర గస్తీ – గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి – డ్రోన్ నిల్వ కేంద్రాలపై వైమానిక దాడులు జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది.

సిగ్గుచేటు : ట్రంప్
ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనికుల మృతి ‘సిగ్గుచేటు’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ సేనల లక్ష్యమని చెప్పారు. ఇరానీయులు ఎంత చెడ్డవారో ఈ ఘటన చాటిచెబుతోందని అన్నారు. సైనికుల ప్రాణత్యాగం తమ దృఢదీక్షను మరింత ద్విగుణీకృతం చేసిందని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ తెలిపారు.

16 మంది సైనికులను కోల్పోయిన అమెరికా
జోర్డాన్‌పై ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ దాడులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారని, దాడి తర్వాత ఓ సైనికుడి ఆచూకీ తెలియడం లేదని సెంట్‌కామ్ తెలిపింది. ఈ ఘటనతో కలిపి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 మంది అమెరికా సైనికులు మరణించగా 420 మందికి పైగా గాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో అమెరికా దళాల సంఖ్య పెద్దగా లేనప్పటికీ ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ల కారణంగా ప్రాణనష్టం జరుగుతోంది. అయితే ఇది కేవలం అమెరికా సేనలకే పరిమితం కాలేదు. గత మూడు వారాలుగా జరుగుతున్న పోరులో కనీసం 50 మంది ప్రజలు మరణించారని, 500 మందికి పైగా గాయ పడ్డారని ఇరాన్ అధికారులు చెప్పారు. ఒక బ్రిడ్జిపై శుక్రవారం జరిగిన దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నౌకలలో పనిచేస్తున్న సిబ్బంది, విదేశీ కార్మికులతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ కొందరు చనిపోయారు. ఇజ్రాయిల్, లెబనాన్‌లలో సైతం ప్రాణనష్టం జరుగుతోంది.

కొనసాగిన ఇరాన్ దాడులు
ఇరాన్ సేనలు కువైట్‌లోని అల్ అదిరి శిబిరంలో, అలీ అల్ సలేం వైమానిక స్థావరంలో అమెరికా సైనిక ఆస్తులు, సామగ్రిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. బ్రిడ్జిలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులపై అమెరికా దాడులు జరిపిన తర్వాత ఇరాన్ కూడా సౌదీ అరేబియా, ఇతర అమెరికా గల్ఫ్ భాగస్వాములు, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా కువైట్‌పై వరుస దాడులు జరిగాయి. ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు సాయుధ దళాలు ఆదివారం నానా తంటాలు పడ్డాయి. కాగా బహ్‌రైన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరం పైన, ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పైన ఐఆర్‌జీసీ దాడి జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్‌రైన్‌లో ఆదివారం సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని సూచించారు.

ట్రంప్ సంతకానికి విలువేది?
విశ్వసనీయతను కోల్పోయింది
ఒప్పందాల ఉల్లంఘనలపై మొజ్తాబా మరచిపోలేని గుణపాఠాలు తప్పవని హెచ్చరిక

తమతో కుదుర్చుకున్న ఎంఓయూను అమెరికా పదే పదే ఉల్లంఘించడాన్ని చూస్తుంటే ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విలువ లేదని, అది విశ్వసనీయతను కోల్పోయిందని స్పష్టమవుతోందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఎద్దేవా చేశారు. ఇరాన్, దాని ప్రాంతీయ భాగస్వాముల చేతిలో అమెరికా మరచిపోలేని పాఠాలు నేర్చుకుంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మొజ్తాబా లిఖితపూర్వక ప్రకటనను ప్రభుత్వ టెలివిజన్‌లో చదివి వినిపించారు. ‘ఒప్పందాన్ని మన సైతాను పదే పదే ఉల్లంఘించడం చూస్తుంటే ట్రంప్ సంతకం ఇప్పుడు ఏ మాత్రం విలువ లేనిదని, చెల్లనిదని తేటతెల్లమవుతోంది. దౌర్జన్యం, ఆధిపత్య ధోరణి, క్రూరత్వం అనేవి అమెరికా సిద్ధాంతం, భావజాలంతో విడదీయరాని అంశాలు అనే విషయం మరోసారి అందరికీ నిరూపితమైంది. యుద్ధాన్ని ముమ్మరం చేసి భారీ నష్టం కలిగించాలని, మనల్ని అవమానించాలని శత్రువు అనుకుంటున్నాడు. అయితే ఇరాన్, ప్రతిఘటన కూటమి మరచిపోలేని గుణపాఠాలు నేర్పుతాయని అమెరికా తెలుసుకోవాలి’ అని ఆ ప్రకటనలో మొజ్తాబా వివరించారు. అమెరికా తన నిజస్వరూపాన్ని, మోసపూరిత స్వభావాన్ని, దుష్టత్వాన్ని బయటపెట్టుకున్నదని తెలిపారు. అమెరికాకు హేతుబద్ధత లేదని, విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. పోరు కొనసాగుతున్నందున దేశాన్ని రక్షించుకునే విషయంలో నాయకత్వాన్ని విశ్వసించాలని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అప్రమత్తంగా, చురుకుగా ఉండాలని వారికి మొజ్తాబా సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -