మోహన్‌బాబు ఇంటి వద్ద హైడ్రామా

Hydrama at Mohanbabu's house– కూతురిని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చిన మనోజ్‌
– అడ్డుకున్న సెక్యూరిటీ
– గేట్లను తోసుకుని లోపలి
– ఆగ్రహంతో మనోజ్‌,మీడియాపై దాడి చేసిన మోహన్‌బాబు!
– మనోజ్‌కు తండ్రి వాయిస్‌ మెసేజ్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో/బడంగ్‌పేట్‌
సినీ పరిశ్రమలోని మంచు కుటుంబంలో గొడవలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. మోహన్‌బాబు ఇంటి వద్ద మంగళవారం ఉదయం నుంచి రాత్రి నాటకీయ పరిణమాలు చోటుచేసుకున్నాయి. పహాడీషరీఫ్‌ పోలీసులు ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వచ్చి అక్కడ పనిచేస్తున్న వారిని విచారించారు. ఇదిలా ఉండగా, మంచు విష్ణు విదేశాల నుంచి ఇంటికి రాగానే మోహన్‌బాబుతో కలిసి మంచు మనోజ్‌, అతని భార్యను ఇంటి నుంచి బయటికి పంపించినట్టు తెలిసింది. అనంతరం మంచు మనోజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఆస్తిపై ఎలాంటి ఆశా లేదని, అస్థిత్వం కోసం పోరాడుతున్నానని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. పోలీసులు ఒకవైపే మాట్లాడటం సమంజసం కాదన్నారు. తన వెంట ఉన్న బౌన్సర్లను పంపించేసి, తనను ఇంటి నుంచి బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ మంచు మనోజ్‌ మోహన్‌బాబు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనోజ్‌ సాయంత్రం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలను కలిసి జరిగిన ఎపిసోడ్‌ను వివరించారు. అనంతరం ఆయన నేరుగా జల్‌పల్లికి వచ్చారు. జల్‌పల్లి ఇంటి వద్ద గేట్లను మూసేయగా.. మీడియా ప్రతినిధులు బయటవేచి ఉన్నారు. డోర్లు తీయాలంటూ మనోజ్‌ గట్టిగా అరిచారు. అయినా ఎవరూ స్పందించలేదు. తన కూతురు ఇంట్లో ఉందని, తీసుకెళ్తానంటూ అరిచా తీయకపోవడంతో తన బౌన్సర్లతో కలిసి గేట్లను తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఆయన వెంటనే మీడియా కూడా లోపలికి దూసుకెళ్లడంతో ప్రయివేటు బౌన్సర్లు మనోజ్‌ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, మనోజ్‌ వాళ్లను నెట్టేస్తూ ముందుకు సాగాడు. ఒకానొక సమయంలో ఒక బౌన్సర్‌ గొంతు పట్టుకున్నట్టు తెలిసింది. ఇంతలో మోహన్‌బాబు ఇంట్లో నుంచి బయటకు వస్తూ మనోజ్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. అతనిపై చేయి చేసుకుంటూ.. మీడియాను దూషిస్తూ చంపేస్తానంటూ తుపాకీ సైతం తీసినట్టు సమాచారం. మనోజ్‌ షర్ట్‌ చినిగింది. అలాగే మీడియా ముందు తిరుగుతూ కనిపించాడు. మోహన్‌బాబు ముందుకు వస్తుండగా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అతని చేతిలో ఉన్న టీవీ లోగో లాగి దాడి చేశారు.
అంతకు ముందు అక్కడున్న బౌన్సలర్లు మీడియా ప్రతినిధులను బయటకు నెట్టేయడంతో పలువురికి గాయలయ్యాయి. పోలీసుల ఎదుటే మోహన్‌బాబు మీడియాపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్‌ వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకులను వెనక్కి తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో భారీ ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌ రెడ్డి, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి భారీ ఏర్పాటు చేశారు.
గుండెల మీద తన్నావు.. : మోహన్‌బాబు
జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం మోహన్‌బాబు ఒక ఆడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ”మనోజ్‌ నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను. భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. మనోజ్‌ నన్ను కొట్టలేదు. నా బిడ్డ నన్ను తాకలేదు. మేమిద్దరం ఘర్షణ పడ్డాం. మనోజ్‌ నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డావు. ఇంట్లో అందరినీ ఎందుకు కొడుతున్నావు? బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అయినా కాపాడాను. విద్యాసంస్థల్లో ప్రతిదీ లీగల్‌గా ఉంది. తప్పులు ఎక్కడా జరుగలేదు. అన్నతోపాటు వినరుని కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. మీడియాలో ఏదేదో రాస్తున్నారు.. దీని వల్ల నేను, మీ అమ్మ ఎంతో కుమిలిపోతున్నాం. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డుకెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా? దానధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు. నేనే సంపాదించుకున్న. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. నీ కూతురిని వచ్చి తీసుకెళ్లు. నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా” అని మోహన్‌బాబు మనోజ్‌కు పంపిన వాయిస్‌ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది.

Spread the love