సర్వర్‌ అప్‌గ్రేడ్‌ చెయ్యరు.. సమస్య పట్టించుకోరు..!

– సామర్థ్యానికి మించి లోడ్‌
– ఆర్టీఏలో వారం రోజులుగా ఇబ్బందులు
– సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్న వాహన రిజిస్ట్రేషన్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంతర్జాతీయంగా సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా.. కంపెనీలు ఎప్పటికప్పుడూ అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌ల అప్‌డేట్‌ చేస్తున్నా.. ఆర్టీఏలో మాత్రం సర్వర్‌ సమస్య పరిష్కారం కావడం లేదు. గడిచిన పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రయివేట్‌ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలోనూ ఆన్‌లైన్‌ విధానంలో సేవలు అందుతున్నాయి. అయితే ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడూ సాఫ్ట్‌వేర్‌లో చేపట్టాల్సిన మార్పులు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో రాష్ట్రంలో రవాణాశాఖ ముందు వరుసలో ఉంది. ఒకవైపు మిగతా ప్రభుత్వ ఆఫీసులతో పోల్చుకుంటే ప్రజలకు ఆన్‌లైన్‌ విధానంలో సులువుగా, పారదర్శకంగా, నగదు రహిత సేవలు అందిస్తోంది. ఏటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయమూ సమకూర్చుతోంది. అలాంటి రవాణాశాఖలో పదేండ్ల కింద ఏర్పాటు చేసిన సర్వర్‌లతో ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. సడెన్‌గా సర్వర్‌ డౌన్‌ వంటి జరుగుతున్నాయి. వారం రోజులుగా ఇవే సమస్యలు తలెత్తున్నాయని ఆర్టీఏ వర్గాలు చెబుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అయినా ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించడం లేదు. రవాణాశాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను పారదర్శకంగా అందజేసేందుకు 2009లో త్రీ టైర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఉన్న టూటైర్‌ సాంకేతిక వ్యవస్థ స్థానంలో మరింత అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 13 ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన సర్వర్లను ఇప్పటికీ రవాణాశాఖ ఉపయోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా సుమారు 12వేలకుపైగా లావాదేవీలు జరుగుతుంటాయి. నిత్యం జరిగే లావాదేవీలను సర్వర్‌లో స్టోరేజ్‌ చేస్తుంటారు. వాస్తవానికి ప్రతి అయిదేండ్లకు ఒకసారి సర్వర్‌ అప్‌గ్రేడ్‌ లేదా అవసరానికి అనుగుణంగా కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. దానికితోడు 18 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఈ లెక్కన సర్వర్‌ సామర్థ్యానికి మించి లోడ్‌ వేస్తున్నారు. సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో వారం రోజులుగా రవాణాశాఖ వాడుతున్న సీఎఫ్‌ఎస్టీ లాన్‌ సపోర్ట్‌ చేయడం లేదు. పని ఆగిపోవడం లేదా ఆలస్యం వంటివి జరుగుతున్నాయి. ఫొటోలు ఎస్కేప్‌ అవుతున్నాయి. అంతేగాక సెకండ్‌ వెహికల్‌ వివరాలు కనిపించడం లేదు. వాహనదారుడి పనులు ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. చాలాసార్లు వాహనాదారులకు నచ్చజెప్పలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లపైచిలుకు ఆదాయాన్ని రవాణాశాఖ ప్రభుత్వానికి సమకూర్చినప్పటికీ.. డిపార్టుమెంట్‌ అవసరాల కోసం ఆ స్థాయిలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, రవాణాశాఖ ఉన్నతాధికారులు సర్వర్ల సామర్థ్యం పెంచి ఆర్టీఏ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

 

Spread the love