వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోండి

– గ్రామాల్లో 17 నుంచి 23 వరకు పారిశుద్ధ్య పనులు
– వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ కార్యదర్శి సుల్తానియా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాబోయే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శివ సందీప్‌కుమార్‌ సుల్తానియా చెప్పారు. దానికోసం ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారంనాడాయన అన్ని జిల్లాల పంచాయతీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ శాఖ డైరెక్టర్‌ హన్మంతరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా వారం రోజులు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని చెప్పారు. గ్రామాల్లో రోజూ రోడ్లు శుభ్రం చేస్తూ, గుంతల్లో నీరు నిల్వ లేకుండా పూడ్చివేయాలని చెప్పారు. పిచ్చిమొక్కలు తొలగించి, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్‌ స్థలాలు, బస్టాపులు క్రమంతప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి, నివారణా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపయోగంలో లేని, పాడైపోయిన బోరు బావులను పూడ్చివేయాలని ఆదేశించారు. గ్రామానికి దూరంగా ఉన్న వైకుంఠధామలకు సోలార్‌ విద్యుత్‌ సమకూర్చాలని ఆదేశించారు. అన్ని గ్రామపంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. నిధులు మంజూరైనా ఇంకా గ్రౌండింగ్‌ చేపట్టకపోవడం సరికాదనీ, అదనపు కలెక్టర్లు శ్రద్ధ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సంజీవరావు, స్పెషల్‌ కమిషనర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love