బుమ్రా అనుమానమే

బుమ్రా అనుమానమే– చాంపియన్స్‌ ట్రోఫీకి స్టార్‌ పేసర్‌ దూరం?
– జాతీయ క్రికెట్‌ అకాడమీలో వైద్య పరీక్షలు
2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వేటలో టీమ్‌ ఇండియాకు కోలుకోలేని దెబ్బ!. భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్‌కు దూరం కానున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న జశ్‌ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో వైద్య పరీక్షలకు వెళ్లగా… చాంపియన్స్‌ ట్రోఫీ జట్టు ఖరారుకు తుది గడువు బుధవారంతో ముగియనుంది.
నవతెలంగాణ-బెంగళూర్‌
భారత స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రాపై టీమ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ అనంతరం మైదానంలో అడుగుపెట్టని జశ్‌ప్రీత్‌ బుమ్రా.. బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆడతాడనే అంచనాలు ఉన్నాయి. కానీ, బుమ్రా నేరుగా బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు బయల్దేరాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వైద్య నిపుణులు ఓ నివేదిక తయారు చేసి జట్టు మేనేజ్‌మెంట్‌కు అందించనున్నారు. ఫిబ్రవరి 12న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి తుది జట్టును ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు లేదా రేపు బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేది లేనిది తేల్చనున్నారు.
ఎన్‌సీఏలో వైద్య పరీక్షలు
జశ్‌ప్రీత్‌ బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఐదో టెస్టు (సిడ్నీ)లో గాయంతో మైదానం వీడిన బుమ్రా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినా బంతి మాత్రం పట్టుకోలేదు. బుమ్రా లేకుండానే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసింది. సిడ్నీలో స్కానింగ్‌ నివేదికలు పరిశీలించిన వైద్యులు బుమ్రాకు ఐదు వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. బుమ్రా కోలుకుంటున్నాడనే ఆశాభావంతో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ అతడిని చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌తో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి లభించగా.. మూడో వన్డే జట్టులో బుమ్రా ఉన్నాడు. కానీ, బుమ్రాకు వెన్నునొప్పి సమస్య ఏమాత్రం తగ్గలేదు. దీంతో మూడో వన్డే వేదిక అహ్మదాబాద్‌కు కాకుండా.. నేరుగా బెంగళూర్‌కు బయల్దేరాడు. ఎన్‌సీఏ వైద్య బృందం బుమ్రాకు వైద్య పరీక్షలు చేశారు. స్కానింగ్‌ రిపోర్టులను వైద్య నిపుణులు పరిశీలించి బీసీసీఐకి మెడికల్‌ నివేదిక అందజేయనున్నారు.
రానాకు అవకాశం?
జశ్‌ప్రీత్‌ బుమ్రా భారత క్రికెట్‌ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. బుమ్రా తుది జట్టులో నిలిస్తే విజయావకాశాలు సైతం 30-35 శాతం మెరుగవుతాయని చెప్పటం అతిశయోక్తి కాదు. అయితే, జశ్‌ప్రీత్‌ బుమ్రా అంశంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభం కానుంది. గ్రూప్‌ దశను మినహాయిస్తే.. నాకౌట్‌ మ్యాచులకైనా బుమ్రా ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే నమ్మకం కలిగితే అతడిని జట్టులో ఉంచనున్నారు. బుమ్రా వంటి పేసర్‌ సేవలను వదులుకునేందుకు కెప్టెన్‌, కోచ్‌ సిద్ధంగా లేరు. అయితే, బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీలో ఏ దశలోనూ ఆడే అవకాశాలు లేవని వైద్య బృందం స్పష్టం చేస్తే.. యువ పేసర్‌ హర్షిత్‌ రానాకు అవకాశం దక్కనుంది. ఇంగ్లాండ్‌తో తొలి రెండు వన్డేల్లో హర్షిత్‌ రానా రాణించాడు. అరంగేట్రంలో మూడు వికెట్ల ప్రదర్శనతో మెప్పించాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి వికెట్ల వేటలో తడబడినా.. రానా మాత్రం ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌ సీమర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు.
చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గ్రూప్‌-ఏ లో చోటుచేసుకుంది. ఆతిథ్య పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా న్యూజిలాండ్‌లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. భారత్‌ తన మ్యాచులను దుబారు వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేట షురూ కానుంది. ఫిబ్రవరి 23న దాయాది పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో ఢకొీట్టనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌ ఫిబ్రవరి 12న ముగియనుంది. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోనున్న టీమ్‌ ఇండియా అక్కడ్నుంచి నేరుగా దుబారు బయల్దేరనుంది.

Spread the love