– నవతెలంగాణ – ఆళ్ళపల్లి
రేపుఆళ్ళపల్లి మండల కేంద్రంలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో శకుంతల, డి.శ్రీనివాసు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో పురుషులు 09, మహిళలు 06 .. మొత్తం 15 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారన్నారు. అందులో మద్దెల సూర్యకాంతం మహిళా ఓటరు అందుబాటులోకి రాలేదని తెలిపారు. మండలంలో ఎన్నికల నిర్వహణకు గాను ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ డి.రమేష్, ఏపీఓ ఎన్.అనురిక, పోలింగ్ ఆఫీసర్లు బి.శ్రీవాణి, పి.రాజేష్ లు జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సామగ్రి తీసుకుని ఆళ్ళపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి బుధవారం సాయంత్రం చేరుకున్నారని తెలిపారు. ఆళ్ళపల్లిలో ఎన్నికల నిర్వహణకు స్థానిక ఎంపీఓ సీతారామరాజు సెక్టోరియల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని వివరించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గల ఉపాధ్యాయులకు గురువారం ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఉపాధ్యాయులకు ఈ వెసులుబాటు కల్పించిందని, స్థానిక ఉపాధ్యాయ ఓటర్లకు సూచించడం జరుగిందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోయం రామయ్య, ఏఎస్ఐ కె.వెంకటేశ్వర్లు, రెవెన్యూ, ఎంపీడీవో, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.