మా అమ్మ రోకటి పోటుతోనే …
మా ఊళ్ళో వెలుగు చుక్క పొడిచేది,
గురకొయ్యలు వాలంగ ..
జొన్నలు తొక్కి, అంబలి కాచి, బిడ్డలకు తాపి…
ఎవరో తరుముతున్నట్లే అడవికిపోయేది.
ఎర్రటి అగ్గిల దహనమై పోయి,
కంకికి కడివెడు నీళ్ళు తాక్కుంటూ..
సద్దకంకుల కోతతో నిలువెత్తు బతకమ్మయ్యేది .
ఆసామి అదిలించినా , పటేలమ్మ పండ్లు కొరికినా …
ధుఖమంతా కడుపులోనే దాచుకునేది.
పెయ్యంతా భూమి పెనం మీద నల్లగా మాడ్చేసి,
పడమటి కొండల్లోకి సూరయ్య పారిపోయ్యాకనే ..
మా యమ్మ ఇంటి తోవ పట్టేది.
నడుస్తున్న కాలి మెట్టెలకు బిడ్డలు తగిలి..
గిన్ని ఊసబియ్యమో, గన్ని గోవింద గుగ్గిళ్ళో..
ఒళ్ళో పోసుకొని తెచ్చేది.
అమ్మ ఎండిన గుండెల మీద చెల్లి ఆకలితో తారాడుతుంటే …
ఆమె వెచ్చని ఒడిలో పడుకొని మేము చెప్పే కబుర్లు వింటూ..
పావురంగా తల నిమిరేది.
తుంటరి పిల్లలు మమ్మల్ని ఏడిపించినప్పుడు …
అమ్మ బ్రహ్మ రాక్షసే అయ్యేది .
మా యమ్మ గోడకు పట్టెలు తీరిస్తే,
కొండమీది కోనేటి రాయుడోచ్చి చూసి పోయేది.
అలికి వారలు తీస్తే..
ఆర్టిస్టులంతా అమ్మ దగ్గర విధ్యార్థులయ్యేది.
అంట్లు, బట్టలు, పేడ, పిండి ఎక్కడ చూసినా ..
అమ్మ కాళ్ళూ… చేతులే కనిపించేవి.
మా అమ్మ ఒక్క నాన్నకే కాదు…
అత్త మామలకూ…ఆడబిడ్డలకు కూడా బానిసే…
మాకు మాత్రం అమత వల్లి, కోరినవి ప్రసాదించే కల్పవల్లి.
అమ్మ అనారోగ్యం పాలైతే…
ఏ డాక్టర్‌ను దరిచేరనీయక పోయేది.
వంటగదిలోని సొంటి, ఎల్లిపాయ, వామే పరామౌషదమయ్యేది.
అమ్మ తినేడెప్పుడో… నిద్ర పోయేదెప్పుడో తెలిసేదే కాదు .
పీడ కల తగిలి నిద్రలో ఉలిక్కిపడితే…
‘నేనున్నాగా బిడ్డా…’ అంటూ
చల్లని ఆప్త హస్తం ఒళ్ళు నిమిరేది.
మేము పెద్దగై, కొలువులు పట్టాక,
అమ్మ తనువంతా డస్సిపోయి ..
ఎండిన మానులా మిగిలి పోయింది .
ఎన్ని ప్రభుత్వ ప్రణాళికలు
అమ్మ కండ్ల ముందే కదిలి పోలేదూ…
కానీ.. ఒక్కటీ అమ్మ కన్నీరును తుడవలేదు.
వాళ్ళకు అమ్మొక ఓటు ముక్క గానే కనపడేది.
అమ్మ చేసిన త్యాగం తలుచుకుంటే ..
గుండెల్లోని దుఖ నది వరదలై పారేది .
మరో జన్మంటూ ఉంటే.. ‘నీకు తల్లిగా పుట్టి ..
కన్న ఋణం తీర్చుకుంటానమ్మా’ అని
కన్నీళ్లతో పాదాలను కడగాలని ఉంది .
– పుప్పాల కష్ణ మూర్తి, 99123 59345