నవతెలంగాణ – ఆర్మూర్
ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో 15 మంది గౌడ కుటుంబాలను బహిష్కరించడం అమానుషమని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ మంగళవారం అన్నారు. రోజురోజుకు వీడీసీల అరాచక పరిపాలన ఎక్కువ అవుతుందని, ఈ నియంతృత్వ పాలన అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వేదిక తరుపున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. గీతా కార్మికులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిసి జీవనాభివృద్ధి కోసం పనిచేస్తుండగా వారిని భంగం కలిగిస్తూ అవమానపరచడమే కాకుండా గ్రామం నుండి బహిష్కరణ చేసినందున వీడీసీలపై తగిన చర్యతీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గౌడ సోదరులు కుంకుమార్చనలో భాగంగా ఆలయంలో కూర్చొని కుంకుమార్చన చేయటానికి అన్ని సిద్ధం చేసుకుని, వచ్చారని వారిని అదే సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రేరేపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సైద్గర్ శ్రీనివాస్, నరేందర్, జిల్లా కార్యదర్శి చిందకింది సంతోష్ , జిల్లా ఆర్గనైసింగ్ సెక్రెటరీ నవీన్ చారి జిల్లా నాయకులు దాసరి రాజేష్ , నల్ల మోహన్ , అంకార్ గణేష్ , నగర అధ్యక్షుడు చంద్రకాంత్ , వడ్ల రాజేష్ , ఆర్ముర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.