3 నుంచి 30కి..

–  ప్రపంచ కుబేరుల సూచీలో పడిపోయిన అదానీ స్థాయి
–  రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
–  ఆ షేర్లను చూపి గతంలో లక్షల కోట్ల రుణాలు సేకరణ
–  అమెరికా ‘ఎన్‌రాన్‌’ కుంభకోణం లాంటిది : ఆ దేశ మాజీ ఆర్థికమంత్రి సమ్మర్స్‌
గౌతం అదానీపై ‘హిండెన్‌బర్గ్‌’ నివేదిక సంధించిన ప్రశ్నలు..ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అదానీ అక్రమాలపై ప్రధాని మోడీ నోరు విప్పటం లేదు. విచారణ జరపాలని కోరుతున్న ప్రతిపక్షాలపై ప్రధాని మాటల దాడికి దిగుతున్నారు. మరోవైపు స్టాక్‌మార్కెట్‌లో అదానీ కంపెనీల పతనం కొనసాగుతోంది. ప్రపంచ బిలియనీర్ల (శత కోటీశ్వరుల) సూచీలో గౌతం అదానీ 3వ స్థానం నుంచి 30వ స్థానానికి పడిపోయారు. స్టాక్‌ మార్కెట్‌లో ఆయన కంపెనీల సంపద రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీనివల్ల గౌతం అదానీకి వచ్చిన ప్రత్యక్ష నష్టం ఏమీ లేదు. ఆ కంపెనీ షేర్ల విలువను చూసి..రుణాలు ఇచ్చిన సంస్థలు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడ్డాయి. కేంద్రంలోని పాలకుల అందండలు లేకుండా అదానీ గ్రూప్‌నకు లక్షల కోట్ల రుణాలు ఎలా దక్కుతాయి? అన్న ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది.
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతం అయ్యాక..అదానీ వ్యాపార సామ్రాజ్యం పేకమేడలా కుప్పకూలటం మొదలైంది. భారతీయ స్టాక్‌ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపింది. అదానీకి చెందిన పది లిస్టెడ్‌ కంపెనీల సంపద దాదాపు రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఓడరేవులు, విమానాశ్రయాలు, వంటనూనెలు, నిత్యావసర సరుకులు, ఎనర్జీ, సిమెంట్‌, డేటా సెంటర్స్‌…రంగాల్లో గౌతం అదానీ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతం అదానీకి ..కేంద్రంలోని పాలకులతో గట్టి బంధాలున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు, ఎల్‌ఐసీ నుంచి వేల కోట్లు రుణాలు దక్కటానికి అవే కారణం.
ఎన్‌రాన్‌ కుంభకోణం తలపిస్తోంది..
హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత గౌతం అదానీ మునిగిపోవటమేగాక..ఆయన కంపెనీలకు రుణాలు ఇచ్చిన సంస్థలూ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నా..మోడీ సర్కార్‌ మాత్రం మౌనం వహిస్తోంది. అమెరికాలో 2001లో ‘ఎన్‌రాన్‌ కుంభకోణం’ బయటపడ్డాక..ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు భారత్‌లోనూ అదే సంభవించవచ్చునని అమెరికా మాజీ ఆర్థికమంత్రి లారీ సమ్మర్స్‌ అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం ‘వాల్‌స్ట్రీట్‌ వీక్‌’తో మాట్లాడుతూ, ”భారత్‌లో ఎన్‌రాన్‌ తరహా పరిస్థితులు ఏర్పడొచ్చు. జీ-20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న ఆ దేశం వైపు ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని వివరించారు. అమెరికాలో ప్రముఖ ఇంధన సంస్థల్లో ఒకటైన ‘ఎన్‌రాన్‌ కార్పొరేషన్‌’ 2001లో తన ఆదాయాలను పెంచి చూపింది. అంతేగాక నష్టాలను దాచిపెట్టింది. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ షేరు విలువలు భారీగా క్షీణించి..దివాళా తీసింది.
రూ.6.6లక్షల కోట్ల సంపద ఆవిరి
ఫ్రాన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ విలువ గత నెలరోజుల్లో 80.68శాతం పడిపోగా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 74.62 శాతం మేర నష్టపోయింది. జనవరి 24వ తేదీ నుంచి ఇప్పటివరకు అదానీ ట్రాన్స్‌మిషన్‌ విలువ 74.21 శాతం పడిపోయింది. అదానీ పవర్‌, అదానీ విల్మర్‌, సిమెంట్‌ యూనిట్స్‌, మీడియా, అదానీ పోర్ట్స్‌, సెజ్‌ల మార్కెట్‌ విలువ గణనీయంగా తగ్గిపోయింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడి కాకముందు 120 బిలియన్‌ డాలర్ల (సుమారుగా రూ.9.9లక్షల కోట్లు) సంపదతో ఉన్న అదానీ గ్రూప్‌ ఛైర్మెన్‌ గౌతం అదానీ ఏకంగా 80.6 బిలియన్ల (రూ.6.6 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారు. అంతేకాదు, ప్రపంచ బిలియనీర్‌ సూచీలో 30వ స్థానానికి జారిపోయారు. వ్యాపార రంగంలో పోటీదారైన ముకేశ్‌ అంబానీ ఆసియాలోనే మూడవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతుండగా, ప్రపంచ సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రస్తుత సంపద విలువ 6.7 లక్షల కోట్లు (81.7 బిలియన్‌ డాలర్లు).
గుజరాత్‌లో ఎస్‌ఈజెడ్‌
గౌతం అదానీ గ్రూప్‌ కంపెనీలపై ఓ వైపు తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తుంటే, అహ్మదాబాద్‌లో అత్యంత విలువైన భూమిని కట్టబెట్టడానికి గుజరాత్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్‌ఈజెడ్‌, టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం అదానీ గ్రూప్‌ 94వేల చదరపు మీటర్ల భూవి కావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఇదిగాక, గాంధీనగర్‌కు సమీపంలోని జాస్పూర్‌ గ్రామంలో 202 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వ్యవసాయేతర భూమిని ఇవ్వాలని అదానీ గ్రూప్‌ బీజేపీ సర్కార్‌ను కోరింది. అహ్మదాబాద్‌కు సమీపంలో ఖోదియార్‌ గ్రామ పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)ని, జాస్పూర్‌లో టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని అదానీ గ్రూప్‌ తెలిపింది.

Spread the love