– పేసర్లు బుమ్రా, ప్రసిద్‌పై ఫోకస్
– ఐర్లాండ్,భారత్ తొలి టీ20 నేడు
– రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్18లో..
ప్రతిష్టాత్మక ఆసియా, ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా.. ఐర్లాండ్‌తో టీ20 సవాల్‌కు సిద్ధమైంది. సిరీస్ ఫలితంపై పెద్దగా ఆసక్తి లేదు, కానీ కీలక ఆటగాళ్ల మ్యాచ్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ కనిపిస్తుంది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణలు మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని చూస్తుండగా.. యువ ఆటగాళ్లు సెలక్టర్ల మెప్పు కోసం బరిలోకి దిగుతున్నారు. భారత్, ఐర్లాండ్ తొలి టీ20 నేడు.
నవతెలంగాణ-డబ్లిన్
భారత్, ఐర్లాండ్ టీ20 సవాల్‌కు వేళాయే. బుమ్రా సారథ్యంలో యువ భారత్ మూడు మ్యాచుల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వచ్చింది. ఆసియా కప్ ముంగిట జట్టు ఎంపిక కోసం కొందరు ఆటగాళ్ల మ్యాచ్ ఫిట్‌నెస్ దృష్ట్యా నేడు తొలి టీ20 కీలకంగా మారింది. భారత టెలివిజన్ మార్కెట్‌కు అనుకూలంగా రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 ఆరంభం. ఐర్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. బుమ్రాపైనే దృష్టి : కెరీర్‌లో సుదీర్ఘ విరామం అనంతరం బుమ్రా తిరిగి గ్రౌండ్‌లోకి దిగుతున్నాడు. వరుస గాయాలు, సర్జరీలతో ఇబ్బంది పడిన బుమ్రా.. వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అందుకోసం, బుమ్రా తొలుత మ్యాచ్ ఫిట్‌నెస్ చాటుకోవాలి. ఎన్‌సీఏ ప్రాక్టీస్ గేముల్లో రోజుకు 12 ఓవర్లు సంధించినా.. టీ20ల్లో రెండు స్పెల్స్‌లో, కుదిరితే ఓ స్పెల్‌లో నాలుగు ఓవర్లు సంధించటం బుమ్రాకు తాజా సవాల్. ప్రసిద్ కృష్ణ సైతం వన్డే జట్టులో కీలకం. దీంతో ఈ ఇద్దరు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే.. ఆసియా కప్ జట్టు ఎంపికకు ముందు సెలక్షన్ కమిటీ పని సులువు కానుంది. ఇక కేరళ స్టార్ సంజు శాంసన్‌కు జట్టులో చోటుపై సస్పెన్స్ కొనసాగుతుంది. కరీబియన్ పర్యటనలో విఫలమైన శాంసన్‌కు ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వాలా? లేదంటే యువ వికెట్ కీపర్ జితేశ్‌కు చాన్స్ కల్పించాలా? అనే సందిగ్థత కొనసాగుతుంది. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ తన స్థానం నిలుపుకోనున్నాడు. ఐర్లాండ్‌పైనా తిలక్ జోరు కొనసాగితే ఆసియా కప్ జట్టులోనూ తెలుగు తేజాన్ని చూసే అవకాశం లేకపోలేదు. ఇక ఐర్లాండ్‌కు భారత్‌కు మంచి రికార్డు లేదు. అయినా, అగ్ర జట్టుతో సిరీస్‌లో ఉన్నతస్థాయి క్రికెట్ నైపుణ్యం ప్రదర్శించేందుకు ఆతిథ్య జట్టు ఎదురుచూస్తుంది. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నె, హ్యారీ టెక్టర్, లార్కాన్ టక్కర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ జార్జ్ డాక్‌రాల్‌లు భారత్‌కు సవాల్ విసరాలని చూస్తున్నారు. లెఫ్టార్మ్ సీమర్ జోశ్ లిటిల్ ఐపీఎల్ ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు. భారత్‌తో సిరీస్‌లో లిటిల్ నుంచి బిగ్ ఇంపాక్ట్‌ను ఐర్లాండ్ ఆశిస్తోంది. ఎదురులేదు : మలాహైడ్, ది విలేజ్ స్టేడియంలో భారత జట్టుకు ఎదురు లేదు. ఇక్కడ ఐర్లాండ్‌తో నాలుగు టీ20ల్లో తలపడిన టీమ్ ఇండియా నాలుగింటా విజయాలు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమ్ ఇండియా 200 పైచిలుకు పరుగులు పిండుకుంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు మెండు. కానీ భారత్ టాస్, పిచ్ పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.