2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయిల్ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాదిమంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆస్పతులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయిల్‌్ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి.తాజాగా త్రివిధ దళాలు ప్రారంభించిన భీకరదాడులతో లక్షలాది మందిని తరిమేస్తు న్నారు. దిక్కుతోచని జనం తమ ప్రాంతాల నుంచి కకావికలౌతున్నారు.పదాతి దళాలు, వారికి మద్దతుగా యుద్ధ టాంకులు, వీటితో పాటు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాజాలో ఉన్న నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నది. దీంతో కాలినడకన, బండ్లు, దొరికిన వాహనాలతో లక్షలాది మంది గాజా దక్షిణం, ఇతర చోట్లకు వెళుతున్నారు, ఎక్కడ సురక్షిత ప్రాంతం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎక్కడ ఆగితే అక్కడ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో గ్రామాలు, పౌరుల మీద కూడా ఇజ్రాయిల్ మిలిటరీ దాడులు జరుపుతున్నది. ఈ దారుణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భద్రతా మం డలిలో గురువారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 15కు గాను 14 సభ్యదేశాలు బలపరచగా అమెరికా వీటో చేసి అడ్డుకుంది.
గాజా మారణకాండపై ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో హక్కుతో అడ్డుకోవటం ఇది ఆరవసారి. గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు పాల్పడుతున్నట్లు తొలిసారి ఐరాస ప్రకటించింది. అయితే ఆ బృందం వాస్తవాలను పట్టించుకోలేదని, హమాస్‌కు మద్దతుగా వ్యవహరించిందంటూ భద్రతా మండలిలో అమెరికా ధ్వజమెత్తింది. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ ఇలాంటి తప్పుడు నివేదికలిస్తున్న కారణంగానే తాము ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు సమర్ధించుకుంది.ఐరాస మానవహక్కుల కమిషన్ గాజాలో మారణకాండ జరుగుతున్నదని చెప్పటం తప్పుడు ప్రచారమని అమెరికా మధ్య ప్రాచ్య ఉపరాయబారి మోర్గాన్ ఆర్టగస్ ఆరోపించింది.మానవహక్కుల కమిషన్ నివేదిక అంతా అవాస్తవా లతో నిండి ఉందని, హమాస్‌కు లబ్ది చేకూర్చేదిగా ఉందని ఆమె ఆరోపించింది. ఎలాంటి ఆధారాలను చూపకుండా ఇలాంటి నివేదికలను రూపొందించటమంటే తన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు ఐరాసపై ఆమె ఆరోపించింది. యూదు వ్యతిరేక వేధింపులుగా వర్ణించింది.ఇజ్రాయిల్ ఆత్మరక్షణ హక్కును తీర్మానం గుర్తించలేదని, హమాస్ చర్యలను ఖండించలేదని ఆరోపించింది.
సాధారణంగా భద్రతామండలి సమావేశాల్లో ఆయాదేశాల ప్రతినిధులు మాట్లాడిన తర్వాత సమావేశాలు ముగుస్తాయి. కానీ గురువారం నాడు ఒకసారి మాట్లాడిన తరువాత సభ్యులు ఆగ్రహంతో రెండోసారి ప్రసంగించటం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ దుర్మార్గంపై వెల్లడైన ఆగ్రహం, రెండు శిబిరాలుగా దేశాలు చీలిపోవటాన్ని ఇది సూచించింది.గాజాలో మారణకాండను నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించిన పది దేశాల్లో అల్జీరియా ఒక్కటే అరబ్బు దేశం. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలను ఖండించటంతో పాటు, దాడులను ఆపాలని, అక్కడ కరువు విలయతాండవం చేస్తున్నదని, దాడులను మరింతగా విస్తరించేందుకు ఇజ్రాయిల్ పూనుకున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.ఇజ్రాయిల్ ప్రతినిధి మాట్లాడిన తర్వాత తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశప్రతినిధితో పాటు డెన్మార్క్ ప్రతినిధి కూడా కోరగా ఇజ్రాయిల్ వక్త కూడా అదే చేశారు. అల్జీరియాకు అంత ఆగ్రహం ఎందుకని ఎదురుదాడికి దిగాడు. ఇజ్రాయిల్ జైళ్లలో నిర్బంధించిన పదివేల మంది పాలస్తీనియన్లను చిత్రహింసలు పెడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఏ అంతర్జాతీయ సంస్థనూ పరిశీలించేందుకు అనుమతించటం లేదు. వారిని ఏ ఆరోపణలతో నిర్బంధించిందీ కూడా చెప్పటం లేదు.భద్రతా మండలిలో అమెరికా తమకు నైతికంగా మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయిల్ కృతజ్ఞతలు తెలిపింది. భద్రతా మండలి సభ్యులు అల్జీరియా, హమాస్ ప్రభావానికి లోనైనట్లు రాయబారి డానన్ ఆరోపించాడు. గాజాలో ఉన్న తమ బందీలను విడిపించుకొనేందుకు, హమాస్‌ను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నాడు. అమెరికా చర్యతో పాలస్తీనియన్లు తీవ్ర ఆశాభంగం చెందారని ఐరాస రాయబారి రియాద్ మన్సూర్ పేర్కొన్నాడు. గాజా నుంచి వెలువడుతున్న దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతున్నదని ప్రతివారినీ కదిలిస్తున్నాయని చెప్పాడు. పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు, ఇజ్రాయిల్ మిలిటరీ భవనాల మీద నుంచి పౌరుల తలల మీద కాల్పులు జరుపుతున్నది. సామూహికంగా హత్యలు చేస్తున్నారని చెప్పాడు.
భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేసింది.సాయుధ సంస్థ హిజబుల్లా నేతలు, మిలిటియాను మట్టుపెట్టేందుకే ఈ దుర్మార్గం అన్నది తెలిసిందే. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మిలిటరీ 4,500సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్ మిలిటరీ ప్రకటించింది. గతేడాది నవంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం హిజబుల్లా సాయుధుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ పాతిన మందుపాతరలను తొలగించేందుకు కం పూచియా, చైనా నిపుణులను అనుమతించాల్సి ఉంది. అయితే ఇజ్రాయిల్ పదే పదే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నది. అందువలన ఆ రెండు చర్యలూ అమలు జరగటం లేదు. ఒప్పందంలో మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఫ్రెంచి నేతలు తమ మిత్రదేశాన్ని అంకెకు తెచ్చి ఒప్పందం అమలుకు పూనుకోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ డిమాండ్ చేశాడు.ఒక్క దక్షిణ లెబనాన్ మీదనేగాక యావత్ దేశం మీద దాడులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఎక్కడా కనిపించటం లేదు. అసలు లెబనాన్‌లో ప్రభుత్వమే లేదని అందువలన ఆ పేరుతో తాము ఆయుధాలను విసర్జించేది లేదని హిజబుల్లా చెబుతున్నది, ఇజ్రాయెల్ జరుపుతున్నదాడులు తమ వైఖరి సరైనదే అని నిర్ధారిస్తున్నట్లు కూడా అది పేర్కొన్నది. దోహా మీద ఇజ్రాయెల్ దాడులు జరిపిన తర్వాత తన అనుయాయి అయిన కతార్ మీద దాడులను అమెరికా నివారించలేకపోయిందని అలాంటిది లెబనాన్ ఎలా రక్షిస్తుందని హిజబులా ప్రశ్నించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో చేయటాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది.మారణకాండపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నది. తీర్మానం ప్రవేశపెట్టిన పదిదేశాలను ప్రశంసించింది.
భావ ప్రకటనా స్వేచ్చ గురించి గొప్పలు చెప్పే బ్రిటన్ పాలకులు గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి అక్కడి పౌరులు, పాలస్తీనా మద్దతుదారులు వాట్సాప్‌లో సమాచారం, సందేశాలు పంపిన వారి మీద కూడా ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలకు నిరసనగా ఇజ్రాయిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు, ఇజ్రాయిలీ క్లబ్ సభ్యులు పాల్గొనే క్రీడలను బహిష్కరించాలని ఐరోపా వ్యాపితంగా ఉన్న ఫుట్‌బాల్ ఫెడరేషన్లు, మాజీ ఆటగాండ్లు, ఇతరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేయ టాన్ని ఇటలీ రేవు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో రావెన్న రేవుకు వచ్చిన రెండు ట్రక్కులను కార్మికులతో పాటు ఇతరులు అడ్డుకున్నారు. తన వినతి మేరకు ఆయుధాలతో ఉన్న లారీలను అంగీకరించేందుకు రేవు అధికారులు తిరస్కరించినట్లు నగర మేయర్ ప్రకటించాడు. ఇలాంటి ప్రతిఘటనే ఫ్రాన్సు, స్వీడన్, గ్రీస్ కార్మికులు కూడా చేపట్టారు. అయితే ఇటలీ రేవుకు వచ్చిన ఆయుధాలు ఎక్కడి నుంచి తరలించిందీ తెలియలేదు.
ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని జార్జియా మెలోనీపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటలీలో అతిపెద్ద కార్మిక సంఘమైన సిజిఐఎల్ సెప్టెంబరు 22న సగం రోజు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండకు నిరసనగా ఎమెన్‌లోని హౌతీ సాయుధులు ఇజ్రాయిల్‌పై బలమైన క్షిపణిదాడి చేసి రాజధాని టెలిఅవీవ్‌లోని మిలిటరీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు ప్రకటించారు. అయితే డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంది.ఇజ్రాయిల్ మీద ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని అయితే గాజాలో జరుగుతున్న దానిని మారణకాండగా తాము పిలిచేది లేదని జర్మనీ ప్రకటించింది. అక్టోబరులో జరిగే ఐరోపా సమాఖ్యలో ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తామని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పాడు. అయితే తాను సాధించుకున్న లక్ష్యాల దామాషాలో దాని చర్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. వాటిని మారణకాండగా వర్ణించలేమన్నాడు. అక్కడ జరుగుతున్నది మారణకాండ అని ఐరాస కమిషన్ వ్యాఖ్యానించిన తర్వాత జర్మనీ స్పందన ఇది.పాలస్తీనాకు రాజ్యహోదా అన్నది ఇప్పుడు చర్చ కాదన్నాడు.
ఇజ్రాయిల్ దాడులు పెరగటంతో నగర జీవ నాడులు కుప్పకూలుతున్నాయని ఐరాస మావతాపూర్వక సహాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.గడచిన ఐదు రోజుల్లో పదకొండువేల మంది తలదాచుకుంటున్న గృహాలను కూల్చివేశారని, ఇప్పటి వరకు మొత్తం పదిలక్షల మంది నెలవులు తప్పినట్లు ఆదివారం నాటి నుంచే 56వేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది.ప్రతి రోజూ సహాయ సంస్థలు 5.6లక్షల ఆహార పొట్లాలను అందిస్తున్నాయని, ఇజ్రాయిల్ ఒక పథకం ప్రకారం ఈ ఏర్పాట్లను దెబ్బతీస్తున్నదని కొన్ని ఆహార పదార్దాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సరఫరాను అడ్డుకుంటున్నదని పేర్కొన్నది. గాజా దిగ్బంధనాన్ని నిరసిస్తూ అక్కడ చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించేందుకు 44 దేశాలకు చెందిన యాభైకి పైగా చిన్న చిన్న పడవలతో గ్లోబల్ సముద్ ఫ్లోటిలా పేరుతో ఒక సమూహం గాజావైపు ప్రయాణిస్తున్నది. దానిలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, సంఘసేవకులు ఉన్నారు. దాన్ని అడ్డుకొనేందుకు ఇజ్రాయిల్ ్‌పూనుకుంది. ఉగ్రవాదులకు సాయపడేందుకు అనేక మంది ఆ పడవల్లో వస్తున్నట్లు ఆరోపించింది, ఆ ముసుగులో గతంలో మాదిరి దాడి చేసి నిర్భందించేందుకు పూనుకుంది.ఇలాంటి పడవల్లో వెళ్లి సాయం అందించటం పెద్ద విషయం గాకపోయినా ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు 2010 నుంచి సాగుతున్నది. గతంలో హండాలా, మాడలీన్ నౌకలతో వెళ్లినపుడు ఇజ్రాయిల్ డ్రోన్లతో దాడి చేసింది.నౌకలలో ఉన్నవారిని నిర్బం ధించింది.వారిపై దాడి చేయటంతో పాటు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నది, వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించింది.ఈ సారి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడనుందో తెలియదు, యావత్ సభ్య సమాజం ఇజ్రాయిల్ , దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది.
ఎం కోటేశ్వరరావు
8331013288