Tuesday, May 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘అమ్మో’రికా!

‘అమ్మో’రికా!

- Advertisement -

ఒకప్పుడు ‘అమెరికా’ అంటే ఆశ, అవకాశం, అభివృద్ధి. నేడు భారతీయ యువత నోట ‘అమ్మో… అమెరికా!’ అనే నిట్టూర్పు వినిపిస్తోంది. కలల నేల ఇప్పుడు అనిశ్చితి, ఆర్థిక భారాలు, కఠిన నిబంధనలు, అవమానకర వ్యాఖ్యలతో భయపెట్టే ప్రదేశంగా మారుతోంది. ‘అమెరికా వెళ్లాలి’ అనే లక్ష్యం, ‘వెళ్లాలా వద్దా?’ అనే ప్రశ్నగా మారింది. అంతేకాదు, ఈ మార్పు యువత ఆలోచనను కేవలం అమెరికాకే పరిమితం చేయకుండా, కెనడా, జర్మనీ, యుకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వైపు కూడా మళ్లిస్తోంది.
గతంలో అమెరికా స్వప్నం – మంచి చదువు, ఉన్నత ఉద్యోగం, అధిక ఆదాయం – భారతీయ మధ్యతరగతి యువతకు పరమావధిగా ఉండేది. కానీ 2025-26 నాటికి, ట్రంప్ పాలనలో ‘అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే’ నినాదంతో వలస విధానాలు కఠినతరమయ్యాయి. హెచ్-1బి వీసాపై లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన, వేతన ఆధారిత ఎంపిక, మూడేళ్ల నిలిపివేత వంటి చర్యలు, ఇందులో 70 శాతం పైగా భారతీయులే ఉండటంతో, ప్రత్యక్షంగా వారి భవిష్యత్తును దెబ్బతీశాయి. లాటరీ విధానంలోని ఆశ కూడా అంతరించింది. ఈ నేపథ్యంలో ‘అమెరికా ఒక్కటే మార్గం’ అనే భావన కూలిపోతోంది.ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వివాదాస్పదం చేశాయి. భారతీయ మహిళలు ప్రసవ పర్యాటకం ద్వారా పౌరసత్వం పొందుతున్నారనే ఆరోపణ, భారత్‌ను అవమానకర పదాలతో ప్రస్తావించడం, ఇది రాజకీయ ప్రకటనకు మించి, భారతీయుల గౌరవంపై దాడిగా మారింది. భారత ప్రభుత్వం కూడా దీన్ని అనుచితంగా ఖండించడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. యువత ఇప్పుడు ‘మనం ఆహ్వానితులమా, అనుమానితులమా?’ అనే సందేహంతో జీవిస్తోంది.దీని ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల నమోదు 45 శాతం తగ్గింది. వీసా మంజూరు గణనీయంగా తగ్గగా, వేలాది మంది నిపుణులు అనిశ్చితి కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మరోవైపు, అమెరికా సంస్థలే తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలను భారత్‌లో విస్తరిస్తున్నాయి. అంటే భారతీయ మేధస్సు అవసరం తగ్గలేదు. కానీ దాని భౌగోళిక కేంద్రం మారుతోంది. ఇతర దేశాలు కూడా సులభ వలస విధానాలు, నైపుణ్య వీసాలతో భారతీయ ప్రతిభను ఆకర్షిస్తున్నాయి.ఇది భారత్‌కు ఒక ద్వంద్వ పరిస్థితి. ఒకవైపు, తిరిగి వచ్చే ప్రతిభ, పెట్టుబడులు దేశానికి కొత్త బలం కావచ్చు. మరోవైపు, విదేశీ పంపకాలు, అంతర్జాతీయ అనుభవ మార్పిడి తగ్గే ప్రమాదం ఉంది. అయినా, కీలకమైన మార్పు ఇదే – యువత గమ్యాన్ని మార్చుకుంటోంది, గమనాన్ని ఆపడం లేదు.
ప్రపంచం మారుతోంది. వలసల దిశ మారుతోంది. ‘అమెరికా స్వప్నం’ను కాపాడే ప్రయత్నంలోనే అమెరికా, ఆ స్వప్నాన్ని ప్రపంచ యువతకు దూరం చేస్తోంది. అలాంటప్పుడు, భారతీయ యువతకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. అమెరికా ఇక ఏకైక భద్రమైన మార్గం కాదు. కానీ ఇది అదే సమయంలో గొప్ప అవకాశం కూడా. ‘అమ్మోరికా’గా మారుతున్న ఆ నేల స్థానంలో, ‘మన భారత్’ గట్టి ప్రత్యామ్నాయంగా నిలవాలి. దీనికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి – దేశంలోనే ప్రపంచ స్థాయి పరిశోధన, ఉద్యోగాలు, ఆవిష్క రణలను నిర్మించాలి. అప్పుడే వలసల అనిశ్చితిని దేశీయ శక్తిగా మార్చగలం. ప్రపంచం వైపు చూపులు మళ్లుతున్న ఈ సమయంలో, భారత్ స్వప్నం మరింత బలంగా, మరింత గౌరవంగా అవతరించాల్సిన సమయం ఇది.
కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,
9010128884

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -