Tuesday, May 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘పొదుపు’ సూత్రాల వెనుక!

‘పొదుపు’ సూత్రాల వెనుక!

- Advertisement -

వికసిత్‌ భారత్‌ అంటూ దేశాభివృద్ధిపై నిన్నమొన్నటి దాకా ఊదరగొట్టిన ప్రధాని మోడీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేశారు. మొన్న హైదరాబాద్ బహిరంగసభలో మాట్లాడుతూ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, పెను సంకటంలో కూరుకుపోతున్నదని సంకేతాలిచ్చారు. ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకొనే తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పన్నెండేండ్ల పాటు అధికార పీఠంపై ఉన్న మోడీ.. యుద్ధాలను, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. దేశ ఆర్థిక పరిస్థితి అదుపుతప్పి పోతున్నదని చెప్పకనే చెప్పారు. ఇక ప్రభుత్వం చేయగలిగినది పెద్దగా లేదనే అర్థం ధ్వనించేలా బాధ్యతను దేశ ప్రజలపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారికి భరోసానివ్వాల్సిందిపోయి అనవసర భయాలను సృష్టించడం సరికాదు.
దుబారా తగ్గించుకోవాలని ప్రజలకు కర్తవ్య బోధ చేశాడు సరే, అది ఎవరికి వర్తిస్తుంది? ఉన్నోళ్లకు. మరి పేదోడి పరిస్థితి? రెండుపూటల తిండికే దిక్కులేదు. ఇక అనవసర ఖర్చు కూడా ఉంటుందా? మోడీ దృష్టిలో ఉన్నోళ్లకే చేసిన హితబోధ తప్ప సామాన్యుల కొనుగోలు శక్తి పెంచే మాటలెక్కడా కనిపించలేదు.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఎరువుల కొరత ఏర్పడుతుందన్నారు. ‘‘పెట్రోల్‌, డీజిల్‌ వాడకాన్ని తగ్గింని, ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగిం చాలని, రైతులు యూరియా వినియోగం తగ్గించా లని, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని, ప్రజలు సొంత వాహనాలను కాకుండా మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగిం చాలని’’ ఇలా… ప్రజలకు తొమ్మిది పొదుపు సూత్రాలను ఉపదేశించారు. ఎవరికి వారు జాగ్రత్త వహించి, స్వయం క్రమశిక్షణ ప్రదర్శించి‌ ప్రస్తుతం దాపురించిన ఉపద్రవాల నుండి బయట పడాలని సూచించారు. ఈ మాటల వెనుక ఏదైనా ప్రమాదకరమైన ఆర్థిక సైరన్‌ ‌మోగనుందా? అందుకే ఈ హిత వచనాలు పలికారా? అన్న సందేహం వస్తోంది.
‘‘స్వదేశీ వస్తువులనే వాడండి, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించండి’’ అని యువతను ఉద్దేశించి ప్రధాని ఉద్వేగభరిత ప్రసంగాలు చేసిన ప్రధాని…‘‘ దేశీయ సమస్యలను గాలికొదిలేసి… విదేశీ గడ్డలపై విలాసవంతమైన పర్యటనలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు’’. పైపెచ్చు మధ్యతరగతిలో ఎక్కువగా విదేశీ పర్యటనల మోజు పెరిగిందని ఎద్దేవా చేశారు. స్వదేశీ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే దేశ ఆదాయం పెరుగుతుందని ప్రవచించిన ఆయన చేసిన విదేశీ పర్యటనల ఖర్చు, ఆర్భాటం చూస్తుంటే.. ‘‘స్వదేశీ’’ అనేది కేవలం సామాన్య ప్రజల త్యాగాలకు పరిమితమైన మంత్రంగా, ‘‘విదేశీ’’ అనేది పాలకుల విలాసంగా మారిందని స్పష్టమవుతోంది. నిజమైన స్వదేశీ వాదం అంటే విదేశీ వస్తువులను బహిష్కరించమని ప్రజలకు చెప్పడం కాదు, దేశీయ వనరులను విదేశీ శక్తులకు అమ్మకుండా కాపాడటం. పాలకుల విదేశీ విహారాలకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని దేశీయ ఉపాధి కల్పనకు వెచ్చిస్తే.. భారత్ నిజంగానే ఆత్మనిర్భరంగా మారుతుంది. కానీ, ఆ దిశగా మన పాలకులు అడుగులు వేస్తారా?

దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుడి వెన్ను విరుస్తుంటే..వాటిని నియంత్రించాల్సిన ప్రధాని అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను సాకుగా చూపడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. యుద్ధమనేది ప్రపంచవ్యాప్త సమస్యే. అయినప్పటికీ, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌‌లో ధరల పెరుగుదల వేగానికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలే. కానీ, యుద్ధం పేరు చెప్పడం తన వైఫల్యాన్ని ఇతరుల మీదకు నెట్టడమే.
ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ లాభాల కోసం కాకుండా, సామాన్యుడి జీవన ప్రమాణాల కోసం పనిచేయాలి. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో చిత్తశుద్ధిని చాటుకోవాలి. యుద్ధం పేరుతో సామాన్యుడి ఆకలిని విస్మరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కాదు. కరోనా నాటి సంక్షోభాన్ని గుర్తు చేసిన ప్రధాని మళ్లీ అప్పటి పద్ధతులను పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రకటించారు. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించి, పరిష్కార బాధ్యతను ప్రజలపైకి తోసేయలేదు. బహుశా ఇదే మొట్టమొదటిసారి… ఈ అత్యంత దురదృష్ట ఘటనకు పరేడ్‌గ్రౌండ్‌ వేదికైంది. సంకీర్ణ శకంలో, 1989లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి, 47 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌ మోడీలాంటి పిలుపునివ్వలేదు.
కానీ, మోడీ మాత్రం ‘‘ఏడాది వరకు ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా.. బంగారాన్ని, నగలను కొనవద్దు. దేశభక్తి మనకు సవాల్‌ విసురుతున్నది. ప్రజలందరూ ఆ చాలెంజ్‌ను స్వీకరించాలని’’ కొత్త మార్గదర్శకాలను దేశం ముందుంచారు. ప్రధాని ఈ పిలుపునివ్వడం శోచనీయం. ఆ వృత్తిపై ఆధారపడి జీవించేవారి పరిస్థితేంటి? ఇవి ఒక పీఠాధిపతిగా చేసిన ఉపవచనాలు వలే ఉన్నాయి గాని, దేశాధినేతగా ఏమి చేయబోతున్నారో మాత్రం మాట్లాడక పోవడం గమనార్హం. ప్రధాని అంతరాత్మను విజ్ఞులైన ప్రజలు ఇకనైనా గుర్తించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -