కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింటి వెనుక చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే. అక్కడ ఓడింది కేవలం ఎల్‌డీఎఫ్ ప్రభుత్వమేనా? లేక ప్రజా రాజకీయాలా? ఈ ప్రశ్నను తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఈ ఎన్నికలను కేవలం ఒక సాధారణ అధికార వ్యతిరేక తీర్పుగా మాత్రమే చూడటం అంటే అది భారత రాజకీయాల్లో జరుగుతున్న లోతైన మార్పులను విస్మరించడమే అవుతుంది. ఈ ఫలితాలు మారుతున్న భారత రాజకీయాల స్వభావాన్ని బ పెడుతున్నాయి. కొన్ని ఫలితాలు కేవలం ప్రభుత్వాలను మాత్రమే మార్చవు, సమాజం ఏ దిశగా ప్రయాణిస్తోందో తెలిపే చారిత్రక మలుపులుగా నిలుస్తాయి. కేరళం ఫలితాలు సరిగ్గా అలాంటివే. ప్రచారం పాలనను మించిపోయిన కాలానికి ఈ తీర్పు నిదర్శనం. డబ్బు, మీడియా, మత ధ్రువీకరణలు కలిసి ప్రజా రాజకీయాలను ఎలా వెనక్కి నెడుతున్నాయో చూపిస్తున్న సమకాలీన వాస్తవం.
ఒకప్పుడు ఎన్నికలు ప్రధానంగా ప్రజల జీవన సమస్యల చుట్టూ తిరిగేవి. భూమి, ఉపాధి, విద్య, ఆరోగ్యం, కార్మిక హక్కులు, ధరల పెరుగుదల.. ఇవే రాజకీయ చర్చలకు కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు దఅశ్యం పూర్తిగా మారి పోయింది. ఎన్నికలు క్రమంగా ప్రజల జీవితాల నుంచి దూరమై, భావోద్వేగాల నిర్వహణగా మారుతున్నాయి. ఇప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేది కేవలం పాలన కాదు, ప్రచారం. నిజాలు కాదు, నిర్మించబడిన కథనాలు. ప్రజల అనుభవాలు కాదు, వారి భయాలు, ఆవేశాలు, మానసిక ఉద్రిక్తతలు. ప్రజల జీవన సమస్యలు ఎన్నికల వేదికలపై అక్కడక్కడ వినిపించినా, అవి నిర్ణయాత్మక రాజకీయ చర్చలుగా నిలబడే పరిస్థితి క్రమంగా బలహీనపడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, లౌకికత, సామాజిక న్యాయం వంటి అంశాలను కేంద్రంగా పెట్టుకుని రాజకీయాలు చేసే వామపక్ష శక్తులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం సహజమే. అందుకే కేరళం ఎన్నికల ఫలితాలను కేవలం ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ ఓటమిగా మాత్రమే చూడటం సరిపోదు. అది ప్రజా రాజకీయాలు ఎదుర్కొంటున్న సవాలుగా, భారత ప్రజాస్వామ్యానికి ఓ హెచ్చరికగా చూడాలి.
కేరళం ఎందుకు ప్రత్యేకం?
ఎందుకంటే ఈ దేశంలో కేరళం కేవలం ఓ రాష్ట్రం కాదు. భారతదేశంలో నిజమైన ప్రజా రాజకీయాలు ఎంతవరకు సాధ్యమో చూపించిన నేల. మార్కెట్ ఆధారిత అభివృద్ధి నమూనాల మధ్య కూడా ప్రజాకేంద్రిత పాలనకు స్థలం ఉంటుందని నిరూపించిన భిన్న అనుభవం. భూ సంస్కరణల నుంచి ప్రజా ఆరోగ్య వ్యవస్థ వరకు, అక్షరాస్యత నుంచి స్థానిక స్వపరిపాలన వరకు.. కేరళంలో కనిపించే అనేక సామాజిక పురోగతుల వెనుక దీర్ఘకాలిక ప్రజా ఉద్యమాల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వామపక్ష ఉద్యమాల పాత్ర అత్యంత కీలకమైనది. కేరళంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలది కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితమైన కృషి కాదు. సమాజాన్ని సమానత్వ దిశగా మార్చాలన్న సంకల్పం, ఆధిపత్యాలను ప్రశ్నించిన రాజకీయ సంస్కృతి, కార్మికుల గౌరవాన్ని సామాజిక చర్చల కేంద్రంగా తీసుకొచ్చిన ఉద్యమ సంప్రదాయం ఆ ప్రభుత్వాల సొంతం. విద్య, ఆరోగ్యం, సామాజిక, ఆహార భద్రత.. వీటిని ప్రభుత్వ పథకాలుగా కాకుండా ప్రజల హక్కులుగా స్థిరపరిచిన చరిత్ర కేరళం వామపపక్ష ప్రభుత్వాలది..
కోవిడ్ సమయంలో ప్రపంచం ఎందుకు కేరళం వైపు చూసింది? వరదలూ విపత్తుల సమయంలో అక్కడి సామాజిక సంఘీభావం ఎందుకు ప్రత్యేకంగా కనిపించింది? ప్రజా ఆరోగ్య వ్యవస్థ, స్థానిక సంస్థలు, అక్షరాస్యత, మహిళల భాగస్వామ్యం.. ఇవన్నీ ఎందుకు జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి? ఎందుకంటే కేరళంలో అభివఅద్ధి అనేది కేవలం రహదారులు, భవనాలు, పెట్టుబడుల గణాంకాలతో కొలవబడలేదు. మనుషుల జీవన ప్రమాణాలతో కొలవబడింది. కేరళంలో వామపక్ష రాజకీయాల ప్రత్యేకత అదే. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు ప్రభుత్వాలను భయంతో చూస్తారు. కేరళలో మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామాజిక సంస్కృతి బలంగా కనిపిస్తుంది. రాజకీయ భేదాలు తీవ్రంగా ఉన్నా, సామాజిక అంశాలపై చర్చించే ప్రజాస్వామ్య వాతావరణం కేరళంలో నేటికీ కూలిపోలేదు. అదే కారణంగా ఆ రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఎందుకంటే అక్కడ రాజకీయ పోరాటం కేవలం అధికార మార్పిడి కోసం కాదు, సమాజం ఏ విలువల మీద నిలబడాలి అన్న ప్రశ్న చుట్టూ సాగుతుంది. కానీ ఇప్పుడు ఆ కేరళం కూడా మారుతోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మత ధ్రువీకరణ రాజకీయాలు, కార్పొరేట్ మీడియా ప్రభావం, సోషల్ మీడియా ఆధారిత ప్రచార సంస్కృతి.. ఇవన్నీ కేరళం రాజకీయాల్లోనూ లోతుగా ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజా చర్చలతో నిండిన రాజకీయ వాతావరణంలో ఇప్పుడు భావోద్వేగాల ఆధారిత విభజనలు పెరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు అసలు ఆందోళన. ఎందుకంటే దీనివలన కేరళంలో బలహీనపడేది కేవలం వామపక్షం మాత్రమే కాదు, ప్రజా సంక్షేమం, లౌకికత, సామాజిక న్యాయం ఆధారంగా నిర్మితమైన ఒక రాజకీయ సంస్కృతి కూడా.
మీడియా – కార్పొరేట్ రాజకీయాల కొత్త ఆధిపత్యం
భారత రాజకీయాల్లో గత రెండు దశాబ్దాల్లో అత్యంత ప్రమాదకరంగా మారిన పరిణామం ఏమిటంటే.. రాజకీయాలు క్రమంగా ప్రజల చేతుల నుంచి జారిపోయి, ప్రచార యంత్రాంగాల ఆధీనంలోకి వెళ్లడం. మీడియా ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే వేదికగా ఉండేది. ఇప్పుడు అందులో ఓ పెద్ద భాగం అధికారానికి ప్రతిధ్వనిగా మారుతోంది. వార్తలు క్రమంగా సమాచారంగా కాకుండా “నిర్మించబడిన రాజకీయ వాతావరణం”గా మారుతున్నాయి. టెలివిజన్ స్టూడియోలు ఇప్పుడు ప్రజాస్వామ్య వేదికలు కావు, రాజకీయ యుద్ధ గదులు. ప్రసార మాధ్యమాలు ఇప్పుడు కేవలం సమాచార వేదికలు కాదు, అభిప్రాయాల తయారీ కర్మాగారాలు. సోషల్ మీడియా ఆల్గోరిథమ్‌లు, డేటా ఆధారిత రాజకీయ మేనిప్యులేషన్, మత-కుల ధ్రువీకరణలు, వ్యక్తి ఆరాధన… ఇవన్నీ కలిసి ఓటరును ఒక పౌరుడిగా కాదు, రాజకీయ వినియోగదారుడిగా చూస్తున్నాయి. ఒక అబద్ధాన్ని వేలసార్లు వినిపించి నిజంలా నమ్మించే ప్రచార సాంకేతికత ఇప్పుడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. ప్రజలు ఏ విషయం చర్చించాలి? ఎవరిని దేశభక్తులుగా చూడాలి? ఎవరిని శత్రువుగా భావించాలి? ఎవరిని ద్వేషించాలి? ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియా కథనాల ద్వారానే నిర్దేశించబడుతున్నాయి. కార్పొరేట్ పెట్టుబడులు మీడియాను క్రమంగా రాజకీయ-ఆర్థిక ప్రయోజ నాల సాధనంగా మార్చుతున్నాయి. వార్తల కంటే ప్రచారం ముఖ్యమవుతోంది. వాస్తవాల కంటే “ఇంపాక్ట్” ముఖ్యమవు తోంది. నిజాన్ని తెలియజేయడం కంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఎక్కువ లాభదాయక వ్యాపారంగా మారింది.
ఈ పరిస్థితిలో కార్పొరేట్ మద్దతు, మీడియా శక్తి, భారీ ఆర్థిక వనరులు లేని రాజకీయ శక్తులు సహజంగానే ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ముఖ్యంగా ప్రజల మధ్య నిజాయితీగా పనిచేసే వామపక్ష రాజకీయాలకు ఇది మరింత కఠిన పరిస్థితి. ఎందుకంటే వామపక్షాల రాజకీయ పద్ధతి పూర్తిగా భిన్నమైనది. అవి ప్రజల భయాలను రెచ్చగొట్టి ఓట్లు అడగవు. మత విద్వేషాన్ని ఎన్నికల వ్యూహంగా మార్చవు. మీడియా సామ్రాజ్యాలను కొనుగోలు చేసి ప్రజాభిప్రాయాన్ని తయారు చేయవు. బూటకపు వాగ్దానాలతో నమ్మించాలని చూడవు. ప్రజల జీవిత సమస్యలను రాజకీయ ఎజెండాగా నిలబెట్టడమే వాటి పద్ధతి. కానీ ఇప్పుడు ప్రజల అసలు సమస్యలకంటే “ఇమేజ్” పెద్దది అయిపోయింది. విధానాలకంటే ప్రచారం ముఖ్యమవుతోంది. ప్రజాస్వామ్యం క్రమంగా మార్కెటింగ్ ప్రక్రియగా మారుతోంది. ఇది కేవలం వామపక్షాల సమస్య కాదు, మన ప్రజాస్వామ్యమే ఎదుర్కొంటున్న లోతైన సంక్షోభం. ఎందుకంటే ప్రజలు వాస్తవాల ఆధారంగా కాకుండా నిరంతర ప్రచార ప్రభావంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి పెరిగినప్పుడు, ఎన్నికలు జరుగుతూనే ఉన్నా ప్రజాస్వామ్య ఆత్మ బలహీనపడుతుంది. అందుకే కేరళం ఎన్నికల ఫలితాలను కేవలం ప్రాంతీయ రాజకీయ పరిణామంగా చూడటం సరిపోదు. మన ప్రజాస్వామ్యంపై మీడియా-కార్పొరేట్ ఆధిపత్యం ఎంత వేగంగా పెరుగుతోందో తెలిపే హెచ్చరికగా గుర్తించాలి.
వామపక్షాలకు కొత్త సవాళ్లు
అయితే ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వామపక్షాలు కూడా కొన్ని కీలక ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. భారత రాజకీయాల స్వభావం వేగంగా మారుతోంది. ప్రజల జీవన అనుభవాలు, రాజకీయాల భాష, కమ్యూనికేషన్ పద్ధతులు.. అన్నీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఈ మార్పులను మరింత లోతుగా అర్థం చేసుకుంటూ, కొత్త తరాలతో మరింత సజీవమైన సంబంధాలను నిర్మించాల్సిన అవసరం వామపక్షాల ముందుంది. ప్రజా ఉద్యమాల గొప్ప చరిత్ర వామపక్షాల బలం. ఆ చరిత్ర ప్రతి కొత్త తరంతో సంభాషించాలి. అందుకోసం ప్రజా రాజకీయాల అసలు స్వభావాన్ని కోల్పోకుండా కొత్త రాజకీయ భాషను నిర్మించాలి. ప్రచార రాజకీయాలను అనుకరించడం వామపక్షాల మార్గం కాదు. ప్రజల జీవిత సమస్యలను రాజకీయాల కేంద్రంగా నిలబెట్టడమే వాటి చారిత్రక బలం. అదే వామపక్ష రాజకీయాల అసలు పునాది. అయితే మారుతున్న కాలాన్ని అర్థం చేసుకుంటూనే, తమ ప్రజా రాజకీయాల ఆత్మను ఎలా విస్తరించాలి అన్నది వామపక్షాల ముందున్న అసలు ప్రశ్న.
అయితే ఈ ప్రశ్నలన్నింటి మధ్య ఒక వాస్తవాన్ని మరిచిపోకూడదు. ఎన్నికల రాజకీయాలు ఎంతగా మారినా, ప్రచార యంత్రాంగాలు ఎంత శక్తివంతంగా మారినా.. ప్రజల నిజజీవిత వైరుధ్యాలు మాత్రం అలాగే మిగిలే ఉంటాయి. అది ఈ వ్యవస్థ లక్షణం. అదే ప్రజా రాజకీయాల అవసరాన్ని మళ్లీ మళ్లీ సజీవంగా ఉంచుతుంది. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బను కొందరు “వామపక్షాల అంతం”గా చిత్రీకరించ డానికి ప్రయత్నించవచ్చు. కానీ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, వామపక్ష ఉద్యమాలను కేవలం ఎన్నికల గెలుపోటములతో కొలిచిన అంచనాలు ఎన్నోసార్లు తప్పు అని నిరూపితమ య్యాయి. ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం అనేది కేవలం అధికారాన్ని నిర్వహించే రాజకీయ శక్తి మాత్రమే కాదు. సమాజంలోని అణగారిన వర్గాల ఆవేదనల నుంచి, కార్మిక-రైతాంగ పోరాటాల నుంచి, సమానత్వ ఆకాంక్షల నుంచి పుట్టిన ఒక చారిత్రక ప్రవాహం. వామపక్షాల ఉనికి కేవలం చట్టసభల్లో కాదు, ప్రజల దైనందిన జీవన పోరాటాల్లో ఉంటుంది. ప్రచార రాజకీయాలు కొంతకాలం ప్రజాభిప్రా యాన్ని ప్రభావితం చేయవచ్చు. డబ్బు, మీడియా, కార్పొరెట్ శక్తులు ఎన్నికల ఫలితాలను మలచవచ్చు. కానీ ప్రజల నిజజీవిత సమస్యలను శాశ్వతంగా మౌనం చేయలేవు. ఎందుకంటే ఆకలి ఇంకా ముగియలేదు. నిరుద్యోగం ఇంకా ముగియలేదు. అసమానత ఇంకా ముగియలేదు. అన్యాయం ఇంకా ముగియలేదు. అందువల్ల ప్రజా రాజకీయాల అవసరం కూడా ముగియదు. కేరళ ఎన్నికల ఫలితాలను ఈ విస్తృత రాజకీయ నేపథ్యంలోనే చూడాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఓటమి కాదు. భారతీయ రాజకీయాలు ఎటు సాగుతున్నా యన్న ప్రశ్నను మరోసారి మన ముందుంచిన పరిణామం.
రమేష్ రాంపల్లి
అది ఓటమి కాదు… ఓ ప్రమాదానికి సంకేతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


