Thursday, June 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ యుద్ధోన్మాదానికి బ్రేక్

ట్రంప్ యుద్ధోన్మాదానికి బ్రేక్

- Advertisement -

యుద్ధ అధికారాలకు కత్తెర వేస్తూ సెనెట్ తీర్మానం ఇరాన్‌పై సైనిక చర్యను ఆపండి… బలగాలను వెనక్కి రప్పించండి
శత్రువుపై పోరు సాగించాలంటే
కాంగ్రెస్ ముందస్తు అనుమతి తప్పనిసరి


వాషింగ్టన్
: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదానికి సెనెట్ బ్రేక్ వేసింది. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేయాలని ట్రంప్‌ను ఆదేశిస్తూ ఈ నెల 23న ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అను కూలంగా 50 ఓట్లు రాగా 48 మంది సభ్యులు వ్యతిరేకిం చారు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలకు కత్తెర వేస్తూ ప్రతినిధి సభ ఈ నెల ప్రారంభంలోనే 215-208 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై మొదలు పెట్టిన దాడులను కొందరు అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులే వ్యతిరేకించారు. దీంతో ప్రతినిధిసభలోనూ, సెనెట్‌లోనూ డొనాల్డ్‌కు శృంగభంగం తప్పలేదు. 1973లో యుద్ధ అధికారాల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోని ఉభయ సభలు దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి. ఇరాన్ నుంచి అమెరికా సాయుధ దళాలను వెనక్కి రప్పించాలని ఈ తీర్మానం ట్రంప్‌ను ఆదేశించింది. అంతే కాకుండా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్య చేపట్టకూడదని నిర్దేశించింది.

ట్రంప్ చర్యలకు ఇటీవలి కాలం వరకూ రిపబ్లికన్లు దాదాపుగా పూర్తి మద్దతు ప్రకటించే వారు. అయితే ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం ఆయనపై వ్యతిరేకతను పెంచింది. యుద్ధం కోసం పెద్ద మొత్తంలో నిధులు అందించాలంటూ ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను కోరిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. వాస్తవానికి ప్రతినిధిసభలోనూ, సెనెట్‌లోనూ రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. అయితే నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొందరు అధికార పార్టీ సభ్యులు పలు అంశాలపై ట్రంప్‌తో విబేధిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటారా అనేది సందేహాస్పదంగా మారింది. తన మద్దతుదారుల కోసం 1.8 బిలియన్ డాలర్లతో ‘పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రతిపాదించినప్పుడు కొందరు రిపబ్లికన్ సభ్యులు అడ్డుపడ్డారు. ఇమ్మిగ్రేషన్ అణచివేతకు సంబంధించిన 70 బిలియన్ డాలర్ల బిల్లును కూడా వారు వ్యతిరేకించారు.

చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు
కాంగ్రెస్‌లోని రెండు సభలు తీర్మానాన్ని ఆమోదిం చడంతో అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండనే అది నేరుగా అమలులోకి వస్తుంది. దీనిపై అధ్యక్షుడికి ‘వీటో’ అధికారాలు ఉండవు. అయితే తీర్మానం చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి చట్టపరంగా పూర్తి స్థాయి మద్దతు ఉండదని అధ్యక్షభవనం తెలిపింది. ఇది కేవలం ఓ ప్రతీకార చర్య మాత్రమేనని అధికారులు వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఘర్షణలు ముగిశాయని, ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం ఏమీ లేనందున సైన్యాన్ని ఉపసంహరించుకోవడం అనే మాటకు అర్థమే లేదని అన్నారు. అయితే ఈ తీర్మానం అధ్యక్షుడిని కట్టడి చేస్తుందని, ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డెమొక్రాట్లు హెచ్చరించారు.

షాక్ ఇచ్చిన రిపబ్లికన్లు
సెనెట్‌లో జరిగిన ఓటింగ్ సందర్భంగా నలుగురు రిపబ్లికన్లు…రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్‌స్కీ, బిల్ కాసిడీ ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపి తీర్మానాన్ని సమర్ధించి ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. డెమొక్రాట్ సెనెటర్ జాన్ ఫెటర్‌మన్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్ సెనెటర్లు మిచ్ మెక్‌కానెల్, దేవ్ మెక్‌కార్మిక్ ఓటింగుకు గైర్హాజరు కావడంతో తీర్మానం తేలికగా నెగ్గింది.

వారికి దేశభక్తి లేదు…
నా పని మరింత కష్టమైంది : ట్రంప్
తీర్మానానికి మద్దతు ఇచ్చిన ప్రజాప్రతినిధులకు దేశభక్తి లేదని, వారు కేవలం ప్రచారం కోసం పాకులాడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ తీర్మానం తన పనిని మరింత కష్టతరం చేసిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇరాన్‌కు సాయం, ఓదార్పు ఇచ్చిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో వరుసగా పోస్టులు పెట్టారు. సెనెట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘ఇరాన్ పూర్తిగా బలహీనపడింది. మనం అడిగిన ప్రతి దానికీ అంగీకరించే స్థితికి వచ్చింది. దశాబ్దాల తర్వాత అమెరికాను, నన్ను చూసి వణికిపోయింది. ఇలాంటి కీలక సమయంలో సెనెట్ అర్థం పర్ధం లేని ఓటింగ్ పెట్టింది. దీని ఫలితం చూసి శత్రువులు హేళన చేస్తున్నారు. దీని అర్థం ఏమిటని ఇరాన్ ప్రతినిధులు మన అధికారులను a’ అని అన్నారు. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులను ‘లూజర్స్’ అని సంబోధించారు. డెమొక్రాట్లతో కలిసి వారు చేసిన పని కారణంగా విదేశాంగ విధానానికి విఘాతం కలిగిందని అంటూ అయినప్పటికీ ఏ రకంగా అయినా అనుకున్నది సాధిస్తానని ట్రంప్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -