నితీశ్‌కు పిలుపు

నితీశ్‌కు పిలుపు– అభిషేక్‌, రియాన్‌లకు సైతం
– జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి : తెలుగు తేజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్థమాన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ 2024లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డును దక్కించుకున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో విలువైన బ్యాటర్‌గా, నమ్మదగిన పేసర్‌గా నితీశ్‌ కుమార్‌ అరుదైన ఆల్‌రౌండర్‌. జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో ఆడనున్న భారత జట్టులో పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో మెరుపు ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లు అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌ సైతం తొలిసారి జాతీయ జట్టులో చోటు సాధించారు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీ పగ్గాలు దక్కించుకున్నాడు. హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ గాయంతో ప్రస్తుతం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. దీంతో అతడిని సెలక్షన్‌ కమిటీ ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. జింబాబ్వే పర్యటనలో భారత్‌ ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. జులై 6, 7, 10, 13, 14న హరారేలో టీ20 సిరీస్‌ జరుగనుంది.
భారత టీ20 జట్టు : శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోరు, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే.

Spread the love