– జలదిగ్బంధ గ్రామా ప్రజల కష్టాలు శ్రీ వేలాది ఎకరాల్లో పంట నష్టం
నవతెలంగాణ-బెజ్జూర్
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, మరోవైపు మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో ప్రాణహిత నదిలో వదిలిన వరదనీటిలో బెజ్జూరు మండలం అతలాకుతులమవుతుంది. మండలంలోని 12 గ్రామాలకు రవాణా సౌకర్యం అస్తవ్యస్తమైంది. 12 గ్రామాల ప్రజలు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండలంలోని తలాయి తిక్కపల్లి, భీమారం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. గ్రామాల్లో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో నాటుపడవల్లో ప్రమాదం అంచున ప్రజలు ప్రయాణిస్తూ మండలానికి చేరుకుంటున్నారు. ప్రాణహిత సరిహద్దు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పత్తి పంటల నష్టపోయాయి. కనీసం రెవెన్యూ, వ్యవసాయ శాఖ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన పంటలు నష్టపోయిన రైతాంగని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
బంగారి భూపతి, తలాయి గ్రామస్తుడు
ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల 10 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయాను. నష్టపోయిన రైతాంగని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల ఏటా పంటలు నష్టపోతున్నాం. అధికారులు, ప్రభుత్వం సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలి.