భూసమస్య పరిష్కరించాలని చెట్టు ఎక్కిన రైతు..

– తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో ఘటన.
నవతెలంగాణ-దంతాలపల్లి : ఏండ్ల నుండి ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆఫీసర్లు భూ సమస్య పరిష్కరించడం లేదని తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని చెట్టు ఎక్కి రైతు నిరసన తెలిపాడు. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్దనాగరం శివారు ఆజ్య తండాకు చెందిన బాలుకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ధరణిలో కొత్త పాసు బుక్ రాలేదు.దీనిపై గతంలో ఆఫీసర్ల చుట్టూ తిరిగిన ఫలితం ఏమి లేకపోయింది. తనకున్న 2 ఎకరాల భూమిలో 28 గుంటలు అవసరాల నిమిత్తం అమ్ముకున్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటే తనకున్న పాత బుక్ ద్వారా కావడం లేదు. దీంతో ఆఫీసులో సర్వే కోసం దరఖాస్తు చేసుకోగా సర్వేయర్ ఫీల్డ్ మీదకు వెళ్లగా పక్కనున్న రైతులు సహకరించలేదు.దీంతో సర్వేయర్ ఆఫీసుకు వెళ్లిపోవడం జరిగింది. బాధితుడు బాలు చేసేది ఏమి లేక తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో ఉన్న చెట్టు ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు.తను కాస్తులో ఉన్నానని వ్యవసాయ భూమి వేరే వ్యక్తిపై పట్టా చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు, రెవిన్యూ ఆఫీసర్లు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతు చెట్టు దిగాడు.

Spread the love