దండు వెనుక లక్షకు పైగా దండు

A garrison of more than one lakh is behind the garrisonనిండా పాతికేండ్లు కూడా లేని కుర్రాడు మారుమూల పల్లెలో కనీసం మొన్నటి దాకా కరెంట్‌ కూడా లేని ఇంట్లోంచి ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా డిగ్రీ పాఠాలు చెపుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన గొంతు వినిపిస్తున్నాడు అంటే నమ్ముతారా ? దాదాపు లక్షకు పైగా సబ్‌స్క్రైబ్‌ లతో డబ్బులు సంపాదిస్తూ, అతను చదువుతూ… అతని లాంటి చదువుకు దూరమవుతున్న వాళ్ళని చదువువైపు మళ్లిస్తున్నాడు. చుట్టూ పచ్చని పంటల మధ్యలో అక్కడక్కడ ఇళ్లు. ఎంతోశ్రమకోడ్చి చిమ్మచీకట్ల జీవితాన్ని యూట్యూబ్‌ తో వెన్నెల కాంతి చేసుకున్న యువకుడి కథ. వేల మందికి డిగ్రీ పాఠాలద్వారా చదువుల మీద మమకారాన్ని పెంచిన మనిషి కథ. వికారాబాద్‌కి చెందిన యువగొంతుక దండు వెంకట్‌ రాములుతో నవతెలంగాణ జోష్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ.
చుట్టూ ఉన్న పరిస్థితులే మనం ఎదగడానికి దారులు చూపిస్తాయి. జీవితాన్ని మరింత కాంతివంతంగా తయారు చేస్తాయి. మన ఆలోచనలకు పదును పెట్టుకుంటూ వెళ్తే ఎంతటి విజయాన్ని అయిన సొంతం చేసుకోవచ్చని దండు నిరూపిస్తున్నాడు. సెల్‌ఫోన్‌లో వీడియో పాఠాలు చెప్పే దగ్గర నుండి కెమెరాలో పాఠాలు చెప్పేదాకా ఎంత కష్టపడ్డాడో.. ఎంత బరువులు ఎత్తుకున్నాడో.. ఎట్లాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడో తెల్సుకుందాం.
‘సన్నటి బలమైన గొంతు దండు వెంకట్‌ రాములు’ జీవితాన్ని మనం చదవాల్సిన అవసరం వుంది. ప్రస్తుత వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం ఘనపురంకి చెందిన దండు వెంకట్‌ రాములు (21) యూట్యూబ్‌ ద్వారా తన గొంతుని వినిపిస్తున్నాడు. ఫొటోగ్రాఫర్‌గా, తాటి ముంజల బిజినెస్‌ మ్యాన్‌గా, ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకుడిగా, యువకవిగా, విద్యార్థిగా పలు పాత్రల్లో ఎందరికో ఆదర్శమౌవుతున్నాడు.
మామూలు మారుమూల ఇంట్లో నుండి యూట్యూబ్‌ పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇంతమందిని ఎలా సంపాదించుకోగలిగారు.
”నమస్తే ఫ్రెండ్స్‌ నేను మీ దండు వెంకట్‌ రాములు” అంటూ సుమారు 500 పైచిలుకు వీడియోలు చేశాను. ప్రతీ వీడియో నేను చదువుతున్న సెమిస్టర్‌ లోంచి చేసినవే. నేను డిగ్రీ చదువుతూ ఆ డిగ్రీ పాఠాలనే వీడియోలుగా సరళమైన భాషలో సులువుగా అర్థం అయ్యేలా చెప్పాను. అవే ఇప్పుడు నన్ను నిలబెట్టాయి. అసలు నాకు ఈ యూట్యూబ్‌ థాట్‌ ఇదంతా ఏదీ లేదు. మొదట్లో విద్యార్థిగా నేను పదవ తరగతిలో తెలుగు పద్యాల, కవితలపై ఇష్టం ఉండడం.. వాటిని పాడి రికార్డు చేసి యూట్యూబ్‌లోనూ, ఫేస్‌బుక్‌ లోను అప్లోడ్‌ చేసేది. నేను ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు ఒక జియో ఫోన్‌ కొన్నాను. మా ఇంట్లో అదే మొదటి ఫోను. నేను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ చూసింది, వ్యక్తిగతంగా జిమెయిల్‌ క్రియేట్‌ చేసింది ఆ జియో ఫోన్లోనే. ఆ మెయిల్‌ తోనే నేను ఇప్పటివరకు నా యూట్యూబ్‌ ఛానల్‌ ని రన్‌ చేస్తున్నాను. పద్యాలు, పాటలు పాడాలనే జిజ్ఞాస నన్ను ఇట్లా వీడియోల రూపంలోకి తీసుకువచ్చింది. యూట్యూబ్‌ నుంచి డబ్బు వస్తుందన్న విషయం నాకు డబ్బు వచ్చే వరకు తెలియదు. ఛానల్‌ 25 జూన్‌ 2019లో నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు క్రియేట్‌ చేసుకున్నాను. పదవ తరగతి, ఇంటర్‌లో పద్యాలు రికార్డ్‌ చేసి వాటిలో పెట్టేవాడిని. దాని తర్వాత మహబూబ్‌ నగర్‌ ఎం.వీ.ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లడం, అక్కడ అప్పటికి 2020 ఆ సంవత్సరంలో కరోనా తీవ్రస్థాయిలో ఉండడం చేత లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌లో క్లాసులు విని, ఇట్లా కూడా నేను చేయొచ్చు అనిపించింది. యూట్యూబ్‌లో ఎవరెవరు చేస్తున్నారని గమనిస్తూ నా అవసరాన్ని గుర్తించుకొని వీడియోల రూపంలోకి తీసుకువచ్చాను.
మొదట తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్‌, ఆ తర్వాత అన్ని గ్రూపు సబ్జెక్టులు, అన్ని యూనివర్సిటీలు అన్న కాన్సెప్ట్‌తో రాష్ట్రంలో ఉన్న అందరికీ యూజ్‌ అయ్యేటట్లు వీడియోలు ప్రారంభించాను. 2020 సంవత్సరంలో డిగ్రీలో అప్పటికి నా సబ్‌స్క్రైబర్లు 400 నుండి 500 వరకు ఉండవచ్చు. తర్వాత నేను చదివే వాటిని వీడియోలుగా చేస్తున్నాను కాబట్టి, మా కాలేజీ గ్రూపుల్లో నా వీడియోలు షేర్‌ అయినాయి. నేను వ్యక్తిగతంగా ఫొటోగ్రాఫర్‌ కావడం చేత అక్కడ ఫొటోలు తీస్తున్నప్పుడు ఇచ్చిన ఫోన్‌ సహాయం చేత మరికొన్ని సబ్‌స్క్రైబ్‌లు నేనే కొట్టుకున్నాను. ఛానల్‌ పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్‌లో నాకు మొట్టమొదటి పేమెంట్‌ 13000 వచ్చాయి. ఆ సంతోషం వర్ణించలేనిది. ఈ ప్రోత్సాహంతోనే మరిన్ని వీడియోలు చేశాను. అందులో శకుంతలోపాఖ్యానము, రుద్రమదేవి నవల, గజేంద్రమోక్షము, మ్యాథమెటిక్స్‌ వీడియోలు చాలా పాపులర్‌ అయ్యాయి. అన్ని యూనివర్సిటీల వాళ్ళు కాల్‌ చేయడం ప్రారంభించారు. వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి నాకు మధ్య కమ్యూనికేషన్‌ పెంచుకొని వీడియోలు చేస్తుంటే కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు 120000 పైగా సబ్స్క్రైబర్లతో నా ఛానల్‌ రన్‌ అవుతుంది. వీళ్ళందరూ సబ్స్క్రైబర్లు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షకు పైమంది డిగ్రీ విద్యార్థులు. దీనికి తగ్గట్లుగా మెటీరియల్‌ అందించడానికి ఒక యాప్‌ కూడా నా పేరు మీద ఉంది. దీనిలో 5000 పైగా డౌన్లోడ్స్‌ ఉన్నాయి.
యూట్యూబ్‌ నడిపించడం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా అదిగమిస్తున్నారు?
మొట్టమొదట నేను ఎదుర్కొన్న సమస్య రికార్డు చేసే సమయం. ఇది పగటి సమయంలో చేస్తే చుట్టుపక్కల శబ్దాలు రికార్డ్‌ అయ్యేవి. అర్ధరాత్రి రికార్డు చేసేవాడిని. అలా రాత్రుళ్ళు పని చేస్తున్నాను. అట్లాగే రికార్డ్‌ చేసిన వీడియోని అప్లోడ్‌ చేయాలంటే మా ప్రాంతంలో ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగ్గా లేదు. నేను మరో విలేజ్‌కి వెళ్లి అప్లోడ్‌ చేసుకొని రావాలి. మొదట్లో మైకు లేకపోవడం ఇయర్‌ఫోన్స్‌తో రికార్డ్‌ చేయడంతో చూడడానికి వీడియోలు మంచిగా అనిపించకపోయినా చాలామంచి వ్యూస్‌ వచ్చేవి. చాలామంది చూసేవారు. మంచి కామెంట్స్‌ ఉన్నాయి. ఇప్పటికీ విద్యార్థిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి యూట్యూబ్‌ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. బి.ఏ, బి.కాం, బి.బి.ఎ, ఎం.బి.ఎ, బి.ఎస్సి అన్ని గ్రూపులకు సంబంధించిన వీడియోలు చేశాను. తెలుగు, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ నా ఛానల్లో చాలా ప్రజాదరణలో ఉన్నాయి.
ఫొటోగ్రాఫర్‌గా మీ ప్రయాణం ఎటువంటిది?
అమ్మకు నేను ఒకే కొడుకు కావడం, నాన్న లేకపోవడం, మేం నివసిస్తున్నది మా చేను దగ్గర కావడం ఉపాధి కల్పన లేకపోయేది. నేను చదువుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది ఉండేది. ఆ సమయంలో నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ఒక ఫొటో స్టూడియోలో జాయినయ్యాను. ఇప్పుడు కూడా ఆ ఫొటో స్టూడియోలోనే పనిచేస్తున్నాను. వ్యక్తిగతంగా నా వత్తి ఫొటోగ్రాఫర్‌ అనే చెప్పుకుంటాను. పెళ్ళి, పేరంటంలాంటి ఏ కార్యక్రమాలైనా వీలు దొరికినప్పుడల్లా వెళ్తుంటాను.
కులకచర్ల సత్యం ఫొటో స్టూడియో నాకు చాలా సహాయం చేసింది. నేను చదువుకోవడానికి, పుస్తకాలు ఆర్డర్లు చేయడానికి ఇలా అన్నీ నేను ఫొటోగ్రాఫర్‌ గానే సంపాదించుకున్నాను. కెమెరా కొనుక్కోగలిగాను.
తాటి ముంజలు కూడా జీవనాధారమే అంటున్నారు. ఇంకేం పనులు చేసి సంపాదిస్తారు?
సీజన్‌ని బట్టి తాటిముంజలను అమ్ముతుంటా. మా ప్రాంతంలో, పొలాల్లో తాటి చెట్లు చాలా ఉంటాయి. తాటిచెట్లను కొని ముజాలను తీసి అమ్ముతుంటాం. వేసవిలో అవే మా జీవనాధారం. పదవ తరగతికి వచ్చాక తాటి ముంజలు అమ్ముతూ మా ఇంట్లోకి కరెంటు తీసుకొచ్చానంటే నమ్ముతారో లేదో తెలియదు కానీ, అదే వాస్తవం. విద్యార్థిగా చురుకుగా ఉండడం చేత మా గురువుల ప్రోత్సాహం చాలా ఉండేది. అమ్మకు ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్‌ వస్తుంది. అమ్మ వ్యవసాయ పనులు కూలీనాలీ చేసి ఇప్పకాయ, వేప పండు లాంటివి అమ్ముతూ ఉండేది. ఫొటోగ్రఫీతో పాటుగా ఇలాంటి పనులతో వచ్చిన ఆదాయంతో మరింత ముందుకు వెళ్తున్నాను.
రచయితగా మీ అనుభవాలు?
ఇప్పటివరకు నావి ఏ పుస్తకాలు రాలేదు కానీ చాలా కవితలు రాశాను. ఈ కవిత్వం మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఉండడం చేతనే నేను మొదట యూట్యూబ్‌ వీడియోలు చేశాను. తర్వాత సబ్జెక్టు వీడియోలు చేయడంతో విజయం వైపు వచ్చాను. కవిత్వమే లేకపోతే నా యూట్యూబ్‌ ఛానల్‌ లేదు. కవిసంగమంలో చాలామంది దగ్గరయ్యారు. సలహాలు సూచనలు చేశారు. ప్రధానంగా మొగ్గలు అనే సాహిత్య ప్రక్రియలో 100 పైచిలుకు మొగ్గలను, శ్రీకవనాలు అనే సాహిత్య ప్రక్రియలో 25 పైగా శ్రీకవనాలను రాశాను. వీటితోపాటు కొన్ని వ్యాసాలు, రంగురాళ్లు, తోలు చెప్పులు, బూడిద గిన్నెలు, అమ్మ ఆకలయితుందే, కరోనా పంచాంగం, ఇప్పపువ్వు, మా అమ్మ వంటి పలు కవితలను రాశాను. వివిధ పత్రికల్లో అచ్చయినాయి. నవలలు చాలా ఇష్టంగా చదువుకుంటాను. చాలా కథలలు నన్ను కదిలించాయి. ‘లబ్బరి చెప్పులు’ అనే కథను కూడా రాశాను.
భవిష్యత్‌లో మీ ఆలోచనలు ఎలా ఉండనున్నాయి. యూట్యూబ్‌ కేంద్రంగా ఏమి చేయబోతున్నారు?
టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకున్నది వేరే వాళ్ళతో పంచుకోవడం, పిల్లలతో చెప్పడం నా ఫ్యాషన్‌. సాధ్యమైనంత, చెప్పగలిగేంత వరకు నేను టీచింగ్‌ లోనే ఉంటాను. ప్రస్తుతమున్న ఛానల్‌ ను డిగ్రీ వాళ్లకు మాత్రమే కాకుండా మిగతా అందరికి చేర్చాలని కోరిక. ప్రస్తుతం బి.ఈడి చదువుతున్నాను దీని ద్వారా మరొక ఛానల్‌ ‘టీచర్‌ బడి’ అని ప్రారంభించి, దానిలో టీచింగ్‌ కు సంబంధించిన టెట్‌, డీఎస్సీ కాంపిటీటివ్‌ కోర్సుల అంశాలపై బోధించాలనుకుంటున్నాను.
– పేర్ల రాము, 96425 70294

Spread the love