“అదే నన్ను రాయడానికి, చదవడానికి ఇంధనంలా ముందుకు నడిపింది”

ªDirected by

{సంభాషణల రచయిత నాగేంద్ర కాశీగారితో ముఖాముఖి}
ఓ బైరాగి చెప్పిన కథలు, తత్త్వాలు అతడిని గ్రంథాలయం వెదికేలా చేశాయి. కాలేజ్ లో తరగతిగది ‘పాఠాల’ శబ్దంకంటే లైబ్రరీలో సాహిత్యపేజీల మధ్యన ‘నిశబ్దం’పైనే ఎక్కువ మోజుపడ్డాడు. పైకి ‘సాఫ్ట్వేర్’గా మొదలైనా లోపలెక్కడో సాహిత్యం ‘వేరు’ బలపడుతూనే వచ్చింది. కథకుడిగా ‘నల్లవంతెన’తో పాఠకులను మెప్పించినట్టుగానే ‘శ్రీదేవి సోడా కంపెనీ’, ‘కోటబొమ్మాళి’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సంభాషణలు రాసిన ‘నాగేంద్ర కాశీ’గారితో ఈ వారం ‘జోష్’ ముచ్చట్లు…
‘సాహిత్యం’ నుంచి ‘జంప్’ చేసి, సినిమారంగంలో ‘నిలబడడం’ అంత సులువైనది కాదు. అది మీకు ఎలా సాధ్యమయ్యింది?
సాహిత్యం నుంచి జంప్ చేయడం అంటే దాన్ని వదిలేసినట్టు. నేను సాహిత్యంద్వారా సినిమాకు వచ్చాను. సినిమారంగంలో నిలబడడం అంత సులువైన పనికాదు. చాలా తట్టుకుని నిలబడాలి. సక్సెస్ అయితే డబ్బు, గుర్తింపు వెంటనే వచ్చే రంగం కాబట్టి మొదట్లో రిజెక్షన్ ఎక్కువ వుంటుంది. ఇక్కడ మన ప్రతిభను గుర్తించి, మనం రాసింది చదివి ప్రోత్సహించే Initial Push ఒకటి కావాలి. నాకు అది సుకుమార్ గారి లాంటి పెద్ద దర్శకుడి ద్వారా దొరకడంవల్ల నిలబడడం సాధ్యమయ్యింది. అయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే సాఫ్ట్వేర్ రంగం వదిలేసి సినిమాల్లోకి వచ్చాను.
అసలు సాహిత్యం వైపు అడుగులు ఎలా పడ్డాయి?
మా ఇంటి వసారాలో ఒక సాధువు ఉండేవాడు. ఐదారు సంవత్సరాలపాటు ఉన్నాడు. అతను రాత్రిళ్ళు నాకు కథలు చెప్పేవాడు. పద్యాలు పాడేవాడు. ఏదో తత్త్వాలు చెప్పేవాడు. అర్థం అయ్యేవి కాదు గానీ ఏదో మహత్తు ఉండేది దాంట్లో. జానపదాలు ఎక్కువుగా వినపడేవి. అతనిలో ఏదో బాధ ప్రవహిస్తూ ఉండేది. నాకు భారతం ఆ సాధువే చెప్పారు. అప్పుడప్పుడు అతనితో కలిసి సినిమాలకు కూడా వెళ్ళేవాడ్ని. బహుశా అదే కథల మీద ఆసక్తి కలగడానికి కారణమని అనుకుంటాను. సాధువు చెప్పిన పదాల్లోని అర్థాలు వెతుక్కొడానికి తర్వాత ఊళ్ళో ఉన్న లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ పుస్తకాలు చదవడం అలవాటైంది. ఫలితంగా రాయడం… ప్రచురితమవ్వడం… ఇదిగో ఇక్కడిదాకా ఆ సాహిత్యం నన్ను తెచ్చింది.
పుట్టిన ఊరు… కుటుంబ నేపథ్యం… ?
అమలాపురం. చాలా సాధారణమైన దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న నాగేశ్వరరావు 2006లో చనిపోయారు. చిన్నప్పటినుంచి నాన్నంటే భయం ఉండేది. ఎప్పుడు దగ్గరికి వెళ్లి ఒళ్ళో కూర్చుని కబుర్లు చెప్పినా జ్ఞాపకాలు ఏం లేవు. కాలేజ్ రోజుల్లో కొన్నికొన్ని మాటలు అంతే. చాలా సీరియస్ గా ఉండేవాడు. చిన్నపటినుంచి మా నాన్న కష్టపడుతూనే ఉండేవాడు. ఇప్పుడు తెలుస్తుంది ఎంత బాధ్యత మోసాడో అని. ఆ ప్రేమ ఎంత గొప్పదో. అమ్మ(సత్యవతి) కూడా అంతే. ఎంత కష్టపడ్డా పైకి చెప్పేది కాదు. వాళ్ళు ఇద్దరు పెద్దగా చదువుకోలేదు. కానీ మమ్మల్ని బాగా చదివించారు. I’m blessed ఆ విషయంలో. చెల్లి(చిన్నారి), తమ్ముడు(యోగి) ఉన్నారు. పెళ్లైంది. తను(లక్ష్మి) నా ఉద్యోగ రీత్యా చెన్నై, బెంగళూరులలో ఉండాల్సి వచ్చినప్పుడు డియస్సీ జాబ్ ని కూడా వదులుకుంది. ఇప్పుడు నేను సినిమాల్లో బిజీ అయిన తర్వాత పిల్లల(సహస్ర, నిహల్) చదువులు, పేరెంట్ మీటింగ్ వగైరా అన్నీ తనే చూసుకుంటుంది. ఒకమాటలో చెప్పాలంటే భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటాము.
M1, M2, Backlogs, Arrears… మధ్యలో కూడా సాహిత్యాన్ని చదవడం ఎలా కొనసాగించారు?
ఇంటర్మీడియట్ రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు క్లీన్ చేయడం ఒక పని. నాకు నచ్చే పని. పదోతరగతి వరకూ పాపులర్ సాహిత్యం చదివా. అంటే యండమూరి, యద్దనపూడి, మల్లాది, మధుబాబు లాంటి రచయితలు రాసింది. ఇంటర్మీడియట్ లో మొదటిసారి ఆరుద్ర త్వమేవాహం తీసా… అసలు అర్థం కాలేదు. అలాగే పెట్టేసాను. కొంత పరిణతి వచ్చాక శ్రీశ్రీ అర్థమవ్వడం జరిగింది. అదే కోవలో కొకు, బుచ్చిబాబు, రావిశాస్త్రి… ప్రపంచాన్ని చూసే కోణమే మార్చేశారు. ఇక సాహిత్యం నాలో విడదీయలేని భాగమైపోయింది. అది సాహిత్యం గొప్పతనం. ఎంతోమంది గొప్ప రచయితలు వాళ్ళ అనుభవాలు, వాళ్లు సమాజాన్ని, జీవితాన్ని చూసిన విధానం. మన కళ్ళకి కనపడని నిజాలు, మన మెదడుకి అందని ఆలోచనలు, మన బుద్ధికి తోచని తర్కం… ఇదంతా ఒక వంద, నూటయాభై పేజీల్లో దొరుకుతుంటే ఎందుకు చదవం? శరీరానికి ఐరన్, కాల్షియం లాంటివి కావాలి. మెదడుకి మాత్రం పుస్తకం కావాలి. పుస్తకం అనేది మెదడుకి ఇవ్వాల్సిన మల్టీవిటమిన్ టాబ్లెట్.
పేపర్ మీద పాఠకుడి కోసం రాసే కథకు, తెరమీద ప్రేక్షకుడి కోసం రాసే కథకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?
దీనికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. పుస్తకాన్ని సినిమాగా మార్చిన స్క్రీన్ ప్లేలు తీసుకున్నాను. మొదట హాలీవుడ్ స్క్రీన్ ప్లేలు చదివాను. తెలుగులో ‘రాక్షసుడు’, ‘మహల్లో కోకిల’ లాంటివి తీసుకున్నా. అవి మొదట సినిమా కథగా ఎలా మార్చారన్నది నోట్స్ గా రాసుకొనేవాడ్ని. తర్వాత పాత్రలు, వాళ్ళ సంభాషణలు పుస్తకంలో ఎలా ఉన్నాయి? స్క్రీన్ మీద ఏమేం మార్పులు జరిగాయన్నది రాసుకున్నాక పాఠకుడికి, ప్రేక్షకుడికి మధ్య వ్యత్యాసం అర్థమయ్యింది. తర్వాత నుంచి అది అలవాటైపోయింది. ఇప్పుడు సాహిత్య కథ రాస్తే ఊహా ప్రధానంగా పాఠకుడిగా ఉండి రాస్తాను. సినిమాకి రాస్తే దృశ్య ప్రధానంగా ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని రాస్తాను.
సాహిత్య రంగంలో, సినిమా రంగంలో అభిమాన రచయితలు?
సాహిత్యంలో చాలామంది ఉన్నారు. కొకు చాలా ఇష్టం. తిలక్ కథలు ఇష్టం. గోపిని కరుణాకర్, కేశవరెడ్డి, వంశీ(పసలపూడి) కూడా. ఇక సినిమా సంగతికి వస్తే సంభాషణలపరంగా గణేష్ పాత్రో, ఎం.వి.ఎస్.హరనాథరావు, ముళ్ళపూడి, తనికెళ్ళ భరణిగార్ల Pen styel ఇష్టం.
ప్రభావం చూపిన పుస్తకాలు?
ప్రభావం చూపిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమైనవి- the brothers Karamazov(దాస్తోవోస్కీ), వనవాసి(బిభూతి భూషణ్ ఛటోపాధ్యాయ), ఆరు సారాకథలు(రావిశాస్త్రి) అభిమాన రచనలు. రచయితలు.

సుకుమార్, బుచ్చిబాబు(‘ఉప్పెన’ దర్శకులు), వెంకట సిద్ధారెడ్డి వాళ్లతో సాంగత్యం ఎలా ఏర్పడింది?
మొదట వెంకటసిద్ధారెడ్డి ‘రైటర్స్ మీట్’లో పరిచయం అయ్యారు. సాహిత్యంలోకి రావడానికి, కథలు రాయడానికి ఖదీర్ బాబు నిర్వహించే ‘రైటర్స్ మీట్’ ఉపయోగపడింది. అక్కడ రచయితలతో పరిచయం. వేరే భాషల్లో వచ్చే సాహిత్యం. వాటి గురించి చర్చలు, కథా వస్తువు, శైలీ, నిర్మాణపద్ధతుల గురించి చక్కటి విశ్లేషణలు జరిపేవారు. అవి రచయితగా పరిణతిచెందే ఇన్పుట్స్ కొంతమేరకు దొరికాయి. ఇక బుచ్చిబాబుగారు నేనూ ఒకేచోట ఉంటాం. కోవిడ్ టైంలో ఇద్దరం కథాచర్చలు చేసేవాళ్ళం. నా కథలు చదివి చాలా ప్రోత్సహించారు. అలా ఆయన రామ్ చరణ్ సినిమాకి(RC16) రాయడానికి అవకాశం ఇచ్చారు. ఇంక సుకుమార్ గారిని కలవడానికి సంవత్సర కాలం పట్టింది. పుష్ప ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారు నేను రాసిన ‘శ్రీదేవీ సోడా సెంటర్’ సినిమాకు కూడా ఆర్ట్ డైరక్టర్ గా పనిచేశారు. ఆయన్ని అడిగితే నన్ను సుకుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. విషయం ఏమిటంటే సుకుమార్ గారు అప్పటికే ‘In the mood for love’ అనే ప్రేమకథల సంపుటిలో నా కథ ఒకటి చదివి నాకోసం ఎంక్వైరీ చేశారట. ఆ విషయం నాకు తెలీదు. నేను వెళ్ళి కలిస్తే ఇదే పేరుతో ఒక రచయిత ఉన్నాడు తెలుసా అని అడిగారు. ‘అది నేనే sir’ అన్నాను. ‘కథ చెప్తావా’ అని అడిగారు. ‘అందుకే వచ్చాను సార్’ అన్నాను. ‘సరే చెప్పు. నీకు 45 నిమిషాలు మాత్రమే టైం’ అన్నారు(అప్పటికి ‘పుష్ప-1’ బిజీలో ఉన్నారు). కథ పూర్తి అయ్యేసరికి రెండున్నర గంటలు పట్టింది. విన్న వెంటనే లేచి గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టి ‘జాబ్ వదిలేయ్. నేను ఉన్నాను’ అన్నారు. వెంటనే ‘విరూపాక్ష’ సినిమాకి అవకాశం ఇచ్చారు. తర్వాత ‘పుష్ప-2’ కి తీసుకున్నారు. కానీ జాబ్ మానలేదు. ఇది ఆయనకి తెలీదు. నేను వీకెండ్స్ మాత్రమే రాసింది చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. ఆయనకి డౌట్ వచ్చి, గదిలో ఒక్కడ్నే కూర్చోబెట్టి ఎందుకు మానలేదు అని అడిగారు. అప్పటికి నాకు నెలకి లక్షా అరవై వేల జీతం. ఆరోజు ఆయన ఇచ్చిన భరోసాతో జాబ్ మానేశాను. అస్సలు ఈ రోజు వరకు Regret అవ్వలేదు.
సాహిత్యరంగ రచయితలకు, సినిమారంగ రచయితలపై భిన్నాభిప్రాయాలున్నాయి. రెండువైపులా చూసినవాళ్ళుగా మీరేం చెబుతారు?
భిన్నాభిప్రాయాలు అంటే ఏ రకమైన అభిప్రాయాలు? అంటే సాహిత్య రచయితలతో పోలిస్తే సినిమా రచయితలంటే చిన్నచూపు ఉందనా? నేను గమనించినంతవరకు సినిమా రచయితలు Extremely talented. అది కథకులు కావచ్చు, కవులు కావచ్చు. బాగా చదువుకున్న రచయితలు చాలామంది ఉన్నారు. మాధ్యమం వేరు కాబట్టి ఆ రకమైన ఆలోచన ఉందేమోగాని… There are wonderful writers in the film industry.
మీ ‘నల్ల వంతెన’ కథల్లో ఎక్కువగా గోదావరి జీవితం పెనవేసుకుని ఉండడానికి కారణం మీ నేపథ్యమేనా?
అవును. గోదావరి ప్రాంతం అంటే చాలామందికి ఎటుచూసినా పచ్చదనం… ఎక్కడ చూసిన పంట కాలువలు… కొబ్బరి తోటలు… అన్నదే ఇమేజ్ గా కనిపిస్తుంది. కానీ, అక్కడ కూడా నీళ్ళు దొరకని ప్రాంతాలున్నాయి. వలస బతుకులున్నాయ్. జీవిత విధ్వంసం ఉంది. గోదావరి ప్రాంతంలో ఏటుగట్లు మీద వ్యాపారం మొదలైన వరకూ సాహిత్యం రికార్డ్ అయ్యివుంది. ఆ తర్వాత గ్లోబలైజేషన్ ప్రారంభం గోదావరి ప్రాంతం నుంచి రావాల్సినంతగా సాహిత్యం రాలేదు. మిలీనియం తరంలో ఇంకా తక్కువ అయింది. నేను దాన్ని రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేశాను. రాయలసీమ తర్వాత కువైట్ వెళ్ళేవాళ్ళలో గోదావరి వాళ్ళే ఎక్కువ. సీమ నుంచి ‘కువైట్ సావిత్రమ్మ’ (చక్రవేణు), తెలంగాణ నుంచి ‘వలస బతుకులు’ (పెద్దింటి అశోక్ కుమార్) వంటి కథలు వచ్చాయిగానీ మా గోదావరి నుంచి అలాంటి కథలు నాకు కనిపించలేదు. అటువంటి జీవితాల గురించి రాసే ప్రయత్నం చేశాను. నాకథల్లో ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియని గోదావరిని చిత్రించడమే ప్రధానంగా ఉంటుంది. అందులో భాగమే నా‘నల్ల వంతెన’ కథలనుకోవచ్చు. ఇప్పటివరకు నాలుగుదాకా అవార్డులు రావడం సంతృప్తిని ఇచ్చింది. ఏ రచయితైనా కాలాన్ని తప్పించుకొని రాయోచ్చేమోగానీ నేపథ్యాన్ని తప్పించుకోని రాయడం అంత సులువు కాదనుకుంటాను.
మీరు చేసిన, చేస్తున్న సినిమాల గురించి?
మొదటగా ‘పలాస’ కి సహ రచయితగా పనిచేశా. తర్వాత ‘శ్రీదేవి సోడా కంపెనీ’ కి కథ. మాటలు రాశాను. ‘హాయ్ నాన్న’, ‘‘కోటబొమ్మాళి’ కి మాటలు రాశా. ప్రస్తుతం సుకుమార్ ‘రైటింగ్ టీమ్’లో ఉన్నాను. ‘పుష్ప2’, ‘RC16’ కి పనిచేస్తున్నాను. అవి కాకుండా… రష్మీక మందన ‘రెయిన్ బో’ సినిమాకి కూడా మాటలు రాస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.
ఈ మధ్య వచ్చిన అంటే రెండు వారాల వ్యవధిలో రిలీజ్ అయిన కోటబొమ్మాలి, హాయ్ నాన్న… రెండు విభిన్న సినిమాలు. మాటలు రాస్తున్నప్పుడు ఎక్కడా writer block కి గురికాలేదా?
ప్రాజెక్ట్ టైం లైన్స్ వల్ల ఒత్తిడి ఉండేది. అదే సమయంలో పుష్ప2 కూడా రాస్తున్నాను. మూడూ విభిన్నమైన కథలు. ఒక వారం మొత్తం ‘కోటబొమ్మాళి’ రాస్తే , తర్వాతి వారం ‘హాయ్ నాన్న’. ఆ తర్వాత ‘పుష్ప-2’. అప్పుడే ‘RC16’ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది. రైటర్ గా ఛాలెంజ్ గానే ఉండేది. పనికి పనికి మధ్య తగినంత సమయం కుదరకపోవడమే ఇబ్బంది తప్పా ఎక్కడా మోనాటినీ అనిపించలేదు. ఎలాగో కథ, వ్యాసం, మ్యూజింగ్స్ లాంటివి చదవడం, రాయడం వల్ల కావాల్సిన ఎనర్జీ ఉండనే ఉంది. జనరల్ గా ఏం రాయాలో తెలియనప్పుడే writers block ఉంటుంది. మీరు చెప్పిన మూడు విభిన్న సినిమాలు పాత్రల విషయంలో దర్శకులకు స్పష్టమైన అవగాహన ఉంది. రచయితగా కథకి, పాత్రకి ఏం సంభాషణలు రాయాలో నాకు అవగాహన ఉండటంవల్ల writers blockకి అవకాశమే లేదు.
సినిమాకు వెళ్ళొచ్చి ఇంట్లో దొరికిపోవడాలు, సినిమాల్లోకి వెళ్తానంటే నాన్న వారించడాలు, సినిమాల కోసం ‘సినిమా కష్టాలు’…వంటి ఎపిసోడ్లు మీకు ఉన్నాయా?
అలాంటివేం లేదండి. మా నాన్న దాదాపుగా ప్రతిరోజూ సెకెండ్ షోకి వెళ్ళేవాడు. అందుకనేమో నన్ను ఏం అనేవాడు కాదు. మాది కోనసీమ కాబట్టి కొబ్బరి తోటల్లో అలా ఒక రౌండ్ వేసి వస్తే మినిమం రెండు కొబ్బరికాయలు దొరికేవి. అమ్మితే ఐదు రూపాయిలు వచ్చేవి. బెంచ్ కి రెండున్నర, ఇంకో రెండు రూపాయల టిఫిన్. ఇంకో అర్థ రూపాయి మిగిలేది. కొబ్బరి తోటలవల్ల నాకు ఆ లగ్జరీ దొరికింది (నవ్వుతూ…). సినిమాలకి డబ్బులు అడగాల్సిన పని ఉండేది కాదు.
సినిమాలు కాకుండా నాగేంద్ర కాశీ జీవితం ఏంటని అడిగితే ఏం చెప్తారు?
సినిమా కాకుండా అంటే…ఉద్యోగం చేసుకుంటూ కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి.
ఇతర భాషల చిత్రరంగాలతో పోలిస్తే తెలుగుచిత్రాల్లో ‘సాహిత్యం పాలు తక్కువే’నన్న విమర్శ ఉంది. వాస్తవమేనా?
ఇప్పుడు కచ్చితంగా తక్కువే. కానీ, తెలుగు సినిమా మొదటినుండి సాహిత్యంతో పెనవేసుకునే ఉంది. ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన రచయితలు కావచ్చు… ఉద్యమాల నుంచి కావచ్చు… పెద్ద రచయితలైన శ్రీశ్రీ, ఆరుద్ర, త్రిపురనేని గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు. తర్వాత పాపులర్ సాహిత్యం నుండి యండమూరి, యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, ముళ్లపూడి వెంకటరమణ, వంశీలాంటి వాళ్ళు సినిమాల్లో పనిచేసారంటేనే సాహిత్యం ఉందని అర్థం. నాకు తెలిసి గ్లోబలైజేషన్ తర్వాత సొసైటీ కాస్త కెరియర్ ఓరియంటెడ్ సొసైటీగా అయిపోయింది. రాయడం తగ్గిపోయింది. ఆ తర్వాత ఎక్కువుగా జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రాస్తూ వచ్చారు. వాళ్ళు సినిమాల మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. ఒక జనరేషన్ మొత్తం సాహిత్యం వైపుకి రాలేదు. ఆ గ్యాప్ అలా పెరిగిపోతూ వస్తోంది. మళ్ళీ తెలుగు సినిమాలో సాహిత్యం కలిసి ప్రయాణించే కాలం రావాలని కోరుకుంటున్నాను.
16. నాగేంద్ర కాశీ ఈ స్థాయికి రావడానికి నిచ్చెన మెట్లైన వ్యక్తుల పేర్లడిగితే ఏం చెప్తారు?
‘ఈ స్థాయికి రావడానికి’ అంటే నేనేదో పెద్దస్థాయికి చేరాననే అర్థం వస్తుంది. నేనింకా మీరనుకున్న స్థాయికి రాలేదు. ఆ స్థాయిని కూడా నేను నమ్మను. నా ఒక్కో అడుగులో ఒక్కొక్కరు ఉన్నారు. ముఖ్యంగా మా నాన్న. పత్రికలో పాఠకుల లేఖల్లో నా పేరు చూసి మురిసిపోతూ, అది కనబడనివ్వకుండ ఐదు రూపాయలు నా జేబులో పెట్టేవాడు. అదే నన్ను రాయడానికి, చదవడానికి ఇంధనంలా ముందుకు నడిపింది.
17. సాహిత్యరంగం నుంచి రాబోవు వర్తమాన రచయితలకు మీరిచ్చే సూచనలు, సలహాలు?
సూచనలూ, సలహాలూ ఇచ్చేంత పెద్దరచయితని కాదు. కానీ నాకు తెలిసింది ఏందంటే మనం రాయకపోవడం వల్ల సమాజానికి ఏం నష్టం లేదు. కానీ, రాయాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు మాత్రం ఎంత ఎక్కువ చదివితే అంత మంచివాక్యం అలవడుతుంది. మనదైన ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఏం రాస్తున్నాం అనేదానికన్నా ఎందుకు రాస్తున్నామనే స్పష్టమైన అవగాహన కలుగుతుంది. చదవడంతోపాటు పరిశీలన కూడా ముఖ్యమే. అది కొరవడితే రచయిత తేలిపోతాడు.
18. ‘Directed by నాగేంద్ర కాశీ’ భవిష్యత్తులో ఆశించవచ్చా?
ప్రస్తుతం రెండు సంవత్సరాల వరకు ఆ ఆలోచన లేదు.
– మ.మో.రె. బుగడూరు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
9989894308.

Spread the love