ఏమి”టీ” క్రేజ్‌ ఉపాధికి మైలేజ్‌

య్ఉదయం లేవగానే వేడి వేడిగా పొగలు గక్కుతూ పలకరిస్తుంది. సాయంత్రం స్నాక్స్‌తో దోస్తీ కడుతుంది. దోస్తులతో కలిస్తే.. వన్‌ బై టూ అంటూ అభిమానం పంచుతుంది. అతిథులొచ్చినా, మిత్రులొచ్చినా మర్యాదలు చేస్తుంది. మొదలవుతాయి… ముచ్చట్లు కొనసాగుతాయి. అలసటగా ఉన్నప్పుడు.. జోష్‌ కావాలంటే సింగిల్‌ చాయ్ లోపలికి దిగాల్సిందే.. సిప్పు సిప్పుకూ ఉత్తేజం పొందాల్సిందే..! ఒకప్పుడు రోడ్ల పక్కన చిన్న చిన్న టీ కొట్లు, చాయ్ కేఫ్‌లు మాత్రమే కనిపించేవి.. అయితే, కాలం మారింది. పద్ధతులూ మారాయి. అన్నింటా ఎం’జాయ్’ కోరుకుంటున్న జనం టీ ఆస్వాదించడం అదే రీతిలో ఉండాలని భావిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా టీ కొట్లూ మారిపోయాయి. ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. ఇప్పుడు సరికొత్త కార్పొరేట్‌ టీ కొట్లు వచ్చేశాయి. నగరాల్లో విస్తరిస్తున్న టీ ఔట్‌లెట్స్‌ ట్రెండ్‌ గురించి ఈ వారం కవర్‌స్టోరీ.
ఒకప్పుడు టీ తాగాలంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతకాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతి ఏరియాలోనూ టీ కేఫ్‌లు ఏర్పాటయ్యాయి. అదీ విశాల ప్రాంగణాల్లో. శివారు ప్రాంతాల్లో అయితే ఆధునిక హంగులతో పెద్దపెద్ద కేఫ్‌లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. తీరిగ్గా కూర్చొని.. అలా కబుర్లు చెప్పుకుంటూ టీ/కాఫీ తాగేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు సైతం ఖాళీ సమయం దొరికితే చాలు కేఫ్‌ల బాట పడుతున్నారు. కొన్ని కేఫ్‌ల వద్ద కార్లు, బైకుల రద్దీని చూస్తే ఏమి’టీ’ మార్పు అని ఆశ్చర్యం కలగకమానదు. పట్టణ ప్రాంతాలు, చివరకు మండల కేంద్రాల్లో సైతం టీ కేఫ్‌ల సంస్కృతి విస్తరిస్తోంది.
వ్యాపారానికి ఢోకా లేదు..
సమాజంలో పేదలు, ధనికులు అన్న తేడా లేకుండా కొనుగోలు చేసే నిత్యావసరాల్లో టీ ఉత్పత్తులు ముఖ్యమైనవి. ఒకప్పుడు నాలుగైదు బ్రాండ్‌లకు మించి ఉండేవి కావు. ఇప్పుడు మార్కెట్‌లోకి రకరకాల టీ కంపెనీలు వచ్చేశాయి. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తరువాత స్థానం దేశం మనదే!. అసోం, డార్జిలింగ్‌లలోని తేయాకులకు డిమాండ్‌ ఉంది. టీ పొడి ఎగుమతుల్లో కూడా భారత్‌ ముందుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ముప్పయి శాతం టీ పొడిని భారతీయులే వాడేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం కాఫీ కంటే పదిహేను రెట్లు ఎక్కువగా మనవాళ్లు చాయ్ తాగుతున్నారని తేలింది. చాయ్ తాగడం ఈనాటి అలవాటు కాదు. ప్రాచీన కాలం నుంచీ వస్తోంది. అప్పట్లో హెర్బల్‌ టీలు కాచుకుని ఎక్కువగా తాగేవాళ్లు. పరిణామక్రమంలో తేయాకు, పాలు, చక్కెరతో చేసిన టీ తాగడం మొదలైంది. ఇప్పుడు ఆధునిక తరం అభిరుచులు మారడంతో మరిన్ని రకాల ఫ్లేవర్స్‌తో తయారుచేసిన టీలు వచ్చేశాయి. ఈమధ్య మన దేశంలో యువ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. తేనీటి ప్రియులు ఎక్కువయ్యారు.. చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా టీ కేఫ్‌లను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి వ్యయం, మంచి మాస్టర్లు దొరికితే నిర్వహణ సులువు కావడం, ఆదాయం కూడా తగినంతగా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ యువత ఎక్కువగా ఉంటున్నారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం కోసం టీ కేఫ్‌లు నిర్వహించే వారూ ఉన్నారు. కాబట్టి అధిక జనాభా కలిగిన భారత్‌లో చాయ్ వ్యాపారానికి ఢోకాలేదు.
ఎన్నో వెరై’టీ’లు
ఒకప్పుడు చాయ్ అంటే ఒకటే రుచి. ఇప్పుడలా కాదు. రకరకాల ఫ్లేవర్లు వచ్చేశాయి. వినియోగదారుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. ఇరానీ చారు, గ్రీన్‌ టీ, అల్లం టీ, మసాలా టీ అంటూ నాలుగైదు వెరైటీల దగ్గరే చాలామంది ఆగిపోతారు. కానీ, ఇప్పుడు చాయ్ బార్‌లు, టీ ఔట్‌లెట్లలో పదుల సంఖ్యలో వెరైటీ చారులు నోరూరిస్తున్నాయి. తేయాకు ఎంపికలో సంప్రదాయ ఇరానీ కేఫ్‌లు ఎంత జాగ్రత్త వహిస్తాయో, విభిన్న రుచులతో ప్రయోగాలు చేయడానికి సరికొత్త టీ బార్లు అంతే ఆసక్తిని చూపుతున్నాయి. మందార మకరందం, గులాబీల గుబాళింపు, మల్లెల గమ్మత్తు ఇలా ఒక్కటేమిటి? టీ ప్రేమికులను ఆకట్టుకుంటాయనే ఏ పదార్థాన్నీ వదలడం లేదు. దాదాపు 1500 రకాల టీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. మన ప్రాంతాల్లో కూడా వందల రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ డిమాండ్‌ దృష్ట్యా కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న కంపెనీలు వినూత్న ప్రయోగాలతో విభిన్న రుచుల్లో టీ పొడులను తీసుకొస్తున్నాయి. మిల్క్‌ బబుల్‌ టీ, గ్రేప్‌ ఐస్‌ టీ, లెమన్‌ ఐస్‌ టీ, కశ్మీరీ కావా, గ్రీన్‌ మ్యాంగో.. ఇలాంటివన్నీ కస్టమర్లను ఊరిస్తున్నవే. రెడ్‌ జెన్‌, రష్యన్‌ కారవన్‌, సిల్వర్‌ నీడిల్‌ వైట్‌ టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ.. లాంటి ఎక్సోటిక్‌ టీలూ ఉన్నాయి. ఒక్కో టీ ఒక్కో విధమైన రుచి, వాసన, రంగు కలిగి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వైట్‌, సిల్వర్‌ నీడిల్‌ వైట్‌ టీ, ఊలాంగ్‌, పెరల్స్‌, మొరాకన్‌ మింట్‌, జపనీస్‌ సెన్చా తరహా టీలు రూ. 300ల నుంచి లభ్యమవుతున్నాయి. పండ్లు, పూలు, క్రీమర్స్‌, మసాలాలు, ఫ్లేవర్స్‌, మొక్కలను జోడించి టీ పొడులను తయారు చేస్తున్నారు. కిలోకు రూ.20,000 వరకు ధర పలికే గోల్డెన్‌ టిప్స్‌ వంటి వెరైటీలకు కూడా ఆదరణ లభిస్తోంది.
తందూరి చాయ్
పొగలు కక్కే తందూరి చారు కూడా ఇప్పుడు బాగా ఫేమస్‌ అయింది. పాలను మరిగించి తగినంత చక్కెర కలిపి తందూరి టీ పౌడర్‌ వేసి తయారు చేస్తారు. ఒక డ్రమ్ము లాంటి ఇనుప పాత్రలో సగానికిపైగా ఇసుకతో నింపి దానిపై బొగ్గులు వేసి నిప్పు పెడతారు. బొగ్గులు వేడెక్కిన తరువాత కొత్త మట్టి కుండలను వేడి చేస్తారు. ఫిల్టర్‌ చేసిన టీని వేడిగా ఉన్న మట్టి కుండలోకి ఒంపి.. దాన్ని మట్టి కప్పులో పోసి అందిస్తారు. ఈ తందూరీ చారు బాగా ప్రాచుర్యం పొందింది.
‘చర్చా’వేదికలు
కేఫ్‌లు కేవలం పిచ్చాపాటి కబుర్లతో టీ, కాఫీ సేవనానికే పరిమితం కాలేదు. ‘చర్చా’వేదికలుగానూ మారాయి. ఇక్కడ రాజకీయ చర్చలు వేడీవేడిగా సాగుతుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు నడుస్తుంటాయి. ఉద్యోగ సంబంధ కార్యకలాపాలూ జరుగుతుంటాయి. పెళ్లి సంబంధాలూ కుదిరిపోతుంటాయి. ఇలా ఒకటేమిటి అనేక వ్యవహారాలకు టీ కేఫ్‌లు అడ్డాగా మారాయి.
గరం గరం టీ పాయింట్స్‌..

ఒకప్పుడు చారుకి కేరాఫ్‌ టీ కొట్లు. హైదరాబాద్‌లో అయితే ఇరానీ కేఫ్‌లు. కానీ క్రమక్రమంగా చారు అడ్డాల ట్రెండ్‌లో ఊహించని మార్పులొచ్చాయి. ఇప్పుడీ టీ స్టాల్స్‌ కొత్త అవతారమెత్తి ‘టీ పాయింట్‌’లుగా మారుతున్నాయి. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామాల్లో కూడా ‘టీ పాయింట్‌’ల హవా మొదలైంది. ఎక్కడ చూసినా ట్రెండీ పేర్లతో టీ పాయింట్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం టీ టైమ్‌, దేశీ చారు, చారు పాయింట్‌, టీ గ్యారేజ్‌, కేఫ్‌ నీలోఫర్‌, చారు క్లబ్‌, మిస్టర్‌ టీ, టీ హబ్‌, టీ అడ్డా, టీ పాయింట్‌, హైటెక్‌ టీ, టీ స్టాల్‌, టీ కేఫ్‌, త్రికాల్‌, చారు వాలా, చారు చౌక్టీ 3, ది గ్రేట్‌ ఇండియన్‌ చారు, ఏక్‌ ధమ్‌ చారు, టీ పాయింట్‌, టీ లీఫ్‌, దోస్త్‌టీ, టీ ట్రీ.. వంటి పేర్లతో పలు టీ పాయింట్లు వచ్చేశాయి. వీటిలో డిఫరెంట్‌ ఫ్లేవర్లలో వెరైటీ చారులు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కప్పు టీ ధర రూ. 10 నుంచి మొదలవుతుంది. పదుల రకాల వెరైటీ చారులు లభిస్తున్నాయిక్కడ. స్నాక్స్‌, షేక్స్‌, బిస్కెట్స్‌ కూడా అందుబాటులో ఉండటంతో జనానికి సౌకర్యంగా ఉంటోంది.
ఒక్క చాయ్.. రూ.1000
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ముదురు బంగారు వర్ణం.. గమ్మత్తైన సువాసన.. మైమరపించే రుచి.. అద్భుతమైన అనుభూతి.. ఇలాంటి విశేషణాలేవీ స్పెషల్‌ చారును వర్ణించడానికి సరిపోవు. ఈ అమోఘమైన చారు- హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని కేఫ్‌ నిలోఫర్‌లో పలు సీజన్‌లలో లభిస్తుంది. దేశంలోనే పేరొందిన ఈ చాయ్ తయారీకి వినియోగించే పత్తా అత్యంత అరుదైనది. అసోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతంలోని మైజాన్‌ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. ‘మైజాన్‌ గోల్డెన్‌ టిప్స్‌’గా పేరొందిన తేయాకు మొగ్గలు ఏడాదికి ఒకసారి మాత్రమే అరుదుగా లభిస్తాయి. సూర్యోదయానికి ముందే సేకరించిన మొగ్గలను ఆరబెట్టి, పొడి చేస్తారు. కిలో, కిలోన్నర పరిమాణంలోనే ఉత్పత్తి అవుతుంది. దీనికి డిమాండ్‌ ఎక్కువ కాబట్టి వేలం ద్వారా విక్రయిస్తారు. కోల్‌కతాలో నిర్వహించిన వేలంలో రూ.75 వేలకు చేజిక్కించుకుంది నీలోఫర్‌. ఈ టీ పొడితో తయారుచేసిందే .. ఈ వెయ్యి రూపాయల కప్పు టీ.
అభిరుచికి అనుగుణంగా..
జనాన్ని ఆకర్షించేందుకు ఆయా దుకాణదారులు కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఫ్రీ వైఫై అంటూ యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకట్టుకునేలా కుర్చీలు ఉంచుతున్నారు. టీ/ కాఫీ అందించే కప్పులూ విభిన్నంగా ఉంటున్నాయి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

Spread the love