కాస్త తగ్గుదాం

కాస్త తగ్గుదాంక్షమాగుణం అనేది మనలో మార్పుకు ఓ మార్గం. బాధ పడడం నుంచి క్షమించే దిశగా పయనించాలంటే క్షమాగుణం విలువను ముందు మనం తెలుసుకోవాలి. దాని వల్ల మన జీవితం ఎలా మెరుగుపడుతుందో అర్థం చేసుకోవాలి. ఏది మీ బాధను మాన్పగలుగుతుందో, ఎవరిని మన్నించాలో, ఎందుకు మన్నించాలో గుర్తించాలి. మిమ్మల్ని మీరు ఇకపై బాధితులుగా అనుకోకుండా, మిమ్మల్ని బాధ పెట్టే అధికారం అవతలి వ్యక్తికి లేదని గ్రహించాలి.

తన కోపమే తనకు శత్రువు.. దయ చుట్టంబగు అన్న సూక్తి గుర్తుందా? మన మనసులో నిత్యం రెండు వైరుధ్య భావాలుంటాయి. ఒకటి క్షమించడం. రెండోది పగతీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూనే ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం. మనసులో అంతులేని సంతోషం. మనిషికి తృప్తి. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ ‘క్షమించు క్షమించు’ అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం. క్షమించాల్సి వచ్చినపుడు మనం కాస్త తగ్గితే పోయేదేమీ లేదు. మనలోని బాధ, కోపం తప్ప.
ఇతరులను క్షమించకుండా వదిలేయడం వల్ల నష్టపోయేది మనమే. ముఖ్యంగా బంధాలలో ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారితో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వీటి తీవ్రత వ్యక్తులను బట్టి, వారి మధ్య ఉన్న ఆత్మీయతలను బట్టి ఉంటుంది. ఒక్కోసారి పగతో జీవితాలనే వృథా చేసుకున్న వారు మనకు తారసపడుతుంటారు. మరి దీనికి క్షమాగుణంతో పరిష్కారం లభిస్తుందా?
మీరు క్షమించకుండా ఉంటే మీలోని కోపం తరచూ మిమ్మల్ని నష్టపరుస్తుంది. మీరు వర్తమానంలో జీవించకుండా గడిచిన సంఘటనలను నెమరువేసుకుంటూ వారి గురించే ఆలోచిస్తూ ఉంటే మీ సమయాన్ని నష్టపోతారు. మీ జీవితానికి ఒక లక్ష్యం లేకుండా పోతుంది. అది మీ ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ముందుగా మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేయాల్సిన పని పట్ల ఫోకస్‌ తగ్గుతుంది. క్రమంగా యాంగ్జైటీ పెరుగుతుంది. డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తాయి. రక్త పోటు పెరుగుతుంది. గుండెపై భారం పడుతుంది. అవతలి వ్యక్తిపై పగ, ప్రతీకార భావాలు తగ్గితే క్రమంగా ఈ లక్షణాలన్నీ మాయమవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో మార్పు కనిపిస్తుంది.
క్షమాగుణం అనేది మనలో మార్పుకు ఓ మార్గం. బాధ పడడం నుంచి క్షమించే దిశగా పయనించాలంటే క్షమాగుణం విలువను ముందు మనం తెలుసుకోవాలి. దాని వల్ల మన జీవితం ఎలా మెరుగుపడుతుందో అర్థం చేసుకోవాలి. ఏది మీ బాధను మాన్పగలుగుతుందో, ఎవరిని మన్నించాలో, ఎందుకు మన్నించాలో గుర్తించాలి. మిమ్మల్ని మీరు ఇకపై బాధితులుగా అనుకోకుండా, మిమ్మల్ని బాధ పెట్టే అధికారం అవతలి వ్యక్తికి లేదని గ్రహించాలి.
అయితే మిమ్మల్ని బాధకు గురి చేసిన వారు తమ తప్పులను అంగీకరించకపోవడం మరింత బాధకు గురిచేస్తుంది. ఇలాంటి సమయాల్లో క్షమించి వదిలేయడం అంత తేలిక కాదు. అయితే క్షమించకపోతే మీ జీవిత ప్రయాణాన్ని మీరే నిలిపివేసినట్టు అవుతుంది. అందువల్ల ఒకసారి అవతలి వ్యక్తి అలా ప్రవర్తించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? వారి కోణంలో నుంచి ఆలోచిస్తే సరైనదేనా? అలాంటి ప్రవర్తన మన నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అలా వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని క్షమించారా? ఇలాంటి విషయాలను ఒకసారి విశ్లేషించాలి. ఇదే అంశంపై మీ స్నేహితులని సంప్రదించి సంఘటనను వివరించి ఇక ఆ వ్యక్తిని క్షమించడంపై చర్చించండి.
ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు సంబంధించి కూడా మనసు పదే పదే గాయపడుతుంది. ఒకసారి క్షమించినా మళ్లీ మళ్లీ ఆ విషయం గుర్తుకు వస్తుంది. అలాంటపుడు క్షమాగుణాన్ని నిరంతరం అలవరచుకోవాలి. ఏది ఏమైనా క్షమా గుణం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మీ జీవితం మెరుగుపడుతుందని గుర్తిస్తే చాలు.

Spread the love