విలువల విలువ

విలువలు మనకు దిక్సూచిలా పని చేస్తాయి. మనం జీవితంలో ఏ దిశ వైపు వెళ్ళాలో నిర్ణయిస్తాయి. ఈ విలువైన ప్రయాణాలు మన కుటుంబానికి అన్వయించుకుంటే పిల్లలు వాళ్ళ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలో ఎలా నడుచుకోవాలో తెలిసేలా చేస్తాయి. కుటుంబం అనేది ఒక్క రక్తసంబంధం అనే అంశంపైనే కాకుండా చాలా రకాలైన అంశాలతో కూడుకుని వుంటుంది. వాటిలో ముఖ్యమైనవి కుటుంబ విలువలు. ఈ విలువలు లేదా ప్రమాణాలు ఆ కుటుంబ ఆలోచనలు, ఆచారాలు, సూత్రాలు, వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలను నేర్పించాలనే కోరుకుంటారు. సమాజంలో కుటుంబ విలువలకు చాలా ప్రాముఖ్యం వుంది. మంచి విలువలతో కూడిన కుటుంబాలు సమాజానికి వెన్నెముక లాంటివి. ఈ విలువలను తమ పిల్లలకు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో వుంటుంది. ఇవి సమాజంలో మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతాయి. వీటిలో ముఖ్యమైనవి ఇతరులను గౌరవించడం, దయాగుణం, నీతి నిజాయితీలు, ధైర్యం, సహనం, న్యాయంగా ఉండటం.
పిల్లలు మొదటి దశలో వీటిని తల్లిదండ్రులు, తోబుట్టువులు, తాతయ్యలు, బామ్మల దగ్గర నేర్చుకుంటారు. ఎదిగే క్రమంలో పాఠశాలల్లో, సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ద్వారా తెలుసుకుంటారు. తన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి సమాజంలో మంచి వాడిగా నిలబడేలా ఈ విలువలు చేస్తాయి. అలాగే విద్య కూడా పిల్లల్లో విలువలు నేర్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. లోకజ్ఞానం, కొత్త విషయాలను నేర్చుకునే ఉత్సుకత, జిజ్ఞాస వారిలో పెరుగుతాయి. విద్య అంటే కేవలం పాఠశాల, కళాశాలకు సంబంధించినది మాత్రమే కాదు జీవితంలో వారికి కొత్త లక్ష్యాలను నిర్మించుకుని వాటని ఛేదించే దిశలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేలా విద్యా విలువలు ఉండాలి. అలాగే ఆర్ధిక విలువలు గురించి పిల్లలకు వివరించడం కూడా చాలా ముఖ్యం. మొదటి నుండి పిల్లలకు ఆర్ధిక క్రమశిక్షణ అలవడితే వారి భవిష్యత్తుకు, కొత్తగా కుటుంబాన్ని ఏర్పరచుకునే సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
పిల్లలు పరిపక్వత దశలో ఉన్నపుడు తల్లిదండ్రులు కుటుంబ విలువలను, సిద్ధాంతాలను వారితో చర్చించడం చాలా అవసరం, చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విలువైన ప్రమాణాలు వ్యక్తిగత, నైతిక విలువలు మనల్ని, మన పిల్లల్ని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిరూపించుకోవడానికి దోహదం చేస్తాయి. అంతే కాకుండా జీవితానికి సంబంధించి తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలపై వీటి ప్రభావం ఉంటుంది. వ్యక్తులుగా మనం జీవితంలో ఏం చేయాలో నిర్ణయించుకోవడంలో సహాయపడతాయి.
విలువలు కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకు తెచ్చి వారి మధ్య ఐక్యతను పెంచి సభ్యుల మధ్యన వున్న బంధాన్ని ధృడపరుస్తాయి. పిల్లలు తెలియక చేసిన తప్పుల వల్ల బాధపడి, కుంగిపోకుండా వాటిని సరిచేసుకునే శక్తిని ఇస్తాయి. సమస్యలలో కూరుకపోకుండా వాటి నుండి ఎదుగుదల పొందడం, వారి సమస్యలను వారే పరిష్కరించుకోవడం లాంటి సామర్థ్యాలని, నైపుణ్యాలను పెంపొందించుకునే చేస్తాయి. అయితే సమాజం మార్పు చెందుతున్న కొద్ది పాత విలువలకు, కొత్త విలువలకు మధ్య ఘర్షణ సహజం. ఏది ఏమైనా విలువల విలువ తెలిస్తే అవే వారిని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

Spread the love