ఎలా బతుకుతున్నాం..?

ఎలా బతుకుతున్నాం..?బతకడం వేరు, జీవించడం వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. మనం ప్రాణంతో బతుకుతున్నామా..? లేక సంతృప్తిగా బతుకుతున్నామా..? అనేది ఇక్కడ ముఖ్యం. సంతృప్తి చెందిన జీవితంలోనే అనుభూతి ఉంటుంది. నిజంగా బతకడం అంటే సంతృప్తిగా బతకడమే. ఏదో పుట్టామా… తిన్నామా… బతికామా అన్నట్టు ఉంటే సరిపోదు. ‘మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి’ అని అదేదో సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు మనం బతికే బతుకు కూడా కళగా, సంతృప్తిగా ఉండాలి. అయితే మనిషి మనిషిగా బతకడం లేదు కాబట్టే ఎన్నో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మరి మనిషిలా బతకడం అంటే ఏంటీ…
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకున్నామంటే మనం మనిషిలా బతుకుతున్నామని అర్థం. ‘ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉండు’ అంటాడు విప్లవ వీరుడు చేగువేరా. దీని ఆచరణలో పెట్టినప్పుడే మనం నిజంగా బతికున్నట్టుగా భావించాలి. దీన్ని అమలు చేయడం కాస్త కష్టం అనుకుంటే మనం బతికున్న మనుషులమే అని నిరూపించుకోడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి…
మీరు తప్పు చేసినపుడు మీ తప్పును ఒప్పుకోండి. ఆ విషయంలో ప్రశ్నించినపుడు వివరణ ఇవ్వండి. మీకు సందేహం ఏర్పడినపుడు విమర్శించకండి. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పరవా లేదు. కాని అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా చాలా ముఖ్యం. మీరు చేరే గమ్యం, మార్గంలో ఎవరినీ పూర్తిగా నమ్మకండి ఒక్క మిమ్మల్ని తప్ప. ఎవరి మీదా పూర్తిగా ఆధారపడకండి. మీ అంతట మీరు ఆత్మవిశ్వాసంతో నడిచే సామర్ధ్యం కలిగివుండాలి.
పగిలిన అద్దాన్ని అతికించలేని అసహాయతను తలచుకొని బాధపడటం కంటే సమాజం చూపిన అద్దం అందాన్ని బతుకునిండా నింపుకోవడమే జీవితం. జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు వంటి వారు. వేర్లు లేకపోతే చెట్టు బతకలేదు. కనుక వేర్లను ఎప్పుడూ విస్మరించకూడదు. మనం గుర్తు పెట్టుకోవల్సిన మరో ముఖ్య విషయం విజయం గొప్పది కాదు. దాన్ని సాధించిన మనిషి గొప్పవాడు. బాధపడటం గొప్పకాదు, బాధను తుట్టకోవడం గొప్ప. బాంధవ్యాలు గొప్పకాదు, వాటిని నిలబెట్టే మనిషి గొప్ప.
మీ కోసం బతకడంలో మీకు మాత్రమే ఆనందం ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారి కోసం బతకడంలో మీ జీవితమే ఉంది. అందుకే మన వారితో మాట్లాడే మాట ఎలా ఉండాలంటే… కంటిని నలపకుండా నలుసు తీసినట్టు. అంటే ఎదుటి మనిషిని బాధపెట్టకుండా మన మాట వుండాలి. చెప్పవలసినవి సున్నితంగా చెప్పాలి. మాట మనుషులను దగ్గరకు చేస్తుంది. అదే మాట మనిషిని దూరం కూడా చేస్తుంది. ఇది మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవల్సిన విషయం.
మరచిపో, క్షమించు అన్న సూత్రం మానసిక శాంతికి దివ్వఔషధంగా పనిచేస్తుంది. మనల్ని అవమాన పరచిన వ్యక్తిపట్ల, మనకు కీడు చేసిన వ్యక్తి పట్ల, మన మనసులో చెడుభావం మసలుతూ ఉంటుంది. కానీ ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు అని క్యూబా అనే ఓ చిన్న దేశం నిరూపించింది. తనపై పదే పదే దాడి చేసే అమెరికా వంటి అగ్రదేశం నోటిని తన ప్రేమతో మూయించింది. కనుక సంతోషమనేది మనం చేసే ఉద్యోగం నుండో, మన దగ్గర ఉన్న డబ్బు నుండో రాదు. అది మన వద్దనే ఉంటుంది. మనం బతికే విధానంలో ఉంటుంది. కాబట్టి మనం ఎలా బతుకుతున్నాం అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తరచి తరచి చూసుకోవాలి.

Spread the love