మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

భారత రాజ్యాంగానికి ఆత్మలా భావించే ప్రవేశికలో తాము నిర్మించుకున్న రాజ్యాంగాన్ని తమకే సమర్పించుకుంటూ ఈ దేశ ప్రజలు ఇలా లిఖించుకున్నారు. ‘భారత ప్రజలమైన మీము, భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారమున్న సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకోవడానికి, దేశ పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయాన్ని, ఆలోచన, భాక ప్రకటన, విశ్వాసాలు కలిగి ఉండటంలోను, ఆరాధించటంలోనూ స్వేచ్ఛను, హౌదా అవకాశాలలో సమానత్వానికి, వ్యక్తిగత గౌరవం, ప్రజలందరి మధ్యనా ఐక్యత, సౌభ్రాతృత్వం, దేశ సమగ్రతల సాధనకై ఏకగ్రీవంగా తీర్మానించుకుని, ఇందు మూలంగా ఆమోదించుకుని, అన్వయించుకుని, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని ప్రకటించారు.
నిర్వీర్యం చేసే కుట్ర
భారత రాజ్యాంగం కుల, మత, వర్గ, లింగ వివక్షలకు అతీతంగా దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన హాక్కులను, అవకాశాలను అందిస్తుంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు, వారి జీవితాలకు భారత రాజ్యాంగం సంపూర్ణ భరోసాను ఇవ్వటంతో పాటు, వారి జీవితాలకు, వారి విశ్వాసాలకు రక్షణగా నిలబడుతుంది. రాజ్యాంగం ఆధారంగా తమను తాము పరిపాలించుకోడానికి ప్రజలు అనేక ప్రజాస్వామిక వ్యవస్ధలను రూపొందించుకున్నారు. ఆ వ్యవస్ధలన్నింటినీ నిర్వీర్యం చేసే కుట్ర నేడు పెద్దయెత్తున్న జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన హాక్కుల కోసం అడిగిన వారిని దేశద్రోహులుగా ముద్రలు వేస్తున్నారు. మొత్తానికి ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వ్యవహరించటం భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో అతిపెద్ద విషాదం. అలాంటి విషాదం దేశమంతా అలముకున్న ఒక సంక్షుభిత సమయంలో మనం ఈ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
అంబేద్కర్‌ ఛైర్మన్‌గా…
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలని నాటి జాతీయ నాయకులు తీర్మానించారు. దీంతో ఆగస్టు 29న రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రత్యేక డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డాక్టర్‌ అంబేద్కర్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అంబేద్కర్‌ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్‌ కమిటీ సుమారు 60కి పైగా దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను పరిశీలించింది. సుదీర్ఘమైన అనేక చర్చలు, సమావేశాలు, తీర్మానాల అనంతరం ఈ కమిటీ రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీనికి సుమారు 2 ఏండ్ల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచదేశాల రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌తో దాదాపు మూడు సంవత్సరాల పాటు రచించబడిన రాజ్యాంగం అనేక విశిష్టతలని కలిగి ఉంది. దీనిని ఇంగ్లీషు, హిందీ భాషలలో రచించారు. రాజ్యాంగానికి సంబంధించిన డ్రాప్టింగ్‌ కాపీని రచించటంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించారు. సుమారు 114 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అయితే 1950 జనవరి 26వ తేది నుండి అమల్లోకి వచ్చింది. నాటి నుండి భారత దేశం సంపూర్ణ సార్వభౌమాధికారంతో సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
ప్రజాస్వామ్య పాలనలోకి…
గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభువులుగా ఉండే ఒక పాలనా వ్యవస్ధ. అప్పటి వరకూ రాచరిక పాలనలోను, వలసవాదుల పాలనలోను అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్న భారతీయులు భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పాలనలోకి అడుగు పెట్టారు. బ్రిటీషు పాలనకు ముందు భారతదేశంలో పరిపాలన రాజుల చేతుల్లో ఉండేది. రాజరికంలో ప్రజాభీష్టానికి ఏ మాత్రం విలువ లేకుండా పాలన కేవలం కొన్ని వర్గాల చేతుల్లో ఉండేది. వారు చెప్పిందే చట్టం, చేసిందే ధర్మం. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజద్రోహం నేరాన్ని ఎదుర్కొవాల్సి వచ్చేది. ఆంగ్లేయుల ప్రవేశంతో దేశంలో వ్యాపార సంస్ధల పాలన ప్రారంభమయ్యింది. ఇక్కడ కూడా ప్రజల అభీష్టాలకీ, హక్కులకీ ఏ మాత్రం విలువ ఉండేది కాదు. కేవలం పాలకుల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగేది. కొద్ది మంది ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న వలసవాద పాలనపై అలుపెరుగని పోరాటం చేసి భారతీయులు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు. సంపాదించుకున్న స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా దక్కాలన్న లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామిక పాలనా యుగం ప్రారంభమయ్యింది.
సామాజిక రుగ్మతలకు పరిష్కారం
నిజానికి భారత దేశం అనేక కులాలు, భిన్న మతాలు, విభిన్న ఆచార, వ్యవహారాలు, వర్గాలు ఒక్కటిగా మనుగడ సాగిస్తున్న ఒక సమాఖ్య వ్యవస్ధ. ఈ వైవిధ్యంతో పాటు దేశంలో శతాబ్దాలుగా సాగుతున్న మానవ హాక్కుల హాననం, కుల వివక్ష, లింగ వివక్ష, సామాజిక, ఆర్ధిక అసమానతలన్నింటినీ చర్చించి వాటికి పరిష్కారాలను చూపించాల్సిన బాధ్యత రాజ్యాంగ నిర్మాతలు తమ బాధ్యతగా భావించటం వల్లే 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్‌తో కూడిన అతిపెద్ద రాజ్యాంగం ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అప్పటి వరకూ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలకు రాజ్యాంగం పరిష్కార మార్గాలను చూపించింది. మానవ సమాజాన్ని ముక్కలు చేస్తున్న కుల, మత, లింగ వివక్షతను సాంఘిక నేరాలుగా పరిగణించింది. వేల ఏండ్లుగా అంటరానివారిగా, సమాజానికి దూరంగా బతుకుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలను చేపట్టింది. వందల సంవత్సరాలుగా ఆచారాలుగా చెలామణీ అవుతున్న అంటరానితనం, బాల్యవివాహాలు, వెట్టి చాకిరీ, లింగ వివక్షత వంటి వాటిని సామాజిక దురాచారాలుగా ప్రకటించి, వాటిని నిషేదించింది. సామాజిక దురాచారాల నిర్మూలనకు ప్రత్యేక చట్టాలను చేసింది. దేశంలోని ఒకే రాజకీయ హౌదాని కల్పించటంతో పాటు, భారతీయులందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదిస్తుంది.
నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికే
ఈ సందర్భంగా 1948 నవంబర్‌ 19న రాజ్యాంగ నిర్ణాయక సభలో అంబేద్కర్‌ మాటలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ‘ఒక మనిషికి ఒకే ఓటు’. అంటే ప్రతి ప్రభుత్వం తన నిత్య కార్యకలాపాల్లోనూ, కొంత కాలం తర్వాత కూడా ప్రభుత్వం చేసిన పనిని బేరీజు వేసుకునే అవకాశం ఓటర్లకు ఉండాలి. మన రాజ్యాంగంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏ పద్దతిలో అయినా సరే కొంత మంది వ్యక్తుల నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికే. రాజకీయ ప్రజాస్వామ్యం ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని సాధించేదిగా ఉండాలన్నదే రాజ్యాంగ అభిమతమని అన్నారు. అదే నిర్ణాయక సభలో 1949 నవంబర్‌ 25వ తేదిన మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా కూడా మార్చాలి. సామాజిక ప్రజాస్వామ్యం మీద ఆధారపడి ఉండకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం మనలేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రంగా అంగీకరించేదే సామాజిక ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న మూడు సూత్రాలను విడివిడిగా పరిగణించకూడదు. వీటికి ఒకదానితో ఒకటి విడదీసి చూడటం అంటే ప్రజాస్వామ్య ప్రయోజనాల్ని వమ్ము చేయటమే. ఈ మూడు సూత్రాలతో కూడిన రాజకీయ ప్రజాస్వామ్యమే ఆర్ధిక, సామాజిక ప్రజాస్వామ్యాలను సాధించగలుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఈ దేశంలోని అన్ని వర్గాల వారికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ నివేదికల ప్రకారం అది అక్షర సత్యం.
కనీస అవగాహన లేనివారున్నారు
నేషనల్‌ క్రైమ్‌బ్యూరో 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, నేరాలకు సంబంధించి 4లక్షల, 45వేల 256 కేసులు నమోదయ్యాయని, 2021తో పోలిస్తే ఇది 4శాతం అధికమని ఆ నివేదిక పేర్కొంటుంది. ప్రతి గంటకు సుమారు 51మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. గంటకు 75 మంది హాత్యకు గురవుతున్నారని, చిన్నారులు, ఎస్సీలు, ఎస్టీలపై నేరాలు పెరిగాయని ఆ నివేదిక తెలియచేస్తుంది. న్యాయస్ధానాలలో సత్వర న్యాయం దొరకక వేలాదిమంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ బడుగు, బలహీన వర్గాలకే చెందిన వారే అధికంగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాటి మానవుణ్ణి ప్రేమించిన పాపానికి వేలాది మంది పరువు హాత్యల పేరుతో ప్రాణాలను కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విద్యా, ఉపాధి, వైద్యాలకు ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ నూటికి 70 నుండి 80 శాతం మందికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందుకోలేకపోతున్నారు. అసలు రాజ్యాంగం అందించిన హాక్కుల గురించి కనీస అవగాహాన లేని ప్రజలు ఈ దేశంలో ఇంకా సగం మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు.
ఒక్క శాతం చేతిలో ఖజానా…
ఏ సామాజిక అభివృద్ధినైతే రాజ్యాంగం వాగ్ధానం చేస్తుందో ఆ వాగ్ధానం నేటికీ నెరవేరకపోవటం ఒక మహా విషాదం. ఇంకా కోట్లాది మంది భారతీయులు దుర్భరమైన పేదరికంలో మగ్గుతున్నారు. గ్లోబల్‌ హాంగర్‌ ఇండెక్స్‌ 2023కి ప్రకటించిన జాబితాలో భారత్‌ 111వ స్ధానంలో ఉంది. 125 దేశాలకు సంబంధించిన జాబితాలో 111వ స్ధానంలో భారతదేశం ఉందంటే భారతదేశంలో పేదరికం, ఆకలి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్లోబల్‌ హాంగర్‌ ఇండెక్స్‌ ర్యాంకులను భారత ప్రభుత్వం తిరస్కరించవచ్చు కానీ, ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వాలు అందిస్తున్న చౌక డిపో బియ్యం మీదే ఆధారపడి బతుకుతున్నారన్నది కాదనలేని వాస్తవం. రోజు వారీ అవసరాలకు తగిన సంపాదన లేని ప్రజలు ఈ దేశంలో సగానికి పైగా ఉన్నారు. 70శాతం మంది శ్రమతో నిర్మితమైన సంపద కేవలం ఒక్క శాతం మంది వ్యక్తుల ఖజానాలో చేరుతుంది. భారత దేశంలో ఆర్ధిక అసమాతలు రోజురోజుకీ పెరుగుతున్నాయని అంతర్జాతీయ హాక్కుల సంస్ధ ఆక్స్‌ఫాం లెక్కలతో సహా నిగ్గు తేల్చింది.
పెరుగుతున్న పేదరికం
భారత రాజ్యాంగం ప్రకారం విద్య, ఆరోగ్యం ప్రభుత్వాలకు సంబంధించిన ప్రధాన భాద్యతలు. కానీ వాటి నుండి ప్రభుత్వాలు దూరంగా జరిగాయి. విద్య, ఆరోగ్య రంగంలో ప్రవేటు శక్తుల ప్రవేశంతో నాణ్యమైన విద్య కోట్లాది మంది భారతీయులకు అందని ద్రాక్షగా మారిపోయింది. ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఈ రెండు రంగాలలో జరుగుతుంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారమే గ్రామీణ భారతదేశంలో నూటికి 40 శాతం మంది నిరక్షరాస్యులు. వీరికి కనీసం వారి పేరు కూడా రాయటం రాదు. అంటే భారత రాజ్యాంగం గురించి వీరికి పూర్తిగా తెలియదనే అనుకోవాలి. దేశంలో అక్షరాస్యతా శాతం 77.7 శాతం ఉంటే దానిలో పురషులలో 82 శాతం అక్షరాస్యత ఉంటే, మహిళలలో కేవలం 65శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. భారతదేశంలో కనీస భూమిలేని వారు 30కోట్ల మందికి పైగా ఉన్నారు. నివశించడానికి కనీస జాగాలేని ప్రజలు 30శాతం మందికి పైగా ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం దేశంలో 15కోట్ల మంది భూమి లేని పేదలు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. 2023నాటికి ఇది 30కోట్లకి పెరిగిందని ఒక అంచనా.
ప్రభుత్వాల వైఫల్యమే
ఆర్ధిక సమానత్వం, సామాజిక సమానత్వం నేటికీ ఈ దేశంలో సాధించబడలేదంటే అది ప్రభుత్వాల వైఫల్యంగానే భావించాలి. పెట్టుబడిదారులే పార్టీలను, తద్వారా ప్రభుత్వాలను నడిపించటం ప్రజాస్వామ్యంలో ఈ శతాబ్దపు మహా విషాదం. ఇది కాదు భారత రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామ్యం. ఇది కాదు కోట్లాది మంది కలలు గన్న స్వాతంత్య్రం. దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చాడానికి ప్రభుత్వాలు అనేక రాజ్యాంగ విరుద్ధ విధానాలకు తెర తీస్తున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. గుప్పెడు మంది పారిశ్రామిక వేత్తల చేతిలో సంపద పోగు పడటం దేశంలో నెలకొన్న ఆర్ధిక అసమానతలకు కారణం. కేవలం పారిశ్రామిక వర్గాల ఆర్ధిక ఆకలి తీర్చడానికే దేశంలోని సమస్త వనరుల్ని, వ్యవస్ధల్ని ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. కేవలం ఒక్క శాతం మంది సాధిస్తున్న అభివృద్ధినే దేశాభివృద్ధిగా ప్రచారం చేస్తున్నాయి. వీటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తమ పాలనను పటిష్టం చేసుకోడానికి కొన్ని మతతత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మెజారిటీ పేరుతో కేవలం ఒకే మతం, ఒకే వర్గానికి చెందిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ వ్యవస్ధలు పనిచేస్తున్నాయి. ఈ చర్యలకు అడ్డంకిగా మారిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చాలన్న దిశగా వారి చర్యలు సాగుతున్నాయి.
ప్రజలే రక్షకులుగా మారాలి
రాజ్యాంగం ప్రసాదించిన హాక్కులని అడగటం కూడా దేశ ద్రోహం నేరంగా పరిగణించబడుతున్న కాలంలో ప్రజలే రక్షకులుగా మారాలి. రాజ్యాంగం వైఫల్యం చెందితే అది రాజ్యాంగ వైఫల్యం కాదు, దానిని అమలు చేసే వారి వైఫల్యంగానే పరిగణించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. కేవలం రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వాగ్ధానం చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ వివక్షలు లేని అసలు, సిసలైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ దిశగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్ధల్ని కాపాడుకోవడానికి ప్రజలంతా సమాయత్తం కావాల్సిన తరుణమిది. దానికి ఈ గణతంత్ర దినోత్సవం వేదిక కావాలని కోరుకుందాం.
డా||కె.శశిధర్‌
9491991918

 

Spread the love