భారీగా పెరిగిన అంచనా వ్యయం

 – ప్రస్తుతం 458 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు
– రూ. 5.71 లక్షల కోట్లకు పైగానే ఖర్చవుతుందని లెక్కలు
– కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ సమాచారం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఖర్చు అంచనాలను మించిపోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,817 ప్రాజెక్టుల్లో 458 ప్రాజెక్టులపై రూ.5.71 లక్షల కోట్లకు పైగా అదనపు వ్యయం నమోదైంది. అలాగే, 831 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ సామాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లలో ప్రతి ఒక్కదాని ఖర్చు రూ. 150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ.ఈ 1,817 ప్రాజెక్టుల అమలుకు తొలుత మొత్తం అసలు వ్యయం రూ. 27,58,567.23 కోట్లుగా అంచనా వేయగా.. ప్రస్తుతం వాటి పూర్తి అంచనా వ్యయం రూ. 33,29,647.99 కోట్లకు చేరింది. అంటే, అదనంగా రూ. 5,71, 080.76 కోట్లు ఎక్కువ అన్నమాట. పూర్తి వ్యయం పెరగటంతో ప్రభుత్వానికి 20.70 శాతం అదనపు ఖర్చు అవుతుంది.
831 ఆలస్యమైన ప్రాజెక్టులలో, 245 మొత్తం 1-12 నెలల పరిధిలో ఆలస్యంగా ఉన్నాయి, 188 ప్రాజెక్టులు 13-24 నెలలు, 271 ప్రాజెక్టులు 25-60 నెలలు, 127 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యమయ్యాయి. కాగా, జాప్యానికి కారణాలు భూసేకరణ, పర్యావరణ క్లియరెన్స్‌, ఆర్థిక సమస్యలు, ఒప్పంద, అంతర్గత సమస్యలు, మానవ వనరుల కొరత, వ్యాజ్య సమస్యలని ప్రాజెక్ట్‌ అమలు ఏజెన్సీలు చెప్పటం గమనార్హం.

Spread the love