– భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
– ఆస్పత్రి వద్ద విషాదం
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఆమె ఓ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన భర్తతో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. కానీ అప్పటికే ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన భారీ వృక్షం ఆ దంపతులు స్కూటీపై ఆస్పత్రి గేటు ఆవరణలోకి వస్తుండగా ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ప్రమాదం చూసిన వెంటనే సెక్యూరిటీగార్డులు, ఇతర రోగులు కాపాడే ప్రయత్నం చేసే లోపే ఘోరం జరిగిపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే కన్నుమూశాడు. షాక్‌కు గురైన భార్యకూ తీవ్రగాయాలయ్యాయి. అనారోగ్యంతో ఉన్న తనను ఆస్పత్రికి తీసుకువచ్చిన భర్త కండ్లముందే మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషాద ఘటన మంగళవారం పలువురిని కలిచివేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన రవీందర్, సరళాదేవి దంపతులు. సరళాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె అనారోగ్యంగా ఉండటంతో మంగళవారం భర్త రవీందర్‌తో కలిసి బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రికి స్కూటీపై వచ్చారు. ఆవరణలోకి వెళ్లగానే భారీవృక్షం వారి వాహనంపై పడింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది, ఇతరులు చెట్టు కొమ్మలను పక్కకు జరిపి వారిని బయటకు తీయగా అప్పటికే రవీందర్ మృతిచెందాడు. సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి బొల్లారం పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బంధువులు, సన్నిహిత ఉపాధ్యాయులు హుటాహుటిన ఆస్పత్రికి తరలివచ్చారు.