టూరిజం కార్పొరేషన్‌ ఉద్యోగుల మెడపై కత్తి

A knife on the neck of Tourism Corporation employees– కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేధింపులు
– చీటికిమాటికీ సస్పెన్షన్లు, మెమోలు
– రోడ్డున పడ్డ 30 మంది ఉద్యోగులు
– కోర్టు ఉత్తర్వులు సైతం బేఖాతరు
– ఏండ్ల తరబడి కుర్చీ వదలని హెచ్‌ఓడీలు
– పీకల్లోతు అవినీతిలో కార్పొరేషన్‌
– కొత్త సర్కార్‌పై ఉద్యోగుల ఆశలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీ)లో పని చేస్తున్న ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి ఉంటారా? పోతారా? అంటూ యాజమాన్యం నిత్యం వేధింపులకు గురి చేస్తున్నది. గత సర్కార్‌ హయాంలో పని చేసిన ఎండీ అవినీతి, అక్రమాలకు వత్తాసు పలకలేదని 30 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. వారందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏండ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. ఇరవై ఏండ్లుగా ఒకే చోట తిష్ట వేసిన హెచ్‌వోడీలు, ఉన్నతాధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలకు కింది స్థాయి ఉద్యోగులు బలౌతున్నారు. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
టీఎస్‌టీడీసీలో మొత్తం 800 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 80 మంది రెగ్యులర్‌, 170 మంది కాంట్రాక్ట్‌, 300 మంది ఔట్‌ సోర్సింగ్‌, 100 మంది డైలీ వేజ్‌, 100 మంది కన్సల్టెంట్‌ , 70 మంది ట్రైనీ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు. టూరిజం హౌటళ్ల లీజు, పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన పనుల కాంట్రాక్టులు, ఇష్టారాజ్యంగా నిధుల ఖర్చు తదితర ఆరోపణలు గత సర్కార్‌ హయాంలో పని చేసిన ఎమ్‌డీ మనోహర్‌పై వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసిన సందర్భాలు న్నాయి. సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వత్తాసు పలకడం లేదనే నెపంతో దాదాపు 30 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆయన సస్పెండ్‌ చేశారు. అదే క్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీకి మేలు చేస్తున్నారనే కారణంతో 2023 డిసెంబర్‌లో మనోహర్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. పాత ఎమ్‌డీ అసాధారణ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన 30 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరిని తిరిగి ఉద్యోగంలోకి వెంటనే తీసుకోవాలని తెలంగాణ హైకోర్ట్‌ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటే తమ తప్పులు ఎక్కడ బయట పడుతాయేమోననే భయంతో కొంతమంది ఉద్యోగులు అడ్డుపడుతున్నారని ఆరోపణలున్నాయి.
పాత ఎమ్‌డీపై అటకెక్కిన విచారణ
పాత ఎమ్‌డీ మనోహర్‌ అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత అంతర్గత విచారణ చేపట్టింది. టూరిజం హౌటళ్ల లీజు, పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన పనుల కాంట్రాక్టులు, ఇష్టారాజ్యంగా నిధుల ఖర్చు తదితర ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి కోట్లాది రూపాయల చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. కొంతమంది అగ్రనేతల జోక్యంతో అతనిపై చేపట్టిన విచారణ మధ్యలోనే ఆగిపోయిందనే విమర్శలున్నాయి.
24 ఏండ్లుగా రెగ్యులర్‌కు నోచుకోని ఉద్యోగులు
మార్చి 2000 సంవత్సరంలో సంస్థలో పనిచేసిన డైలీవేజ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేశారు. ఆ తర్వాత 24 ఏండ్లుగా ఎవరినీ పర్మినెంట్‌ చేయలేదు. ఏండ్లు గడుస్తున్నా తమను క్రమబద్ధీకరించకపోవడం కార్మిక చట్టాలకు వ్యతిరేకమంటూ ఉద్యోగులు పలుమార్లు నిరసనలు, ఆందోళనలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో ఉద్యోగులు కోర్టు తలుపు తట్టారు. 2010లో అప్పటి ఉమ్మడి హైకోర్టు ( కేసు నెంబర్‌ 24/98) కార్పొరేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని వెంటనే రెగ్యులర్‌ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంస్థ కూడా రెండుగా విడిపోయింది. ఇక్కడ పని చేసిన ఉద్యోగులందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు కేటాయించారు. స్వరాష్ట్రంలోనైనా కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తమకు న్యాయం చేస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఎనిమిదేండ్లు గడిచినా సర్కార్‌లో చలనం లేకపోవడంతో తిరిగి 2019లో ( కేసు నెంబర్‌ 19927 /19)) కోర్టును ఆశ్రయించారు. సిబ్బందిని వెంటనే రెగ్యులర్‌ చేయాలని మరోసారి కోర్టు తీర్పు చెప్పింది. నాలుగేండ్లు గడిచిన తర్వాత సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ 2023లో యాజమాన్యం కోర్టుకెళ్లింది. ( కేసు నెంబర్‌ 488 /23) లో కార్పొరేషన్‌ అప్పీల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసం వీరికి అవసరమైన పోస్టులు లేకుంటే వెంటనే ఏర్పాటు చేసి వారిని పర్మినెంట్‌ చేయాలని కార్పొరేషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడి ఏడాది గడుస్తున్నా యాజమాన్యం గాని, సర్కార్‌గాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొత్తగా రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తమకు న్యాయం చేస్తారని సిబ్బంది గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

Spread the love