ఆర్నెళ్ల తరువాతే.. ‘స్థానిక’ సమరం..

– ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎన్నికల కోడ్‌ ఆటంకం..
– మళ్లీ స్థానిక సమరమంటే మరో ఆర్నెళ్లూ తప్పని ‘కోడ్‌’ ప్రభావం
– పాలనకు ఇబ్బందిగా ఉందనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు
– సర్పంచ్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలన్నీ అక్టోబర్‌ తరువాతనే..
– ఫిబ్రవరి1న ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం…
– జులై3న ముగియనున్న మండల, జిల్లా పరిషత్‌ల పాలన
– ఇప్పటికే ‘పల్లె’ల్లో పడకేసిన పాలన.. జీతాల్లేక ఇబ్బందుల్లో సిబ్బంది
ఈ ఏడాది ప్రారంభంలోనే కొలువుదీరిన రాష్ట్ర సర్కారుకువెంటనే వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలతో ఇచ్చిన హామీల అమలుపై పెద్దగా దృష్టిసారించలేకపోయింది. మార్చి నుంచి జూన్‌4ఫలితాల వరకు ఉన్న ఎన్నికల కోడ్‌తో కొత్త పనులూ ప్రారంభించలేకపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఫిబ్రవరి 1న ముగిసిన సర్పంచ్‌ల పాలనకాలం, జులై 3న ముగియనున్న మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలంతో ‘స్థానిక’ ఎన్నికల సమరం నిర్వహించాల్సి ఉంది. వెంటనే లోకల్‌బాడీ ఎన్నికలకు పోతే మళ్లీ ఎలక్షన్‌కోడ్‌తో పాలనపై ప్రభావం పడుతుందనే భావనలో రాష్ట్ర సర్కారు పడింది. దీంతో కనీసం ఆర్నెళ్ల వరకూ ఏ ఎన్నికల జోలికీ పోకుండా పాలనపై దృష్టిసారించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ‘స్థానిక’ సమరం అక్టోబర్‌ చివరి వారం తరువాతనే నిర్వహించాలనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఈనెల 13తో ముగిసిన నేపథ్యంలో వాటి ఫలితాలను జూన్‌ 4న లెక్కించనున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన విషయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సూత్రప్రాయంగా తొలుత ఆయన చెప్పిన నేపథ్యంలో పల్లెల్లో పొలిటికల్‌ వాతావరణం మారింది. గ్రామాల రిజర్వేషన్లు, ఎన్నికల సమయం, ఈసారి జనం ఏటువైపు ఉంటారోన్న చర్చ మొదలైంది. అయితే ప్రధానంగా కులగణన చేపడుతామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆ ప్రక్రయ పూర్తవ్వాలన్నా.. కనీసంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో వరుస ఎన్నికల కోడ్‌ రావడంతో పరిపాలనకు ఇబ్బందిగా మారిందని భావించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను అక్టోబర్‌ తరువాతనే నిర్వహించాలని వచ్చిన అభిప్రాయాలుసూత్రప్రాయంగా సంకేతాలు ఇస్తుండటం గమనార్హం.
ఈసారి అన్ని ఎన్నికలు ఒకేసారి!
సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను గతంలో మూడు దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్‌, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియగా, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వరకు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 5 వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి మూడు విభాగాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 2019 జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 2014 జనవరిలోనే మళ్లీఎన్నికలు జరపాల్సి ఉండే. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వెంటనే గ్రామపంచాయతీల ఎన్నికలకు పోకుండా స్పెషల్‌ అధికారులను నియమించారు. ప్రస్తుతం జూన్‌లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి జులైలో నోటిఫికేషన్‌ ఇస్తారని, ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. 2019 జులై 4న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లు కొలుదీరాయి. 2014 జులై 3 వరకు వీటి పదవీకాలం ముగిసి, జులై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే గ్రామపంచాయతీ ఎన్కిలే పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలో ఇవి కొద్దినెలలు కొనసాగనున్నాయి. అక్టోబర్‌,నవంబర్‌, డిసెంబర్‌మాసాల్లో ప్రాదేశిక ఎన్కిలు పూర్తవుతాయని, మండల, జిల్లా పరిషత్‌లు కొలువుదీరుతాయని అంచనా వేస్తున్నారు. 2014 సంవత్సరం మొత్తం ఎన్నికల సంవత్సరంగానే మిగిలిపోనుంది.
పల్లెల్లో పడకేసిన పాలన
ఈ ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన మొదలైంది. మండలంలో క్లస్టర్‌ గ్రామాలుగా ఎంపిక చేసి 10 మంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ ఇచ్చే నిధులు ముఖ్యమైన ఆర్థిక ఆధారాలు కాగా 2022 ఆగస్టు నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధుల రావడం లేదు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికీ 812 రూపాయల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల్సి ఉండగా అవికూడా రాకపోవడంతో పాలన సాగడం లేదు. దీంతో మేజర్‌ గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు కావడంతో జీతాలు సమకూరుతున్నాయి. చిన్న గ్రామపంచాయతీలకు తిప్పలు తప్పడం లేదు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.

Spread the love