డంపింగ్ యార్డ్ లో మళ్లీ చెలరేగిన మంటలు

– దట్టమైన పొగలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పరిసర ప్రాంతాల ప్రజలు
నవతెలంగాణ – భగత్ నగర్
కరీంనగర్‌ నగరపాలక సంస్థకు చెందిన డంప్‌యార్డులో మళ్లీ అగ్గి రాజుకుంది. గత మూడు రోజులుగా కరీంనగర్ డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగడంతో  దట్టమైన పొగలు వెలువడి తీవ్రమైన వాయు కాలుష్యం చోటు చేసుకుంటోంది.దీంతో  పరిసర ప్రాంతాలైన ఆటోనగర్, కోతిరాంపూర్,లక్ష్మీనగర్,గాయత్రినగర్, హొపుసింగ్ బోర్డు ప్రజలు  ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికితోడు డంప్‌యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మానేరు ఒడ్డున ఉన్న డంప్‌యార్డు బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పెద్దపల్లి బైపాస్‌పై వెళ్లే ప్రయాణికులకు రోడ్డు కనబడని పడని విధంగా పొగ కమ్మేసింది.  డంప్‌యార్డులో మంటలు అంటుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం ఫైర్ ఇంజిన్ లను పంపి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా విఫలం చెందినట్లు స్థానికులు చెప్తున్నారు.

పట్టని ప్రజారోగ్యం…మొద్దు నిద్ర వీడని బల్దియా
ఏ కాలమైనా డంపింగ్ యార్డ్ తో  సమస్యలు వస్తున్నప్పటికీ , పట్టించి పట్టించుకోనట్లుగా అధికారుల తీరు ఉంటోంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జరిమానా విధించే బల్దియా అధికారులు, డంపింగ్  యార్డ్  నిర్వహణ ఫై నిర్లక్ష్య వైఖరి వహించడం  విమర్శలకు తావిస్తోంది. బయో మైనింగ్ పేరిట యంత్రాన్ని కొనుగోలు చేసి చెత్తను రీసైక్లింగ్ చెయ్యాలని చూసినా ఆ ప్రయత్నం ఎడారిలో ఒయాసిస్ గా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రజలు కోరుతున్నారు.

Spread the love