ట‌మాటాలు అమ్మి కోటీశ్వ‌రుడైన రైతు..

నవతెలంగాణ-హైదరాబాద్ : టమాటా ధ‌ర‌లు ఆకాశాన్నాంటాయి. ప్ర‌స్తుతం కిలో ట‌మాటా ధ‌ర రూ. 100పైనే ప‌లుకుతోంది. ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల స‌మ‌యంలో ట‌మాటా అమ్మిన రైతులు కోటీశ్వ‌రులు అయ్యారు. అది కూడా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే. ఇలా ట‌మాటాలు అమ్మి ధ‌నికులైన‌ రైతుల జాబితాలో మ‌న మెద‌క్ జిల్లాకు చెందిన ఓ రైతు కూడా చేరాడు. మెద‌క్ జిల్లాలోని కౌడిప‌ల్లికి చెందిన రైతు మ‌హిపాల్ రెడ్డి(37) త‌న‌కున్న 40 ఎక‌రాల్లో వివిధ రకాల కూర‌గాయలు పండించాడు. 8 ఎక‌రాల్లో కేవ‌లం ట‌మాటా మాత్ర‌మే వేశాడు. మండుటెండ‌ల స‌మ‌యంలో ట‌మాటా పంట వేసిన‌ప్ప‌టికీ.. షెడ్ నెట్స్ ఉప‌యోగించి, ఆ పంట‌ను కాపాడాడు రైతు. ఇక ఎప్పుడైతే మార్కెట్‌లో ట‌మాటా ధ‌ర అమాంతం పెరిగిందో ఆ స‌మ‌యానికి మ‌హిపాల్ రెడ్డి ట‌మాటా పంట చేతికొచ్చింది. తాను పండించిన ట‌మాటాను అమ్మి నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కోటీశ్వ‌రుడైపోయాడు. రూ. 1.80 కోట్లు సంపాదించారు మ‌హిపాల్ రెడ్డి. కౌడిప‌ల్లి నుంచి ప‌టాన్‌చెరు, షాపూర్, బోయిన్‌ప‌ల్లి మార్కెట్ల‌కు ట‌మాటాను త‌ర‌లించి, విక్ర‌యించిన‌ట్లు మ‌హిపాల్ రెడ్డి చెప్పుకొచ్చాడు. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి కూర‌గాయ‌లు పండిస్తున్నాన‌ని కానీ, ఈ లాభం ఎప్పుడూ రాలేద‌న్నాడు. ఒక నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కోటి రూపాయాలు సంపాదించ‌డం ఆనందంగా ఉండ‌ట‌మే కాదు.. ఆశ్చ‌ర్యంగా కూడా ఉంద‌న్నాడు. ఈ సీజ‌న్‌లో మొత్తం 7 వేల బాక్సుల ట‌మాటాను విక్ర‌యించిన‌ట్లు తెలిపాడు. ఒక్కో బాక్సును రూ. 2,600కు విక్ర‌యించిన‌ట్లు పేర్కొన్నాడు.

Spread the love